రాష్ట్రాల లో సుపరిపాలన అందించడానికి వినూత్న పథకాలు ప్రవేశపెడుతున్నామని చెబుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ శాఖల్లో అవినీతిని అంతం చేసేందుకు ఐఐఎం అహ్మదాబాద్ మధ్య అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అవినీతిరహిత పాలన అందించేందుకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఇలాంటి కన్సల్టెన్సీలకు కోట్లు ఖర్చు పెడుతున్నారు. కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎక్కడెక్కడ అవినీతి జరుగుతోంది? ఎక్కడ ఆస్కారం ఉంది? దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ఇలాంటి అంశాలపై ఎక్కడో కూర్చొని ఒక రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు, సంక్షేమం కోసం విడుదల చేయాల్సిన నిధులు తీవ్ర జాప్యం జరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. 34 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 33.23 లక్షల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని పోషక ట్రాక్ యాప్ లో పొందుపరచిన సమాచారం. అంతేకాకుండా గర్భస్థ శిశువుతో పాటు తల్లుల మరణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
మూడు పూటలు పిల్లలకు సరిపడ తిండి లేక న్యూమోనియాతో బాధపడుతూ 28.9శాతం పిల్లలు ప్రతి ఏటా చనిపోతున్నారు. గర్భిణీ స్త్రీలు పౌష్టికాహార లోపంతో శరీరంలో కాల్షియం, ఐరన్ లోపం వల్ల ప్రసవం కాకుండా 32 శాతం మంది చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిరుపేదలు పిట్టల్లా రాలిపోతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు పేదలకు పూర్తిస్థాయిలో ఆదుకోవడం లేదని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా మన రాష్ట్రంలో రూపాయికే కిలో బియ్యం పంపిణీ చేస్తున్నామని, దీనివల్ల ఆకలి చావులను నివారించవచ్చునని ప్రభుత్వం చెబుతున్నది. కానీ రూపాయి కిలో బియ్యం పంపిణీ చేసినప్పటికీ వాటికి తోడు నిత్యావసర వస్తువులు అందుబాటులో లేవు. పైగా రాష్ట్ర వ్యాప్తంగా 49 శాతం మంది కుటుంబాలకు మూడు పూటల తిండి దొరకడం లేదని సమాచారం. ఒకవేళ దొరికిన అన్నం కారంపొడి వేసుకొని తింటున్నారని పలు అధ్యయన నివేదికల్లో బయటపడింది. దీంతో అయా కుటుంబాలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు తెలిసింది. అంగన్ వాడీ కేంద్రాల్లో కూడా పిల్లలకు సరైన పోషక విలువలున్న ఆహారం అందించడం లేదని తేలింది. చాలా వరకు అంగన్ వాడీ కేంద్రాలు పెద్దగా నడవడం లేదని, ఈ కేంద్రాలకు సరఫరా చేసే ఆహారంలో నాణ్యత లేదని పలువురు ఆరోపించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు మితిమీరిన అవినీతి ఉండడం వల్ల గర్భిణీలు, పిల్లలకు పౌష్టికాహారం అందక మృత్యువాత పడుతున్నారని తెలిసింది.
దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనేది అక్షరసత్యం. ఆరోగ్యవంతమైన ప్రజలు ఉన్నపుడే ఆరోగ్యవంతమైన సమాజం, రాష్ట్రం, దేశం ఉంటుంది. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారమే ప్రధాన పాత్ర పోషిస్తోంది. పోషకాహారం, ఆహారం ఈ రెండూ కవల పిల్లల వంటివి. శరీరం విధులు నిర్వహించేందుకు కావాల్సిన శక్తిని అందిస్తూ ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి, రోగాలతో పోరాడడానికి అవసరమైన శక్తిని అందించే నిజమైన పోషకాహారం. ఎదిగే వయసులో తగినంత పోషకాహారం లభించకపోతే ఆ ప్రభావం జీవితాంతం ఉంటుంది. పిల్లలకు శరీర పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది కనుక వారి ఆహారం పట్ల ప్రధాన శ్రద్ధ పెట్టాలి. పోషకాహార లోపం గల పిల్లలకు రెట్టింపు ఆహారం ఇవ్వాలి.మన పిల్లలు పోషకాహార లోపం లేకుండా ఉన్నప్పుడే మన దేశం మంచి ఆరోగ్యకరమైన దేశంగా అభివృద్ధి చెందుతుంది. బడికి వెళ్ళే వయసు కంటే ముందున్న శైశవ దశ లో పిల్లలు ఎక్కువగా పోషకాహార లోపం, అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. వీరిలో పోషకాహార లేమి, అంటువ్యాధులను ఆకర్షిస్తాయి. పోషకాహార లోపం ఉన్నపుడు అంటురోగాల తీవ్రత ఎక్కువగా ఉంటాయి.
