Suryaa.co.in

Features

ప్రతి సంపుటి తరిమికొడుతూ చీకటి!

ఈనాడు..
ఒక మానియా..
అదో దునియా..
అందుకే నలభై ఎనిమిది సంవత్సరాలుగా
అదే తాలియా…!

ఈనాడు
అక్షరమే ఆయుధమై..
సమాజహితంలో
తానే ఒక సమిధయై..

ఎప్పుడో పుట్టినా వార్త.
ఈనాడు దాని కర్త..
ఆ వార్తకు సంస్కర్త..
కృతిభర్త..!

ఇలా ఉంటే అది వ్యాసమని..
అలా చదవడమే పాఠకుని వ్యాసంగమని..
నిర్వచించి..అదే ప్రవచించి..
అలాగే రచించి..
పత్రికకి ప్రమాణం
నిర్దేశించిన
చారిత్రక ప్రయాణం..!

అసలు ఆ పేరులోనే
ఉంది మ్యాజిక్..
అచ్చ తెలుగు లాజిక్..
ఆ పత్రిక చదువుతుంటేనే
అదోలాంటి కిక్..
ఈనాడుకు మాత్రమే సాధ్యమైన
గమ్మత్తైన ట్రిక్..!

నీ భాష…నా యాస..
నీ లిపి..నా లిపి..
కలగలిపి…
ఈనాడు భాష..
తెలుగోడి గుండె ఘోష..
నీ ఆసక్తి..నా అనురక్తి..
రామోజీరావు యుక్తి..
తెలుగు భాషకు
ఈనాడు ప్రథమావిభక్తి..!

తెలుగు జాతి ఆత్మగౌరవం
నందమూరి రామారావు
ఆయన ప్రస్థానం..
కాదేదీ ప్రచారానికి అనర్హం..
తెలుగు విభుడి ప్రసంగాలు..
ఆయన స్నానపానాలు..
ఆ జనం..ఆ ప్రభంజనం..
ఈనాడు చేర్చింది బహుజనం..
ఎన్టీఆర్ కీర్తి అయింది
ద్విగుళం.. బహుళం!

ఈనాడు మూలవిరాట్టు..
ఆధునిక మీడియా సామ్రాట్టు..
పట్టిందే పట్టు..
విడిచిపెడితే ఒట్టు..
పోరాటమే పధం..
అక్షరమే ఆయుధం..
ఈనాడే పాశుపతం..
అదే రామబాణం..
అదే సుదర్శనం..
ప్రతి ఉదయం
సంచలనంతో దర్శనం..
రామోజీ ధైర్యానికి
ఆ పత్రికే నిదర్శనం..!

ఈనాడు
ఒక వ్యసనం..
ఒక శాసనం…
పాఠకుడికి ఏకాసనం..
అధినేతకు సింహాసనం..!

ఈనాడు
తెల్లారే నిద్రలేపే అలారం..
పొద్దున్నే తాగే మంచి కాఫీ..
నీ చుట్టూ జరిగే
చిత్రవిచిత్రాల కూపీ..
సమాజంలోని కొన్ని జాడ్యాల
చికిత్సకు వార్తాథెరపీ..!

ఈనాడు
ఇంటింటి నేస్తం…
సమాచార సమస్తం..
అన్యాయాలపై ఎక్కుపెట్టిన
అక్షరాస్త్రం..
తెలుగు మీడియా శస్త్రం..
జర్నలిజమనే శాస్త్రం..
రామోజీరావు సామ్రాజ్యంలో
అత్యంత విలువైన దస్త్రం!

ఎలిశెట్టి సురేష్ కుమార్
జర్నలిస్ట్
9948546286

LEAVE A RESPONSE