Suryaa.co.in

Devotional

పునర్దర్శన ప్రాప్తిరస్తు.. లడ్డూ రుచి మళ్లీ సిద్ధిరస్తు..!

(తిరుపతి లడ్డూ చరిత్ర విశిష్టమైనది..అత్యంత ప్రాచీనమైనదని అంటారు.
స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్రమైనదిగా పేర్కొనే ఈ లడ్డు ప్రసాద వితరణ తిరుమల ఆలయంలో 1715వ సంవత్సరంలో ఇదే రోజున.. అంటే ఆగస్టు 2 నుంచి మొదలైందన్నది కొందరి కథనం..ఆ సందర్భాన్ని పురస్కరించుకుని రాసిన ఈ కవిత తిరుపతి లడ్డులోని తియ్యదనాన్ని కొంతైనా అందించిందని మీకు అనిపిస్తే ధన్యున్ని)

తిరుపతి లడ్డు..
ఏడుకొండలూ ఎక్కినాక
తిరుమలేశుని లోగిలి
అక్కడ అందే
ఏడుకొండలవాడి ఎంగిలి..
వెంకన్న ప్రాసాదంలో
చవిచూసే ప్రసాదం..
శ్రీనివాసుని నైవేద్యం..
అబ్బురమనిపించే అనుభవేకవైద్యం..!

అదేమిటో..తిరుపతి యాత్ర
అనగానే అద్భుతమైన
ఆధ్యాత్మిక పులకింత..
భారతావనిలో
ఎన్ని క్షేత్రాలున్నా
తిరుమల
పవిత్రభావనల అల
నిజమయ్యే జన్మజన్మల కల..
ఒక రకమైన చింతనలో
పడేసే వల..
తిరుమల సందర్శనం..
స్వామి దర్శనం..
కలియుగంలో
ఆధ్యాత్మికతకు నిదర్శనం..!

ఒక్కో కొండ దాటుతుంటే
మెట్టు మెట్టు ఎక్కుతుంటే
అందమైన ఆ ప్రకృతి
తీసిపారేయదా
మనలోని వికృతి..
ఇహంపై మోహం నశించి..
తనువెల్లా పరవశించి..
నీలోని జీవుడికి దూరంగా..
దేవుడికి దగ్గరగా..
అదే మొక్షమై..
పాపం క్షయమై..!

తిరుమల యాత్రలో
భగవంతుని దర్శనంతో సమానమైన తృప్తి..
ఆరగిస్తుంటే నీ కళ్ళలో దీప్తి..
కైవల్య ప్రాప్తి..
స్వామి లడ్డూ ప్రసాదం..
పంచభక్ష్యాలూ..షడ్రుచులూ
అందుబాటులో ఉన్నా
సుప్రభాతాన
గోవిందుడి తొలి రుచి..
అద్భుతమైన
స్వామి అభిరుచి
లడ్డూ..
ఏడేడు లోకాలలోనూ
మరి ఏ భక్ష్యంలోనూ
లేని తీపి.. వైకుంఠవాసుని
కడుపు తీపి…
ఇది సాక్షాత్తు లక్ష్మీపతి లిపి!

లడ్డూ అస్వాదనతోనే
తిరుపతి యాత్రకు సమాప్తి..
నీకు తృప్తి..మోక్ష సంప్రాప్తి..
దివిలోని అమృత భాండం
శ్రీనివాసుని భాండాగారం
నుంచి జారి..
బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి
నాదాశీస్సులు పొందినదై..
శివలోకమ్మున చిద్విలాసమున
ఢమరుధ్వనిలో గమకితమై..
దివ్యసభలలో నవ్యలాస్యముల
పూబంతుల
చామంతిగ ఎగసి..
నీరద మండల నారద తుంబుర మహతీ గానపు మహిమలు తెలిసి..తడిసి పునీతమై..
తిరుమల చేరి..
అయింది శ్రీవారి లడ్డు..
దివిలోని సుర..ఇలలోన సిరి!

ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286

LEAVE A RESPONSE