– కిర్లంపూడి కాపు పీఠాథిపతి ముద్రగడ మహాసూక్తాభిషేకం
– కులాల కొట్లాటలు వద్దన్న శాంతికపోతం
– కలసిమెలసి ఉండాలన్న హితవు
– కోనసీమ జిల్లా పేరుపై లేటయినా లేటెస్టు స్పందన
– ముద్రగడ.. మారిపోయారోచ్
( మార్తి సుబ్రహ్మణ్యం)
గౌతమ బుద్ధుడు వెళుతూ వెళుతూ బోధివృక్షాన్ని బహుశా తూ.గో.
జిల్లా కిర్లంపూడిలో వదిలేసినట్లున్నారు. ఆయనకు ఎలాగయితే అదే బోధివృక్షం కింద జ్ఞానోదయయిందో.. మన కిర్లంపూడి కాపు పీఠాధిపతి, జాతి మహానేత ముద్రగడ పద్మనాభానికీ సడన్ గా కులాల కొట్లాటలపై కాస్తంత ఆలస్యమయినా జ్ఞానోదయమయింది. అందువల్ల బుద్ధుడు తనలో మార్పునకు కారణమయిన బోధివృక్షాన్ని, కొంపదీసి కిర్లంపూడిలో వదిలేశారామోనన్న డౌటనుమానం అటు ఆయన జాతితోపాటు, ఇతర జాతులకూ వస్తోంది.
మరి ఒక జాతి నాయకుడు.. హటాత్తుగా జాతీయ నాయకుడు కావడం మామూలు ముచ్చట కాదు కదా?! ఎంతో మార్పు వస్తే తప్ప, అలా మారడం మహా కష్టం. ఒక బుద్ధుడు, ఒక వాల్మీకి మాదిరిగానే మన ముద్రగడలోనూ మహామార్పు రావడమంటే చిన్న, సన్న విషయం కాదు మరి! కాపుల రిజర్వేషన్ల కోసం అనేక సార్లు నిరాహారదీక్షలు చేసి, తమ డిమాండు అప్పట్లో కరకట్టపై ఉంటున్న చంద్రబాబుకు వినిపించేంత రేంజ్ లో, సకుటుంబ సపరివార సమేతంగా కంచాలు మోగించిన దిగ్రేట్ ముద్రగడ… అదే చంద్రబాబు జమానాలో వేదికమీద జాతినుద్దేశించి ప్రసంగిస్తూ, హటాత్తుగా దిగిపోయి రైలు పట్టాల దగ్గరకు వెళ్లే క్రమంలో, రైలు బోగీలు తగలబడిన సుమధుర ఘట్టానికి నాయకత్వం వహించిన ది గ్రేట్ ముద్రగడ… గత సర్కారు తీర్మానించిన కాపు రిజర్వేషన్ల అమలుపై మూడేళ్ల నుంచి మాట్లాడకుండా మహా మౌనవ్రతం చేస్తున్న ది గ్రేట్ ముద్రగడ.. కులాల గురించి కొట్లాడుకోవద్దని, కోనసీమకు అంబేద్కర్ పేరే కానిచ్చేయమని కాపు పీఠాథిపతి హోదాలో చెప్పడమే అద్భుతం.
చాలాకాలం తర్వాత ముద్దరగడ జాతికి.. అంటే యావత్ జాతిజనులకు ఒక బహిరంగ లేఖ వదిలారు. అంతా సోదరభావంతో కలసి మెలసి ఉండాల్సిన సమయంలో కులాలు-మతాల కుంపట్లలో మగ్గిపోతున్నామన్నది ఆయన వెలిబుచ్చిన ఆవేదన. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టినందుకు, అలజడులు సృష్టించుకోవడం ఏమీ బాగోలేదన్నది కిర్లంపూడి కాపు పీఠాథిపతి ఆగ్రహభాషణం. అలాంటి మహావ్యక్తి పేరు కోనసీమకు పెట్టినందుకు గర్వంగా ఫీలవ్వాలని ముద్రగడ పిలుపునిచ్చారు.
తాను ఏ స్వార్ధంతోనూ ఈ లేఖ రాయడం లేదని ఆయన సెలవిచ్చారు. ఆ విషయం మాత్రం నిజమే. ఆయనకు ఎలాంటి స్వార్ధం ఉండదు. కాపుజాతి కోసం చంద్రబాబుపై ఐదేళ్లు పోరాటం చేసినప్పుడు గానీ, తుని రైళ్ల దగ్ధం కేసులో గానీ, నిరాహారదీక్షల విషయంలోగానీ ముద్రగడకు ఎలాంటి రాజకీయ స్వార్ధం లేదు. అలాగే టీడీపీ జమానాలో వైసీపీ ఎమ్మెల్యేలతో మంతనాలు సాగించినప్పుడు కూడా ఆయనకు ఎలాంటి స్వార్థం లేదు. గత మూడేళ్ల నుంచి కాపు సమస్యలపై గళమెత్తకుండా, మౌనంగా ఉంటున్నా, అందులోనూ స్వార్ధం లేదు. ఒట్టు. నిఝంగా నిజం!
మరి చంద్రబాబు హయాంలో ఈ శాంతికపోత ప్రవచనాలు ఏమయ్యాయి? అప్పుడు చేసిన గత్తర మాటేమిటి? అంటే టీడీపీ అధికారంలో ఉంటేనే సమస్యలు గుర్తుకు వస్తాయా? ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా జగన్ సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడకపోవడంలో మతలబేమిటి? అన్న ప్రశ్నలు వేసిన వారు జాతి ద్రోహుల కిందే లెక్క. నిజమే. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడంటే ఏదో.. నూనూగు మీసాల నూత్న యవ్వనం, ‘యువరక్తం’ కాబట్టి ముద్రగడలో మార్పు రాకపోవచ్చు. ఈ ‘మూడేళ్లలో పెద్దరికం వచ్చింది కాబట్టి ఆయనలో మార్పు రావచ్చు. తప్పేమిటి? అదేదో సినిమాలో చెప్పినట్లు.. ఏం మనుషుల్లో మార్పు రాకూడదా? అసలు ఒక జాతి నేత, ఏకంగా జాతీయ నేతగా అవతరించినందుకు అభినందించాల్సింది పోయి… ఈ మార్పు టీడీపీ ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? వైసీపీ జమానాలోనే ఎందుకు వచ్చింది? ఇప్పుడు కాపు సమస్యలు ఎందుకు గుర్తుకు రావడం లేదు? వంటి మతిలేని ప్రశ్నలు వేయడం తప్పు కదా?
అన్నట్లు కోనసీమ జిల్లా పేరు వ్యవహారంలో బోలెడుమంది కాపు నేతలు అరెస్టయి, పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నప్పటికీ.. కిర్లంపూడి కాపు పీఠాథిపతి ఇప్పటిదాకా ఖండించకుండా, ఎప్పుడో సర్దుకున్న అంబేద్కర్ పేరు అంశంపై మళ్లీ లేఖ రాసి, అందరినీ కలసిమెలసి ఉండాలని చెప్పారంటే.. ఖచ్చితంగా ఆయన మహాత్ముడే. జాతిజనుల ‘అగ్నానాన్ని’ మన్నించు మహాత్మా?!