Suryaa.co.in

Political News

ఆంధ్రాతో ఆడుకుంటున్న బిజెపి..!

– రాష్ట్రమేమో చిల్లర కొట్టు… నేతలు చూడు పిన్నమ్మా..!

ఇవేం నాటకాలు..
భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని చిన్న చూపు చూడ్డమే అలవాటు..
ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఆంధ్ర ప్రజల సెంటిమెంట్లతో రాజకీయంగా ఆడుకోవడం మొదలు పెట్టారు కమలనాధులు..!
అందుకే తెలుగు ప్రజలు బిజెపిని తిప్పి కొడుతున్నారో
లేక అలా పదే పదే తిప్పికొడుతున్నందుకే బిజెపి అలా ఆంధ్రను చిన్న చూపు చూస్తోందో..ఏది ఏమైనా కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఒరిగిందేమీ లేకపోగా బిజెపి నాటకాలు చూస్తూ మౌన ప్రేక్షకులుగా మిగిలిపోవడమే మన వంతైపోయింది..!

లేకపోతే ఏమిటి..కేంద్రంలో అన్ని అధికారాలు చేతిలో పెట్టుకున్న బిజెపి నాయకులు ఇక్కడ రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నా పట్టించుకోక.. జగన్ సర్కార్ పీక నొక్కే ప్రయత్నాలు..కనీసం అదుపులో ఉంచే చర్యలు చేపట్టకపోగా రాష్ట్రానికి వస్తూ పోతూ జగన్ ప్రభుత్వం వైఖరిపై మొక్కుబడి
విమర్శలు చేసి పలాయనం చిత్తగిస్తున్నారు..
సోము వీర్రాజు.. కన్నా లక్ష్మీనారాయణ.. పురంధేశ్వరి మొదలుకుని చిన్న నాయకుల వరకు
అదే వరస..పోనీ ఢిల్లీ నాయకులైనా ఏమైనా చేయగలుగుతున్నారా అంటే..అబ్బే.. వారిదీ అదే ధోరణి..!
కేంద్ర పథకాలను జగన్ ప్రభుత్వం తన స్కీములుగా ముఖ్యమంత్రి ఫోటో ముద్రించి మరీ అమలు చేసేస్తోందని గగ్గోలు పెడుతున్న బిజెపి నాయకులు తలచుకుంటే ఆ విచ్చలవిడి వ్యవహారానికి అడ్డుకట్ట వెయ్యలేరా..పైగా వీధి పోరాటాలంటూ పనికిమాలిన ట్రిక్కులు చేసి తాము ప్రజల పక్షం…జగన్ సర్కారుకు విపక్షం అని నమ్మించే ప్రయత్నాలు ఇటీవలి కాలంలో మరీ ఎక్కువగా చేస్తున్నారు.
అంతే కాదు..ఒక్కో నాయకుడు ఒక్కో తరహా స్టేట్మెంట్లు..రైల్వే జోన్ విషయంలో కూడా ప్రజలను గందరగోళంలో పడేసే విధంగా బిజెపి నాయకులు వ్యవహరిస్తున్నారు.
ఇన్ని చేసే బదులు జగన్ ప్రభుత్వానికి ముకుతాడు వేసేందుకు ఒక పటిష్టమైన
వ్యూహం అమలు చెయ్యరు..చేస్తే కొన్ని నాటకాలు నడవవుగా..! ఇక్కడ జగన్ పై విమర్శలు..
అదే జగన్ ఢిల్లీకి వెళ్తే కౌగిలింతలు..ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లినప్పుడు ఆంధ్ర విషయంలో ఏనాడూ సరైన దిశలో చర్చలు జరిగిన సంకేతాలు కనిపించవు..
పోలవరం అలాగే ఉండిపోయింది…విభజన హామీలు అతీగతీ లేకుండా ఉన్నాయి..
ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆగవు..
మరి ఇవేవీ మాటాడకుండా జగన్ మాటిమాటికీ ఢిల్లీ వెళ్లి రావడం దేనికో…
ఆ మర్మం ఏమిటో.._!?
వెళ్ళడం..నాలుగు శాలువాలు..బొకేలు పట్టుకుని మోడీ..అమిత్ షా..ఇత్యాది నాయకులను కలిసి తనదైన ముద్రతో చిరునవ్వులు ఒలకబోస్తూ వారితో కాస్సేపు ముచ్చటించి
మరలిరావడం.. ఇదే తంతు..!
పోనీ బిజెపి అగ్రనాయకులైనా ఇక్కడ రాష్ట్రంలో తమ నాయకులు
పథకాల విషయంలో వెళ్ళగక్కుతున్న అక్కసు దీరా జగన్ కు తలంటు పోసే రీతిలో వ్యవహరిస్తున్నారా అంటే ఆ సమాచారమూ వినిపించదే..అక్కడ ప్రాణమిత్రుల్లా ప్రేమించుకోవడం..ఇక్కడ బద్ధశత్రువుల్లా కసురుకోవడం..ఇవన్నీ ఆంధ్ర ప్రజల చెవుల్లో కమలాలు పెట్టడం కాక ఇంకేమిటి!?

పొత్తులా..విపత్తులా
వీళ్లంతా పతిత్తులా..!
ఇంతకీ వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోతోంది..
ఇది మరీ పెద్ద డ్రామా.. నిజానికి బిజెపికి ఆంధ్రలో ఉన్న ఓటు బ్యాంకు నామమాత్రమే..అయితే కేంద్రంలో అధికారంలో ఉంది గనక..వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో పోటీ గతంలో కంటే గట్టిగా ఉంటుంది కాబట్టి ఇక్కడి ప్రధాన పార్టీలైన వైసీపీ..తెలుగుదేశం..జనసేన కూడా బిజెపితో చెలిమి కోసం అర్రులు చాస్తున్నాయి.
ఎటూ తేల్చకుండా బిజెపి ఈ పార్టీలతో మూడు ముక్కలాడుతోంది..అదే సమయంలో కమలంతో పొత్తుకు ఆశపడుతున్నవైసీపీ..టిడిపి కూడా రాష్ట్ర ప్రయోజనాలు..జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించకుండా బిజెపి మోచేతి నీళ్ళు తాగే పరిస్థితుల్లో ఉన్నాయి..
బిజెపికి కావలసింది కూడా అదే..ఎన్నికలు ముంచుకొచ్చేవరకు ప్రధాన పార్టీలను ఇలాగే తన వెనక తిప్పుకునిఆ సమయం వచ్చే పాటికి తమకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారు కమలనాధులు..అది వారి వ్యూహం..అంతవరకు రాష్ట్రానికి ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా
పట్టించుకోక రేపటి ఎన్నికల్లో తమ ప్రయోజనాల కోసం కమలనాధుల కొంగు పట్టుకుని తిరిగే
చూడు పిన్నమ్మా వ్యవహారమే మన అగ్రనాయకులది..!
నిజమే మరి…బిజెపి దృష్టిలో ఈ రాష్ట్రం చిల్లర కొట్టు అయినప్పుడు మన నేతలు కమలనాథులకు అలాగే కనిపిస్తారు..
ఖర్మ ఖర్మ..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE