-సినిమా డైలాగులు వల్లెవేస్తే వచ్చేది నోరు నొప్పే!
-వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడుకు రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై క్లారిటీ రావడం లేదు. పార్టీ కార్యకర్తలకు ఆయన తన అయోమయాన్ని పంచుతున్నారు. ‘అంతా సవ్యంగా జరిగితే జగన్ అధికారంలో ఉండేది ఇక 18 నెలలే.’ అని నిన్న మంగళగిరి పార్టీ సమావేశంలో చంద్రబాబు అన్నారంటే..మనం ఏమనుకోవాలి? అంతా సవ్యంగా జరగడం అంటే–2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు తండ్రీకొడుకుల బృందం పన్నుతున్న అప్రజాస్వామిక పథకాలు విజయవంతం కావడమా? అనే అనుమానం వస్తోంది కొందరు అమాయక పచ్చ పార్టీ కార్యకర్తలకు. శాసనసభ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న తరుణంలో ప్రధాన విపక్ష నేతలోని ఈ గందరగోళ ధోరణి, దాపరికం పాటించే వైఖరి మిగిలిన వారికి ఉత్సాహం ఇవ్వవు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో సమర్ధ పాలకపక్షం మరింత ప్రజారంజకంగా పరిపాలించాలంటే..మంచి బాధ్యత, వివేకం గల ప్రతిపక్షం కూడా ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వాన నడుస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజంగా చలనశీలత, నిరంతర చైతన్యం ఉన్న పాలకపక్షం. కాని, 40 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో నూరు సంవత్సరాల వయసులో ఉండే వృద్ధాప్యాన్ని సంపాదించింది. చినబాబు లోకేష్ 2017లో తండ్రి మంత్రివర్గంలో చేరాక టీడీపీ పాలన, పార్టీ యంత్రాంగం పూర్తిగా భ్రష్ఠుపట్టాయి. బాధ్యతగల చురుకైన ప్రతిపక్షంగా తన పాత్రను తెలుగుదేశం సవ్యంగా పోషించలేకపోతోంది. చినబాబుకు పరిపక్వత లేదనుకుందాం…పోనీ 72 ఏళ్ల ‘చంద్రన్న’ ఏమైనా టీడీపీని సమరశీల ప్రతిపక్షంగా ముందుకు దూకించగలుగుతున్నారా? అంటే లేదనే సమాధానం వస్తోంది.
గత మూడేళ్లుగా వైఎస్సార్సీపీ సర్కారుపై అడ్డగోలు వీధి పోరాటాలకు తెగబడుతున్న తెలుగుదేశం కార్యకర్తలను చంద్రబాబు గారు ఉత్సాహ పరచడంలో తప్పులేదు. అయితే, వారిని దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులతో పోల్చారు. అంతటితో ఆగలేదు. స్వాతంత్య్ర సమరయోధులను దేశం ఇంకా ఎలా గౌరవిస్తోందో అలాగే ఘర్షణలకు దిగే, పోలీసులతో గొడవపడి జైళ్లకు పోయే పార్టీ కార్యకర్తలకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని పైన చెప్పిన పార్టీ మీటింగులో చంద్రబాబు గారు అన్నారంటే ఆయన ‘మైండ్’ సెట్ ఏమాత్రం మారలేదని స్పష్టమౌతోంది. 44 ఏళ్ల రాజకీయ అనుభవం పెట్టుకుని ఆయన ఈ రకంగా పార్టీ నేతలతో మాట్లాడుతున్నారంటే ఆంధ్రా జనం ఏమనుకోవాలి? ‘పోలీసులు లేకుండా రండి. మీ అంతుచూడడానికి ఒక్క నిమిషం చాలు..’ అని పాలకపక్షానికి ఆయన సవాలు విసిరారు అంటే… పుష్కరకాలం దాటి సీఎం పదవిని వెలగబెట్టినది చంద్రబాబేనా? అనే అనుమానం వస్తోంది.