Suryaa.co.in

Andhra Pradesh

మమ్మల్ని వేలు పెట్టి చూపించే అర్హత కేసీఆర్‌-హరీష్ కు లేదు

– అన్ని రంగాల్లో పోల్చుకుందాం.. రండి
– 175కు 175 గెలవబోతున్నామని జగన్ చెబితే అవమానించినట్టా..?
– రాజకీయాల్లో వారసులు రావాలంటే ప్రజలు ఆమోదముద్ర వేయాలి
– ఒళ్ళు బలిసిన, కొవ్వెక్కిన కోటీశ్వరుల పాదయాత్ర అది
– మీ బినామీ భూముల్లో పెట్టిన అమరావతి దేదీప్యమానంగా వెలిగిపోవాలా..?
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఏమన్నారంటే.. తెలంగాణ మంత్రి హరీశ్‌రావు, వాళ్ళ రాష్ట్రంలో చేసిన వాటి గురించి గొప్పలు చెప్పుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు. మా రాష్ట్రంతో, మమ్మల్ని పోల్చాల్సిన అవసరం వారికి లేదు. తన మామ కేసీఆర్‌కు, ఆయనకు ఏదైనా తగాదా ఉంటే అక్కడే తేల్చుకోవాలి తప్ప… మమ్మల్ని వేలుపెట్టి చూపించే అర్హత వారికి లేదు. మేము ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయినవాళ్లం. రెవెన్యూ తక్కువగా ఉన్నా భారతదేశంలోనే అత్యద్భుతంగా సంక్షేమ కార్యాక్రమాలను అమలు చేస్తున్నది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వమే.
మా ప్రభుత్వాన్ని వేలు పెట్టి చూపించే నైతిక అర్హత హరీశ్‌రావుకుగానీ, కేసీఆర్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేస్తున్నాం. మమ్మల్ని వేలుపెట్టి చూపించాలనే ప్రయత్నం సరైన విధానం కాదు. మీ పాలన మీది, మాతో పోల్చుతారేంటి? అయితే అన్ని రంగాల్లో పోల్చుకుందాం రమ్మన్ని హరీశ్‌రావుకు సవాల్‌ చేస్తున్నాం.

ఇంతటి జవాబుదారీతనం ఎప్పుడూ చూడలేదు
వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకముందే, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్లి మా ప్రభుత్వం వస్తే, ప్రతి ఇంటికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తామని గడప గడపకు తిరిగి చెప్పాం. అలానే, జగన్‌ , తన సుదీర్ఘమైన పాదయాత్రలో కూడా అనేక వాగ్దానాలు చేశారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్ర ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించి, అధికారాన్ని అప్పగించారు. మూడేళ్ల మా పరిపాలన పూర్తయ్యాక, మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజానీకం వద్దకు, “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా వెళ్ళి, మేము చేసిన వాగ్దానాలలో ఏవేవి నెరవేర్చామో, మా ఎన్నికల మేనిఫెస్టోను ఇంటింటికీ చూపించి మరీ చెబుతున్నాం. మే నెలలో ప్రారంభమైన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి నాలుగు నెలలు పూర్తయ్యాయి. ఇది ఒక విప్లవాత్మకమైన జవాబుదారీతనం.
ఎన్నికల్లో మాకు ఓట్లు వేసిన వారికీ, ఓట్లు వేయని వాళ్ల గడపకు కూడా వెళ్లి చెబుతున్నాం. మమ్మల్ని ఓడించాలని ప్రయత్నం చేసిన టీడీపీ, జనసేనకు చెందిన కార్యకర్తల ఇళ్ళ వద్దకు కూడా వెళ్లి చెబుతున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలలో 98శాతం పైచిలుకు అమలు చేశామని చెప్పాం.
ఏ ఇంటికి వెళ్ళినా, మాకు పథకాలు అందుతున్నాయని, అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యాదీవెన, వైయస్సార్‌ చేయూత, వాహనమిత్ర, ఆసరా, చేదోడు తదితర పథకాలు వస్తున్నాయని లెక్కగట్టి మరీ చెబుతున్నారు. భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ, ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను చూసినా, ఇంత జవాబుదారీతనంగా ప్రజల ముందుకు వెళ్లిన సంఘటన గతంలో లేదు. ఇకముందు ఉంటుందో లేదో చెప్పలేం.

ఇంత గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రూపకల్పన చేసి, అర్హులకు సంక్షేమ ఫలాలు మరింత వేగవంతంగా అందేలా అధికారులను, ప్రజాప్రతినిధుల్ని ఇంటింటికి, గడప గడపకు పంపిస్తూ, ఈ కార్యక్రమం తీరుతెన్నులపై ఇప్పటికి మూడుసార్లు సమీక్ష నిర్వహించారు. వాటన్నింటినీ వదిలేసి… మా రాజకీయ శత్రువర్గం, ఎల్లో మీడియా, టీడీపీతో పాటు దాని అనుబంధ రాజకీయ పక్షాలు మేము మళ్లీ అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతో బురదచల్లే కార్యక్రమం చేస్తున్నాయి.

జగన్ కంటే గొప్ప పథకాలు అమలు చేశామని ఇంటింటికీ వెళ్ళి చెప్పగలరా..?
చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు 600కు పైగా వాగ్దానాలు చేశారు. వాటిని అమలు చేశారా అని ఈనాడులో ఎప్పుడైనా రాశారా? అంతేకాదు, జగన్‌ కన్నా మేము గొప్ప కార్యక్రమాలు చేశామని టీడీపీవాళ్లు ఇంటింటికి వెళ్లి చెప్పగలుగుతున్నారా? అంటే చెప్పలేరు. మరి చంద్రబాబు కానీ, టీడీపీ వాళ్లు కానీ అలా వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నారు కదా? ఎందుకంటే మీరేమీ చేయకపోవడం వల్లే. రైతు భరోసా కంటే గొప్ప పథకం అమలు చేశామని ఎవరైనా రైతు ఇంటికి వెళ్లమనండి. రైతు రుణమాఫీ చేశామని చెప్పండి.
బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని మహిళలకు తిరిగి ఇచ్చేశామని చెప్పమనండి. ఇవేమీ టీడీపీ వాళ్లు చెప్పలేరు, చెప్పరు. ఇలాంటి విషయాలను ఎల్లో మీడియా కూడా ఎప్పుడూ ప్రస్తావించదు. చరిత్రలో జరగని విధంగా మేనిఫెస్టోను గడప గడపకు తీసుకువెళ్లి ఇస్తున్న ప్రభుత్వం మీద మీరు మంచిగా ఒక్క ముక్క రాయలేరు. గ్రామాల్లో జరుగుతున్న సంక్షేమ పథకాల అమలు గురించి రాయరు. ప్రతి పేదవాడు చదువుకునేలా విద్యారంగంలో జరుగుతున్న కృషి గురించి రాయరు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి గురించి ప్రభుత్వం తాపత్రాయం పడుతూ చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రస్తావించరు. చేయూత పథకం కింద మహిళలకు ఏటా రూ. 18,750 ఆర్థిక సాయం అందిస్తుంటే దాని గురించి ఎక్కడా రాయరు. ఇంకేమీ రాస్తారు వీళ్లు.

పక్క రాష్ట్రాలకు మీరు మద్దతు పలుకుతున్నారా రామోజీ..!
ఈనాడు రామోజీరావుతోపాటు ఎల్లో మీడియాకు సంబంధించిన మూడు, నాలుగు ఛానళ్ళు పోలవరం ప్రాజెక్ట్‌ గురించి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా కథనాలను ప్రసారం చేస్తారు.
పోలవరం సర్వనాశనం అయిపోయిందని రాస్తారు. అలా అయిపోవాలని వారి కోరిక. అలాగే ఆంధ్రప్రదేశ్‌ శ్రీలంకలాగా అయిపోయింది అన్నట్టు రాతలు రాస్తారు. అలా అయిపోవాలన్నది వారి కోరిక. కానీ గుంటూరు, విజయవాడకు సంబంధం లేకుండా, వారి బినామీల భూముల్లో పెట్టిన అమరావతి రాజధాని మాత్రం దేదీప్యమానంగా వెలిగిపోవాలి అని రాస్తారు. అమరావతి మీద లక్షల కోట్లు కుమ్మరించి ప్రభుత్వం బాగుచేయాలట. దానివల్ల అక్కడ గజం స్థలం లక్ష రూపాయలకు అమ్మేలా చేస్తే, వారు కోట్లకు పడగలెత్తుతారట.

