– తెలంగాణ అవతరణ దినోత్సవ ఉత్సవాలకు కేసీఆర్ దూరం
– సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసిన కేసీఆర్
మీ వికృత పోకడలు.. తెలంగాణ చరిత్ర-పోరాట స్ఫూర్తిని అవమానించే వైఖరికి నిరసనగా ఆదివారం నిర్వహించే తెలంగాణ అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని తాను బహిష్కస్తునట్లు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ మేర కు ఆయన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వేడుకల్లో బీఆర్‌ఎస్ పాల్గొనడం లేదని వెల్లడించారు. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న కాంగ్రెస్ పోకడలను నిరసిస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమని, అమరుల త్యాగాల పర్యవసానమనీ కాకుండా.. కాంగ్రెస్ దయాభిక్షగా ప్రచారం చేస్తున్న ఆ పార్టీ భావ దారిద్య్రాన్ని నిరసిస్తున్నానని చెప్పారు. ఇకనైనా వైఖరిని మార్చుకుని సంక్షేమానికి పాటుపడాలని సూచించారు.
తెలంగాణ తొలి దశ ఉద్యమంలో 369 మంది ముక్కుపచ్చలారని యువకులను కాల్చి చంపిన కాంగ్రెస్ దమననీతికి సాక్ష్యమే గన్‌పార్క్ అమరవీరుల స్థూపమని కేసీఆర్ తెలిపారు. ఆ స్థూపాన్ని కూడా ఆవిష్కరించుకోనివ్వకుండా అడ్డుపడిన కాంగ్రెస్ కర్కశత్వం తెలంగాణ చరిత్ర పుటల్లో నిలబడిపోయిందని అన్నారు. మలిదశ ఉద్యమంలోనూ వందలాది మంది యువకుల ప్రాణాలను బలిగొన్న పాపం నిశ్చయంగా కాంగ్రెస్ పార్టీదే అని తెలిపారు.
తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జరిగిన చారిత్రాత్మక ప్రయత్నమే టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం అని చెప్పారు. పార్లమెంటరీ రాజకీయ పంథాలో, శాంతియుత మార్గంలో తెలంగాణ సాధన లక్ష్యంగా టీఆర్‌ఎస్ ఏర్పడటం తెలంగాణ ఉద్యమంలో మేలుమలుపు అని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపైనా ఆ లేఖలో కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జై తెలంగాణ అనే నినాదాన్ని పలకలేదని.. తెలంగాణ ప్రజలకు ప్రాణ సమానమైన జై తెలంగాణ నినాదాన్ని నోటినిండా పలకలేని మీ మానసిక వైకల్యాన్ని ప్రజలు ఆక్షేపిస్తున్నారని తెలిపారు. ఇక ముందైనా తెలంగాణ వ్యతిరేక మానసికత నుంచి బయటపడి జై తెలంగాణ అని నినదించే వివేకాన్ని తెలంగాణ సమాజం మీ నుంచి కోరుకుంటుందని చెప్పారు.
ముఖ్యమంత్రి అయ్యి ఆరు నెలలవుతున్నా ఇప్పటివరకు తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని సందర్శించకుండా, శ్రద్ధాంజలి ఘటించకుండా తెలంగాణ మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని అన్నారు. మీ ప్రవర్తనతో, మీ పార్టీ ప్రవర్తనతో కాంగ్రెస్ ఇప్పటికీ మారలేదు.. ఇక మారదు.. ఇక ముందు మారే అవకాశం లేదని స్పష్టమవుతుందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకుపోతున్నది ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొనడం సమంజసం కాదని.. బీఆర్‌ఎస్ పార్టీతో సహా ఉద్యమకారులు, తెలంగాణ వాదులు అభిప్రాయంగా ఉందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న మీ వికృత పోకడలను నిరసిస్తూ.. మీరు నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో బీఆర్‌ఎస్ పాల్గొనడం లేదని తెలియజేయడానికి విచారిస్తున్నామని అన్నారు.
ఇక ముందైనా ఇటువంటి వైఖరిని మానుకొని నిజమైన ప్రగతి కోసం, సంక్షేమం కోసం ప్రయత్నిస్తారని, ఎన్నికల వాగ్దానాలన్నీ త్వరగానే నెరవేరుస్తారనీ ప్రజల మన్ననలు పొందుతారని ఆశిస్తున్నామని అన్నారు.