Suryaa.co.in

Andhra Pradesh

పనీపాట లేని పార్టీలే దేవుడ్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తాయ్

– పండగ వేళ.. స్వార్థపర శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– నీతిమాలిన, దిగజారిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు ఆలోచనలు ఏ స్థాయికైనా వెళ్లొచ్చు
– బూటు కాళ్ళతో పూజలు చేసి హిందూ ధర్మాన్ని కించపరిచిన వ్యక్తి చంద్రబాబు
– విజయవాడలో బాబు కూల్చిన దేవాలయాలను జగన్ పునర్ నిర్మించారు
– వినాయక చవితి వేడుకల్లో కొత్త ఆంక్షలేవీ లేవు
– టీడీపీ హయాంలో వినాయకుని మండపాలకు కనీస విద్యుత్ చార్జీ రూ.1000.. నేడు రూ. 500
– వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి

ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసినందుకు సీఎంకి ధన్యవాదాలు
పదేళ్ళుగా, గత ప్రభుత్వాలు పట్టించుకోని హిందూ ధార్మిక పరిషత్‌ ను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గతంలో టీడీపీ-బీజేపీ సంయుక్త ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేసిన విషయం అందరికీ తెలుసు. ప్రతి మనిషికి ఒక ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వారు నమ్మిన ధర్మాన్ని వారు కాపాడుకునే క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దేవుడిని నమ్మిన వ్యక్తి. దేవుడి అనుగ్రహం- ప్రజల దీవెనలు లేనిదే ఏమీ చేయలేమని పదే పదే చెప్పే వ్యక్తి.

పండగ పూట టీడీపీ-బీజేపీ-జనసేన దుష్ప్రచారం
వినాయక చవితి పండుగ నేపథ్యంలో మండపాల ఏర్పాటు విషయంలో గత వారం రోజులుగా సోషల్‌ మీడియాలో, ఓ వర్గం మీడియాలో పనిగట్టుకుని ప్రజల్ని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. తాను అధికారంలో ఉనప్పుడు, హిందూ ధర్మాన్ని కాపాడని, ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయాలనే కనీసం ఆలోచన చేయని చంద్రబాబు నాయుడు గానీ, అలాగే హిందూ ధర్మాన్ని కాపాడటంలో మేమే ముందుంటామని ప్రచారం చేసుకునే బీజేపీగానీ, వాస్తవాలేవీ తెలుసుకోకుండా, వీళ్ళు ఏది చెబితే దానికి తానా తందాన అనే పవన్‌ కల్యాణ్‌ గానీ.. వీరంతా కలిసి వినాయక చవితి మండపాల నిర్వహణకు మా ప్రభుత్వమేదో కొత్తగా ఆంక్షలు విధించినట్లుగా, చవితి పండుగను మేమేదో జరుపుకోనివ్వకుండా ప్రయత్నిస్తున్నట్లుగా, ఇష్టానుసారంగా నోటికొచ్చినట్లు మాట్లాడటం, వాటిని మీడియాలో ప్రచారం చేయడం అత్యంత దురదృష్టకరం.

బూట్లతో పూజలు చేసి హిందూ ధర్మాన్ని కించపరిచింది బాబే

హిందూ ధర్మాన్ని పాటిస్తానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎన్ని సందర్భాల్లో ఆ ధర్మాన్ని కించపరిచారో రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు చంద్రబాబు కాళ్లకు బూట్లు ధరించే పూజలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. అలాంటి చంద్రబాబు, మా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదు. గోదావరి పుష్కరాలను చాలా గొప్పగా నిర్వహించామని చెప్పుకోవాలనే ఆరాటంలో, ప్రచార పిచ్చితో, అక్కడ షూటింగ్ లు నిర్వహించి, 29 మంది ప్రాణాలను బలిగొన్న చంద్రబాబు, ఇవాళ మా ప్రభుత్వంపై విమర్శలు చేయడమా?. ప్రజలకు ఇవన్నీ గుర్తుండవని, వారికి జ్ఞాపకశక్తి తక్కువ అని భావించే చంద్రబాబు, హిందూ ధర్మం గురించి, దేవాలయాల గురించి నీతులు చెప్పడం సిగ్గు చేటు.

సర్వమతాలను ప్రేమించే ముఖ్యమంత్రి జగన్
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సర్వ మతాలను ప్రేమిస్తారు. ప్రతి ఒక్కరి మనోభావాలను గౌరవిస్తారు. ఎక్కడకు వెళ్లినా హిందూధర్మాన్ని పాటించడానికి అన్ని జాగ్రత్తలు ఆయన తీసుకుంటారు. విభిన్న మతాలు, ఆచారాలు ఉన్న మనమంతా కూడా దేవుని కృపతోనే ఏ పని అయినా చేయగలుగుతామని ముఖ్యమంత్రి గట్టిగా నమ్ముతారు. అలాంటి ముఖ్యమంత్రి పై నిందలు వేయడం అంటే.. ఆకాశంలో సూర్యుడిని చూసి ఉమ్ము వేస్తే… అది వచ్చి మీ మొహం మీదే పడుతుంది.
గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చంద్రబాబు నాయుడు మర్చిపోయినట్లు ఉన్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి ఉన్న 23 స్థానాలు కూడా దక్కించుకోలేనంతగా దిగజారిపోతున్న ఆయన ఆలోచనా విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు. జిత్తులమారి చంద్రబాబు నాయుడు, తన స్వార్థ రాజకీయాల కోసం ఏ స్థాయికైనా దిగజారుతాడు, అటువంటి వ్యక్తి పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలి.

రాష్ట్రంలో రెండు బీజేపీలు ఉన్నాయి. ఒకటి చంద్రబాబు అనుకూల తెలుగుదేశం బీజేపీ, రెండోది బీజేపీ. అందులో, ఒకవర్గం ప్రధాన లక్ష్యం తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీలో ఉన్న ఒక వర్గాన్ని కాపాడుకోవడమే.
ఇటువంటి తెలుగుదేశం కుట్రదారులు బీజేపీలో ఉన్నంతకాలం.. ప్రధాని నరేంద్ర మోదీ ఎంతబాగా పనిచేసినా ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి మెరుగు పడటం కల్ల. దయచేసి ఆ కల్లబొల్లి కబుర్లు నమ్మవద్దు. పవన్‌ కల్యాణ్‌ కూడా చంద్రబాబు డైరెక్షన్‌లో, ఆయన ఇచ్చే స్క్రిప్ట్‌ చదవడం మానేసినప్పుడు మాత్రమే ఈ రాష్ట్ర ప్రజలు ఆయన్ను నమ్ముతారు.

బాబు కూల్చిన దేవాలయాలను జగన్ పునర్ నిర్మించారు
గత టీడీపీ ప్రభుత్వంలో కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో దేవాలయాలను కూలగొడితే వాటిని పునర్మించాలని అడిగినా నిర్లక్ష్యం వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రి జగన్, టీడీపీ హయాంలో కూల్చిన ఆ గుళ్లను పునర్ నిర్మించడమే కాకుండా రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని కాపాడటానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ధార్మిక పరిషత్‌ను కూడా ఏర్పాటు చేసినందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

వినాయక చవితికి కొత్తగా ఎటువంటి ఆంక్షలు లేవు
వినాయక చవితి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎలాంటి ఆంక్షలు, నిబంధనలు పెట్టలేదు. రాష్ట్రంలో పండుగలు జరుపుకునే విషయంలో ఎవరికీ ఇబ్బందులు కలగకుండా మతసామరస్యం కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అది వినాయక చవితి కావచ్చు, రంజాన్‌, క్రిస్మన్‌ కావచ్చు … ఏమతం వారైనా ఇబ్బంది పడే పరిస్థితులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అది ఏ ప్రభుత్వంలో అయినా జరుగుతుంది. గతంలో లానే వినాయక చవితి ఉత్సవ కమిటీలు, స్థానిక పోలీసులు సమన్వయంతో వినాయక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు కొత్తగా ఎలాంటి నిబంధనలు అమలు చేయడం లేదు.

మండపాలకు కనీస కరెంటు చార్జీ గతంలో రూ. 1000.. ఇప్పుడు రూ. 500
వినాయక మండపాలకు కరెంట్‌ ఛార్జీలపై కూడా వక్రీకరించి మాట్లాడటం బాధాకరం. మండపాలకు గతంలో కనీస విద్యుత్ చార్జీ రూ.1000 ఉంటే.. దానిని ఇప్పుడు ఐదు వందలకు తగ్గించాం. మంచి వాతావరణంలో రాష్ట్ర ప్రజలు వినాయక చవితి వేడుకలు నిర్వహించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్‌ శాఖతో పాటు దేవాదాయ శాఖ కూడా చర్యలు తీసుకుంటోంది. అయినా ఇవేమీ తమకు పట్టనట్లుగా, ప్రతి దాన్ని కూడా రాజకీయ కోణంలో చూస్తూ, రాజకీయం చేస్తున్న కొన్ని పార్టీలకు పనీపాట లేకే పండగలను, దేవుణ్ణి అడ్డుపెట్టుకుని, ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నట్టు అర్థమవుతుంది.

ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి విపక్షాల కళ్లకు కనిపించడం లేదు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి, ఏ శాఖ తీసుకున్నా, ఏ అంశం అయినా గతంలో కంటే మెరుగైన ఫలితాలు వస్తున్నా, వాటి గురించి మాట్లాడటానికి చంద్రబాబుకు నోరు పెగలడంలేదు. ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా, సున్నితమైన అంశాలపై ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తే.. గతంలో 23 సీట్లు వస్తే… రాబోయే ఎన్నికలలో రెండో, మూడో కూడా రానటువంటి పరిస్థితులు వస్తాయని చెబుతున్నాం.
నీచ రాజకీయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

వినాయక చవితి నేపథ్యంలో అసత్య ప్రచారాలు చేయడంలో వీళ్ల అత్యుత్సాహం చూస్తుంటే.. ఏమైనా జరగవచ్చు, ఏ నీచానికైనా వీళ్ళు పాల్పడవచ్చు అని అనిపిస్తుంది. కాబట్టి ఉత్సవ కమిటీలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. పోలీసులు కూడా శాంతిభద్రతలు కాపాడేలా వ్యవహరించాలి. డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి కూడా శాంతిభద్రతల విషయంపై ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విగ్రహాల ఏర్పాటు మొదలు నిమజ్జనం వరకూ సాఫీగా జరిగేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకుంటున్న చర్యల వివరాలను ఉత్సవ కమిటీలు ఇవ్వాలని చెప్పడం కొత్త విషయమేమీ కాదు.

రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళేలా, ప్రజలంతా సుభిక్షంగా ఉండేలా, ఎలాంటి విఘ్నాలు రాకుండా వినాయక చవితి పండుగను ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలి. తమ స్వార్థం కోసం, రాజకీయమే పరమావధిగా ప్రవర్తించే కొన్ని స్వార్థపర శక్తుల మాటలను పట్టించుకోవద్దని, అటువంటి వారిపట్ల జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం.

LEAVE A RESPONSE