చిత్రమైన విషయం ఏంటంటే.. ఎల్లో మీడియాలో పోలవరం గురించి రాసిన రాతలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. చత్తీస్‌గఢ్‌, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడి సర్వేకు పట్టుబట్టాయని రాస్తారు. అంటే పోలవరం విషయంలో ఏదో జరిగిపోతోంది, పక్క రాష్ట్రాలు అంగీకరించడం లేదనేలా వీళ్ళ రాతలు ఉన్నాయి. అంటే, మీరు పక్క రాష్ట్రాలకు మద్దతు పలుకుతున్నారా?

ఇది వాస్తవం కాదు. 2009-11లోనే పోలవరం ప్రాజెక్ట్‌కు అన్ని అనుమతులు వచ్చాయి. కేంద్ర జలవనరులు శాఖ, సీడబ్ల్యూసీ అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతులు ఇవ్వడంతో పోలవరం పనులు జరుగుతున్నాయి. పోలవరం ముంపు వల్ల తమకు నష్టం అంటూ చత్తీస్‌గఢ్‌, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశాయి. అనుమనాలతో పాటు సుప్రీంకోర్టులోనూ పిటిషన్‌ వేశారు. ఈ అంశాన్ని పరిష్కరించాలని న్యాయస్థానం ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఉమ్మడి సర్వే చేయాల్సిన అవసరం లేదని, భద్రాచలానికి అసలు ముప్పేలేదని కేంద్రం స్పష్టం చేసింది.

అయితే వీటిని మాత్రం ఎల్లో మీడియా రాయకుండా కేవలం ‘ఉమ్మడి సర్వేకు పట్టు.. పోలవరంపై కేంద్రాన్ని కోరిన పొరుగు రాష్ట్రాలు’ అంటూ ఒక నెగిటివ్‌ హెడ్డింగ్‌ పెట్టారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయితే ‘పోలవరంపై పేచీలు’ అంటూ రాస్తాడు. ఎందుకు పేచీలు, ఎవరికి పేచీలు? పొరుగు రాష్ట్రాలకు వచ్చిన అనుమానాలు నివృతి చేయడానికే సమావేశం తప్ప, పోలవరంపై ఎలాంటి పేచీలు లేవు.
కారణం జల వనరుల శాఖ, సీడబ్ల్యూసీ, అటవీశాఖ, పర్యావరణ శాఖకు సంబంధించి… దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలోనే క్లియరెన్స్‌ లు వచ్చాయి. అయితే అనుమానాలు నివృత్తి చేయడం కోసం న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్రం ప్రయత్నిస్తుంటే దానికి ఏదో గందరగోళం జరిగిపోతుందనే భావన కలిగేలా చేయడం చాలా దురదృష్టకరం.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ పరిమితికి మించి అప్పులు చేస్తుందని, శ్రీలంకలా అయిపోతుందంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎల్లో మీడియాకు పనిపాట లేకపోవడం వల్లే నెగిటివ్‌ వార్తల్ని రాస్తోంది. అదే ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాల గురించి ఎక్కడా మెచ్చుకున్న పరిస్థితి లేదు. చంద్రబాబు, ఆయన పార్టీ వాళ్లు గడప గడపకు వెళ్లలేని పరిస్థితి. అదే మేము వెళ్లి చెబుతుంటే చూసి ఓర్వలేక డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. దీన్ని ప్రజల నమ్మవద్దని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.

కొవ్వెక్కిన కోటీశ్వరుల పాదయాత్ర ఇది
ఇక అమరావతి గురించి పాదయాత్ర జరుగుతోంది. అమరావతిని అత్యద్భుతంగా అభివృద్ధి చేసి, లక్షల కోట్లు అక్కడే పెట్టుబడులు పెట్టాలట.” ఒకే రాష్ట్రం… ఒకే రాజధాని. రెండో రాజధాని ఉండటానికి వీల్లేదని. మా అమరావతిలోనే, మా ఊరులోనే రాజధాని కట్టాలని” చంద్రబాబు బినామీలు కొంతమంది పాదయాత్ర చేస్తున్నారు.

