Suryaa.co.in

Features Places

హైదరాబాద్ లో చక్కటి విడిది రూ.200లకే

-వసతిరూ. 40వేలకే పెండ్లి మండపంతో పాటు 15 గదులు
-సకల హంగులతో కాచిగూడ తుల్జాభవన్‌

వైద్యం కోసమని రోగులు, సిటీ అందాలను చూసేందుకు పర్యాటకులు నిత్యం నగరానికి వస్తుంటారు. ఒక్కోసారి ఇక్కడే విడిది చేయాల్సి ఉంటుంది. లాడ్జిల్లో రూమ్స్‌ తీసుకుంటే.. ఆర్థిక భారం తప్పదు. ఒక్కరోజు ఉండాలన్నా.. ఎక్కువ మొత్తంలో రుసుము చెల్సించాల్సి వస్తుంది. ఇది పేదలు, సామాన్యులకు కొంత ఇబ్బందే. అలాంటి వారి కోసం ఇంటిని మరిపించేలా చక్కటి వసతి కల్పిస్తున్నది కాచిగూడలోని తుల్జాభవన్‌. తెలంగాణ దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ భవన్‌లో నామమాత్రపు ధరతో అంటే నలుగురికి రోజుకు రూ. 200కే వసతి కల్పిస్తున్నారు.

ఇతర రాష్ట్రాల పర్యాటకులు..
నగరం నడిబొడ్డున ఉండటం, పార్కింగ్‌ రవాణా సౌకర్యం, తక్కువ చార్జీ ఉండటం వల్ల ఈ భవన్‌ మంచి ప్రాచుర్యం పొందింది. వివిధ రాష్ట్రాల నుంచి యాత్రికులు, వివిధ వైద్యశాలలకు వచ్చే రోగులు, వారి కుటుంబసభ్యులు నిత్యం ఇక్కడ బస చేస్తుంటారు. ఎక్కువగా ఏపీ, బెంగళూరు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ , పంజాబ్‌, కర్ణాటక, హర్యానా, గోవా తదితర రాష్ర్టాల నుంచి వచ్చే టూరిస్టులు ఇక్కడే విడిది చేస్తారు. అలా వచ్చే ఆదాయంతోనే భవనాన్ని ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తున్నారు. అయితే ఈ విడిది కేంద్రంలో తక్కువ చార్జీలతో సకల సౌకర్యాలు ఉన్న విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా నగరానికి వచ్చే గ్రామీణ ప్రాంతాల వారికి ఈ భవనం గురించి తెలియకపోవడం వల్ల వసతి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు.

వివాహ వేడుకలకు..
శతాబ్దాల కిందట నిర్మించిన ఈ భవనానికి కొత్త హంగులు సమకూర్చారు. మరింత ఆధునికంగా తీర్చిదిద్దారు. సకల సౌకర్యాలు కల్పించారు. టూరిస్టుల కోసం ప్రత్యేక వంటశాల గదిని నిర్మించారు. ప్రస్తుతం 18 గదులు అందుబాటులో ఉండగా, అన్నింటిల్లో బాత్‌రూంలను ఏర్పాటు చేశారు. ఇటీవలే పేదల సౌకర్యార్థ్ధం తక్కువ ఖర్చుతో పెండ్లిళ్లు చేసుకోవడానికి టెంట్‌ సామాన్లు, 15 గదులను కేవలం రూ.40 వేల ప్యాకేజీతో ఇస్తుండటం విశేషం.

ఆలయం.. గ్రంథాలయం..
ఈ తుల్జాభవన్‌లో పురాతన రామాలయం ఉంది. ఏటా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. ఇక యువత, నిరుద్యోగులు, పాఠకుల కోసం గ్రంథాలయాన్ని సైతం ఏర్పాటు చేశారు. ప్రతి ఆదివారం పలు స్వచ్ఛంద సంస్థలు వైద్యశిబిరాలు నిర్వహిస్తుంటాయి.

ఎంతో మేలు…
పేద, మధ్యతరగతి ప్రజల కోసం తక్కువ ఖర్చుతో పెండ్లిండ్లు చేసుకోవడానికి కేవలం రూ.40 వేల ప్యాకేజీ ఇవ్వడం శుభసూచికం. కొన్ని నెలలుగా మధ్యతరగతి ప్రజలు ఈ భవన్‌లో పెండ్లిళ్ల్లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దానికి తోడు బయట లాడ్జిలతో పొల్చితే ఇక్కడ కేవలం రూ.200 చెల్లిస్తే నలుగురికి వసతి కల్పిస్తున్నారు -పట్లూరి సతీశ్‌, యాత్రికుడు

అనేక సౌకర్యాలు అందుబాటులో..
నగరంలోని వివిధ ఆస్పత్రులకు వచ్చే రోగులు, వారి కుటుంబసభ్యులకు అందుబాటు ధరలో అంటే నలుగురికి రోజుకు కేవలం రూ.200లకే తుల్జాభవన్‌లో వసతి కల్పిస్తున్నాం. వివిధ పనుల కోసం వచ్చే పర్యాటకులు ఇక్కడ వసతి పొందడానికి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. నగరం నడి బొడ్డున ఉండటం వల్ల ఇక్కడి నుంచి ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు రవాణా సౌకర్యం కూడా ఉన్నది. వసతి పొందాలనుకునే వారు -9491000687, 8309481306 నంబర్లలో సంప్రదించవచ్చు.

-ఎ.బాలాజీ(దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌, కాచిగూడ తుల్జాభవన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)

LEAVE A RESPONSE