పోషకాహార లోపం వల్ల పల్లెల్లో ఎక్కువగా డయేరియా, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. అంతేగాక పోషకాహార లోపం వల్ల రక్తహీనత, పొంగు, ఆటలమ్మ మొదలైన అంటు వ్యాధుల బారిన పిల్లలు పడతారు. శరీరానికి కావాల్సిన పోషకాలు, పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు, విటమిన్లు, ఖనిజ లవణాలు- వీటితోపాటు శరీరానికి నీరు కూడా ఎంతో అవసరం. అంగన్వాడీ కేంద్రాలకు సప్ప్లై చేస్తున్న బాలామృతం, అటుకులు, జొన్నపిండి, రాగిపిండి ,చిక్కీ, బెల్లం ఖర్జురాలు పాలు, గుడ్లు అన్నీ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఆరు నెలల క్రింద సేకరించి వీటిని ప్రాసెస్ చేసి ప్యాకెట్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటి షెల్ టైమ్ చాల తక్కువ, మారుమూల గ్రామాలకు చేరే లోపు ఇవి ఎక్స్పయిర్ అవుతున్నాయి. అంగన్వాడీ టీచర్లకు 2017 నుండి ఇప్పటి దాక ట్రావెలింగ్ అలవెన్సులు ఇవ్వలేదు.
ఇక వంట చేయడానికి ప్రతి పిల్లవాడికి రూపాయి గర్భిణీ స్త్రీలకు రెండు రూపాయల పావలా ఇస్తున్నామని చెప్పి సంవత్సరాలు దాటినా ఇంతవరకు ఒక్క రూపాయి విడుదల చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 35 వేల 568 అంగన్వాడీల్లో 12824 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 2021 ఏప్రిల్ నుంచి సుమారు 33 కోట్ల రూపాయల అద్దె బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో సంబంధిత యజమానులు తమ భవనాలు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇదే విషయం అధికారులకు చెబితే క్రమశిక్షణ అతిక్రమణ, విధుల్లో నిర్లక్ష్యం పేరిట మెమోలు జారీ చేస్తామని హెచ్చరించడంతో వెనక్కు తగ్గుతున్నారు.
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు అద్దె కష్టాలు ఎదురయ్యాయి. నెలల తరబడి అద్దె నిధులు రాకపోవడంతో అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్న భవన యజమానులు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. బాలింతలు, గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారానికి ఆటంకం కలగకుండా కొంతమంది అంగన్వాడీ సిబ్బంది తమ వేతనాల నుంచి అద్దెలు చెల్లిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు అదనపు నిధులు ఇవ్వాలంటూ ఇప్పటికే ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపినా నేటికీ ఆమోదం లభించలేదు. అంగన్వాడీలను దగ్గర్లోని ప్రభుత్వ, పరిషత్ పాఠశాలలకు మార్చాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. అద్దెభవనాల్లో అంగన్వాడీ కేంద్రాలకు బదిలీల్లో తొలిప్రాధాన్యం ఇవ్వాలని ఇటీవల మంత్రి ఆధ్వర్యంలోని ఉన్నతస్థాయి కమిటీ సూచించింది. పాఠశాలలోనే ఒకగదిని అంగన్వాడీ కేంద్రానికి కేటాయించాలని తెలిపింది. ఒకే గదిలో వంట, పిల్లలకు ఆట పాటలు సాధ్యం కాదని, బాలింతలు, గర్భిణులు దూరంగా ఉన్న పాఠశాలలకు రాలేరని అంగన్వాడీ సిబ్బంది పేర్కొంటున్నారు. కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించి, ఆధునిక హంగులతో పిల్లలకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. ఐసీడీఎస్ అక్రమార్కులకు కల్పతరువుగా మారింది. పథకాలలో అంతులేని అవినీతి కొనసాగుతోంది. తొలి నుంచి ఈ పథకాలను కొందరు ఆదాయ వనరులుగా మార్చుకొని దోపిడీ చేస్తున్నారు. నాసిరకం పౌష్టికాహారం సరఫరా చేయడంతో పాటు కుళ్లిన గుడ్లు, కాలం చెల్లిన పాలు పంపిణీ చేసి కాసులు దండుకుంటున్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