మా ప్రభుత్వం విధానం వికేంద్రీకరణే అని ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పాం. రాష్ట్రంలోనే కాదు, పంచాయతీ స్థాయి వరకు వికేంద్రీకరణ విధానాన్ని తీసుకువెళ్ళగలిగాం. సామాన్యుడికి అతి దగ్గరగా పరిపాలన కేంద్రాలు ఉండాలని భావించిన ప్రభుత్వం, వికేంద్రీకరణలో భాగంగా మేము మూడు రాజధానులను నిర్ణయించాం. అలా ఉండటానికి వీల్లేదని మా ఊర్లోనే రాజధాని ఉండాలంటూ పాదయాత్రలు చేస్తున్నారు. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ గతంలో ఒక డ్రామా ఆడారు. ఇప్పుడు అమరావతి టూ అరసవల్లి అంటూ దేవుడిని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడటం చాలా దురదృష్టకరం.
అది రైతుల పాదయాత్ర కాదు… ఒళ్లు బలిసినవాళ్ళ పాదయాత్ర అని నేను మాట్లాడితే.. దానిమీద టీడీపీకి సంబంధించివాళ్లు, పసుపుపచ్చ కండువా మాటున వేసుకున్న ఆకుపచ్చ కండువాల వాళ్లు రాంబాబు మాట్లాడింది తప్పు… అంటూ టీడీపీకి మద్దతుగా కొంతమంది మాట్లాడుతున్నారు.

నేను మళ్ళీ చెబుతున్నా.. ఇది రైతుల పాదయాత్ర కానే కాదు. ఒళ్లు బలిసినవాళ్ల పాదయాత్రే. మళ్లీ మళ్లీ మాట్లాడితే.. ఇది కొవ్వెక్కిన కోటీశ్వరుల పాదయాత్ర అని కూడా చెబుతున్నాను.ఈ పాదయాత్రకు వ్యతిరేకంగా, మూడు ప్రాంతాల్లోని వెనుకబడిన వర్గాలవారు, గుండె రగిలిపోయేవాళ్లు, కడుపు మండేవాళ్లు పాదయాత్రలు ప్రారంభిస్తే దానికి బాధ్యత వహించవల్సింది చంద్రబాబు నాయుడే. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనే ఉద్దేశంతో ఫ్రస్ట్రేషన్‌తో చంద్రబాబు మాట్లాడుతున్నారు. పాదయాత్రలో ఒక్క రైతు అన్నా ఉన్నాడా? అంతా తెలుగుదేశం వాళ్ల భజనే. ఆ పార్టీవాళ్లే కనిపిస్తారు. దీనికి రైతు పాదయాత్ర అని పేరుపెట్టి ఉత్తరాంధ్రపై దండయాత్రకు వెళితే యాక్షన్‌కు రియాక్షన్‌ ఉండదా?

మీరు కోర్టులకు వెళ్లారు. న్యాయస్థానాలు తేలుస్తాయి కదా? అయితే చంద్రబాబు రెచ్చగొట్టే కార్యక్రమం చేయడం అనేది ప్రజాస్వామ్యంలో మంచి పద్దతి కాదు. దీనికి చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మమ్మల్ని వేలు పెట్టి చూపించే అర్హత హరీష్ కు లేదు.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
నేను అసెంబ్లీకి ఎప్పుడు రావాలో, ఎప్పుడు గెలవాలో బుచ్చయ్యచౌదరో, చంద్రబాబో నిర్ణయిస్తారా? వాళ్ల దయాదాక్షిణ్యాలతో నేనేమీ గెలవలేదు. రెండుసార్లు వద్దనుకునే పోటీకి దూరంగా ఉన్నాను.

