-తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో కేసీఆర్ కొత్త భాష్యం
-సెప్టెంబర్ 17నుండి అక్టోబర్ 2 వరకు విస్త్రత సేవా కార్యక్రమాలు నిర్వహించండి
-ఉమ్మడి హైదరాబాద్ కోర్ కమిటీ సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ వెల్లడి
తెలంగాణ పోరాట చరిత్రను తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. అందులో భాగంగానే తెలంగాణ విమోచన దినోత్సవాలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త భాష్యం చెబుతున్నారని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ఉమ్మడి హైదరాబాద్ జిల్లా కోర్ కమిటీ సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ తదితరులు హాజరైన ఈ సమావేశంలో ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో పార్టీ పరిస్థితి, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై దాదాపు 2 గంటలకుపైగా చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు….
దేశమంతటికీ 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే… తెలంగాణకు మాత్రం 13 నెలలు ఆలస్యమైందన్నారు. నాటి నిజాం రాక్షస పాలనలో తెలంగాణ ప్రజలు నలిగిపోయారన్నారు. నిజాం అరాచకాలు, రజాకార్ల పాలనపై తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, కొమరం భీం, షోయబుల్లాఖాన్ వంటి తెలంగాణ పోరాట యోధుల చరిత్రను భావి తరాలకు తెలియనీయకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
అందులో భాగంగా దారుస్సలాం నుండి వచ్చే నిర్ణయాలకు తలొగ్గి తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో కేసీఆర్ కొత్త భాష్యం చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్ చేస్తున్న అరాచకాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు విస్త్రతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.