చివరకు ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు సైతం వంతపాడుతుండటంతో అక్రమార్కులు మరింత బరితెగించి దోపిడీ సాగిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించి ఆరోగ్యంగా ఉంచాలని ప్రభుత్వం ఐసీడీఎస్ ద్వారా ఈ పథకాలు తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాలలో పాల సరఫరాకే ఏటా రూ.82 కోట్లకు పైగా వ్యయం చేస్తున్నారంటే ఏ స్థాయిలో అంగన్వాడీ పథకాలకు ప్రాధాన్యత ఉందో తెలుస్తుంది. పౌష్టికాహారం కింద ప్రస్తుతం పోషకాహార కిట్లు పంపిణీ చేస్తున్నారు. ఒక కేజీ అటుకులు, ఒక కేజీ రాగిపిండి, ఒక కేజీ జొన్నపిండి, పావు కిలో బెల్లం, పావు కిలో కర్జూరం, వేరుశనగ బర్ఫీలు అందజేస్తున్నారు. ఈ సరుకులను కాంట్రాక్ట్ ఏజెన్సీ సరఫరా చేస్తోంది. అయితే నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటుకులు దుర్వాసన వస్తున్నాయని, తినలేకపోతున్నామని పిల్లలు గర్భిణీలు అంగన్వాడీ వర్కర్ల వద్ద వాపోతున్నారు. అయినా వాటిని ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఆ నాసిరకం సరుకులనే లబ్ధిదారులు తీసుకొని తినాల్సి వస్తుంది. కొందరైతే కొన్ని సరుకులు తినలేక పశువులకు వేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. చాల గ్రామాలలో అంగన్వాడి కేంద్రాలు కాలం చెల్లిన బాలామృతం చెత్త కుండీలలో పడేయడం జరుగుతోంది. కోడి గుడ్లు, పాల సరఫరాలోను అనేక అక్రమాలు, అవినీతి జరుగుతున్నాయని తెలుస్తోంది.
ప్రతీ పిల్లవాడికి రెండున్నర లీటర్ల పాలు, ప్రతీ గర్భిణీ, బాలింతకు 5 లీటర్ల పాలు నెలలో రెండు విడతలలో ప్యాకెట్ల రూపంలో సరఫరా చేస్తున్నారు. ఒక్కో లీటర్ రూ.37తో కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నారు. ఈ పాల సరఫరా బాధ్యతను ఏపీ డెయిరీ చేపడుతోంది. కర్ణాటక విజయ వజ్ర పేరుతో ప్యాకెట్లను కొనుగోలు చేసి ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఏపీ డెయిరీ ఈ పాలను సరఫరా చేయాలి. కానీ ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించి సరఫరా చేస్తున్నారు. దీంతో గడువు తీరిన పాలను తక్కువ ధరకు కోనుగోలు చేసి సరఫరా చేసి కాంట్రాక్టర్లు లబ్ధి పొందుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అనేక కేంద్రాలలో కాలం చెల్లిన పాలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందజేస్తున్నారు. కొన్ని చోట్ల పాల ప్యాకెట్లో కప్ప కళేబరం వచ్చిందని కలకలం రేపింది, ఇలాంటి పాలు త్రాగి లేని రోగాలు తెచ్చుకోవడమని ప్రజలు భావిస్తున్నారు. వేరుశనగ బర్ఫీలలో ఇటీవల పురుగులు వచ్చాయి. పర్యవేక్షణ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం అంగన్వాడీ సిబ్బందిని బలి పశువులని చేసి కాంట్రాక్టర్లను వదిలేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఉన్నతాధికారులు సైతం ఈ అక్రమ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడం వల్ల అంగన్వాడీ పథకాలలో అంతులేని అవినీతి యథేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అంగన్వాడి వర్కర్, సూపర్వైజర్ పోస్టులకు ఎప్పుడూ పారదర్శకంగా జరగవు, రోస్టర్ పాటించరు. రాజకీయ జోక్యంతో నామమాత్రంగా పరీక్షలు జరిపి ఇష్టారాజ్యంగా నియామకాలు చేపట్టడం వలన అర్హులైన టువంటి అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. లోపం ఎక్కడుందో ప్రభుత్వాలు గ్రహిస్తే మంచిది.