మీ దౌర్భాగ్యపు బుద్ధి మారదా రామోజీ..?
175కి 175 సీట్లు మనం గెలుస్తున్నాం, గెలవాలని మా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మొదటి నుంచి చెబుతున్నారు. ఎవరైనా నమ్మారా?. కానీ మొన్నటి సమావేశంలో మా ముఖ్యమంత్రి చెప్పినదానితో పూర్తి విశ్వాసం కలిగింది. మా ముఖ్యమంత్రిగారు ఒకే ఒక్కమాట అన్నారు. మనసా, వాచా, కర్మణా నమ్మి నేను చెబుతున్నానని 175కి 175 గెలవబోతున్నామన్నారు. బటన్‌ నొక్కి.. రాష్ట్రంలోని 87 శాతం మంది ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. దాంతో 2019 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో, గ్రామ సర్పంచ్‌ నుంచి వార్డు సభ్యుడు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్‌ కౌన్సిలర్‌, మున్సిపల్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే ఇలా చూస్తే నూటికి 90శాతానికి పైగా ప్రజా ప్రతినిధులు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పక్షానే ఉన్నారు. వీరంతా కదిలి రంగంలోకి దిగితే … 175కి 175 అసాధ్యం కాదు, సాధ్యమే, మనం గెలవబోతున్నామని, విశ్వాసంతో ముందుకు కదలాలని జగన్ చెప్పారు.

ఇవన్నీ వదిలేసి వారసులు రావద్దని జగన్‌వార్నింగ్‌ ఇచ్చారంటూ.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఫ్రంట్‌ పేజీల్లో వార్తలు రాసి ఆనందపడుతున్నారు.

-రామోజీరావుగారూ.. రాజకీయాల్లోకి వారసులు రావాలంటే ప్రజలు ఆమోద ముద్ర వేయాలి అని మీకు తెలియదా.?. మరి తన వారసుడుని చంద్రబాబు కూడా తీసుకువచ్చారు కదా. ప్రజలు ఆమోదించకపోతే దొడ్డిదోవన మంత్రిని చేయలేదా?. ప్రజలు ఆమోదించారా..?

వారసుల విషయంలో నిర్ణయం అనేది పార్టీ అంతర్గత విషయం. రామోజీరావుకు ఏమీ వార్తలు లేనట్లు మొదటి పేజీలో నెగిటివ్‌ వార్త రాశారు. మా పార్టీ ప్రజాప్రతినిధులు తమ వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటే అందులో తప్పేముంది. అంతిమంగా ప్రజామోదం ఉండాలి.రామోజీరావుగారు ఈ రాష్ట్రంలో ప్రజలకు తెలియపరచాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పాజిటివ్‌ వార్తల్ని రాసే మనసు ఎలాగూ మీకు లేదు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను మీరు రాయలేరు.

మేనిఫెస్టోను తగలేసిన టీడీపీ ఉంది. అదే మేము మేనిఫెస్టోను ప్రతి ఇంటింటికి వెళ్లి ఇస్తుంటే మీకు కనిపించలేదా రామోజీరావుగారూ..? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాసిన ‘మనసులో మాట’ పుస్తకాన్ని తగలెట్టేశారు కదా. ఆ పుస్తకం ఇప్పుడు కనిపించదు. ఆ పుస్తకం చదివితే చంద్రబాబు నిజస్వరూపం అర్థం అవుతుంది.

జగన్‌ మోహన్‌ రెడ్డి మీద కోపం ఉంటే.. పోలవరం మీద చూపిస్తారా..? ఏపీ శ్రీలంకలాగా మారిపోవాలని కోరుకుంటారా..?. మీ దౌర్భాగ్యపు బుద్ధులకు ఇవే నిదర్శనం. దుష్ట ఆలోచనలు, దుర్భుద్ధితో చంద్రబాబు గ్యాంగ్‌ చేస్తున్న చెత్త పనులను ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇంకా అర్థం చేసుకుంటారు.

2024 ఎన్నికల్లో 175కి 175 వైయస్సార్‌ సీపీ గెలిచి అధికారంలోకి రాబోతుంది. చంద్రబాబు పని అయిపోయింది. ఇక ఆయన తిరిగి రాజకీయాల్లోకి రాలేడు. కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదు. ఇది జరగబోయే ఎన్నికల్లో జరిగే వాస్తవాన్ని అందరూ చూస్తారు.

LEAVE A RESPONSE