Suryaa.co.in

Telangana

గ్యాస్ సిలిండర్, యూరియా బస్తాలపై మోదీ ఫొటో పెడతాం

-ప్రధాని మోదీ ఫొటో గ్యాస్ సిలిండర్, యూరియా బస్తాలపై తప్పక‌ పెడతాం.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్
-సంక్షేమ సారథి‌ సీఎం కేసీఆర్…సంక్షేమ పథకాల వ్యతిరేకి ప్రధాని ‌మోదీ
-సంక్షేమ పథకాలు ఆపాలంటున్న ప్రధాని మోదీ
-ప్రధాని మోదీ బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి పోయిన వాళ్ల మిత్రులకు రూ. పది లక్షల కోట్లు పంచుతున్నడు కానీ పేద వాళ్లకు ఉచితాలు ఇస్తే తప్పంటున్నారు
-నిజామాబాద్ లో ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కవిత

ప్రధాని మోదీ‌ ఫొటో గ్యాస్ సిలిండర్, యూరియా బస్తాలపై తప్పక పెడతామని, కేంద్ర ‌ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల ‌కవిత దీటుగా కౌంటర్ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆసరా ఫించన్‌ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సితారామన్‌ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటనకు ‌వచ్చి రేషన్‌ ‌షాపులలో ప్రధాని మోదీ ఫోటో ఎందుకు లేదని అడుగుతున్నారని, ఎక్కడైనా రేషన్ షాపులో ప్రధాని ఫొటోలు పెడతారా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చి పంచాయితీ పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్‌ను ఆగం పట్టించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా పెన్షన్
57 సంవత్సరాల పైబడిన వాళ్లకు ‌పెన్షన్ ఇవ్వాలని ‌సీఎం కేసీఆర్ నిర్ణయించారని, నిజామాబాద్ పట్టణంలో కొత్తగా 9 వేల మందికి, నిజామాబాద్ ‌జిల్లాలో కొత్తగా 50 వేల మందికి పెన్షన్లు ఇస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నిజామాబాద్ ‌పట్టణంలో 60 వేల ఇండ్లు ఉంటే, 40 వేల మంది కి పెన్షన్ ఇస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయని అందులో కేవలం తెలంగాణలోనే ఇంత పెద్ద మొత్తంలో పించన్‌లు ఇస్తున్నారని పక్కనున్న మహారాష్ట్రలో ఎంత ఇస్తున్నారో పక్కనే ఉన్న మహారాష్ట్రతో అనుబంధం ఉన్న వారికి తెలుసన్నారు ఎమ్మెల్సీ కవిత. పేదలకు, వృద్దులకు‌, బీడి కార్మికులకు, మానసిక పరిస్థితి బాగా లేని వాళ్లు..ఇలా అనేక వర్గాలకు పెన్షన్ ఇస్తున్నామని, రాష్ట్రం రాకముందు రూ.200 పెన్షన్ ఉంటే,.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.1000 తో పెన్షన్ ఇచ్చుడు మొదలుపెట్టుకున్నామని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు.

వయసు పైబడిన వాళ్లు, పేద వాళ్లు ఆత్మగౌరవంతో బతకాలనే సీఎం కేసీఆర్ గారు పెన్షన్ ఇస్తున్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఒక ఇంట్లో ‌ఒక కాలు లేని బిడ్డ ఉంటే, ఆ ఇంటికి ఎంత బారంగా ఉంటదో అర్థం చేసుకునే గుండె ఉన్న వ్యక్తి కేసీఆర్ కాబట్టి, ఆ గుండె నిరంతరం తెలంగాణ బిడ్డల కోసం కొట్టుకుంటది కాబట్టి.. పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పేద వాళ్లకు‌ పెన్షన్ ‌ఇస్తే, వాళ్ల ఆశీర్వాదంతో తెలంగాణ, బంగారు తెలంగాణ అయితది… సంపద ‌సృష్టించే తెలంగాణ అవుతది.. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం అవుతదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అంతేకాదు ఇంట్లో ఒక్కరికి కాదు, ఇద్దరికి పెన్షన్ ఇచ్చే స్థాయికి తెలంగాణలో సంపద పెరగాలని కోరుకుంటున్నాని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పెన్షన్ రాని వాళ్లకు కూడా త్వరలో వస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

సంక్షేమ పథకాలు ఆపాలంటున్న ప్రధాని మోదీ
ఒకవైపు తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో దేశంలో అగ్రస్థానంలో ఉండగా, మరోవైపు పేదలకు ఇస్తున్న ఉచితాలను ఆపాలంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.

ప్రధాని మోదీ బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి పోయిన వాళ్ల మిత్రులకు రూ. పది లక్షల కోట్లు పంచుతున్నడు కానీ పేద వాళ్లకు ఉచితాలు ఇస్తే తప్పంటున్నరని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. పేదవాళ్లకు రేషన్, పెన్షన్, షాదీ ముబారక్, స్కాలర్ షిప్‌ లాంటివి ఇవ్వద్దని‌ మోదీ చెబుతున్నారు.. ఉచిత పథకాలు ఇచ్చి ప్రభుత్వాలు ప్రజలను చెడగొడుతున్నయని మోదీ అంటున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం కరోనా వచ్చినా, పెన్షన్ ఇచ్చుడు ఆపలేదు. రేషన్, కరెంటు, వ్యవసాయం ఏదీ ఆపలేదని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. వ్యవసాయం ఆపే ప్రసక్తే లేదు… కచ్చితంగా ధాన్యం ‌కొంటం అని‌ మోదీతో జరిగిన సమావేశంలో చెప్పిన ఏకైక సీఎం మన కేసీఆర్ అన్న ఎమ్మెల్సీ కవిత, వ్యవసాయం ఆగితే వచ్చే ఇబ్బందులు కేసీఆర్ గారికి తెలుసునన్నారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఉచిత పథకాలపై చర్చ మొదలు పెట్టిందని, యువకులు, మహిళలు వాట్సాప్ లో బీజేపీ చేసే తప్పుడు ప్రచారాలపై జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

అనంతరం పెన్షన్ లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్సీ కవిత‌ సహపంక్తి భోజనం చేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మేయర్ నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE