వివేకా హత్యపై మా ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పి నిర్ధోషినని నిరూపించుకోగలవా జగన్ రెడ్డి?
-వివేకా హత్యపై మా 10 ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పి నిర్ధోషినని నిరూపించుకోగలవా జగన్ రెడ్డి?
– అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ ఉదంతంపై తేలు కుట్టిన దొంగలా సీఎం
– ధైర్యం చాలకుంటే జీతగాడు సజ్జల చేతనైనా చెప్పించాలి
– మౌనం వహిస్తే జగన్ నేరం అంగీకరించినట్లే
– డాక్టర్ సునీత పోరాటానికి అండగా నిలబడతాం
– రాష్ట్ర ప్రజలు కూడా అండగా నిలవాలి
వివేకా హత్య కేసుకు సంబంధించి తాము వేసే 10 ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పి నిర్ధోషినని నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. వివేకా హత్య ఉదంతంపై ప్రజల్లో నెలకొన్న పలు అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. ఈ మేరకు జగన్ పై పట్టాభి ప్రశ్నల వర్షం కురిపించారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మేం వేసే 10 ప్రశ్నలు తనకు టీడీపీ ఇచ్చిన బంపర్ ఆఫర్ గా భావించాలని జగన్ ను కోరారు.
ప్రపంచమంతా సోషల్ మీడియాలో ‘‘అబ్బాయ్ కిల్డ్ బాబాయ్’’ అనే హ్యాష్ ట్యాగ్ లతో పోస్టింగులు హల్ చల్ చేస్తుంటే వాటిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తేలుకుట్టిన దొంగలా ఎందుకు నోరెత్తడంలేదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మూడున్నరేళ్లుగా సమాధానాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలు:
‘‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి వైఎస్ వివేకానందరెడ్డి హంతకులను జగన్ ఎప్పుడు బయటకు తీసుకొస్తారోనని రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా తన బాబాయ్ హత్య విషయాన్ని నిగ్గుతేల్చేందుకు చూపిన చొరవ, బాబాయ్ పై ఒలకబోసిన ప్రేమ, చూపిన సానుభూతి, విషణ్ణ వదనంతో చేసిన నటన చూసి రాష్ట్రమంతా ఆశ్చర్యపోయింది. జగన్ హంతకులను వెంటనే పట్టుకుంటారని ఆశించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అతి త్వరలోనే బాబాయ్ హంతకులను జగన్ త్వరగా పట్టుకుంటారని కూడా ప్రజలు ఆశించారు. కానీ మూడున్నరేళ్లు గడిచినా హంతకులను పట్టుకోకపోవడంతో రాష్ట్ర ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వివేకా హత్యకేసు వేరే రాష్ట్రానికి తరలించాలంటూ సుప్రీం తలుపులు తట్టిన సునీత:
వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత తన తండ్రిని చంపిన వారిని పట్టుకోవడంలో తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయం చేస్తారని చాలా ఆశపడింది. కానీ ముఖ్యమంత్రి అయ్యాక జగన్ వివేకా హత్య కేసుగురించి ఇప్పటి వరకు కనీసం ఒక్క మాట కూడా ఎక్కడా మాట్లాడలేదు. అంతేగాకుండా తన తండ్రిని హతమార్చిన హంతకులకు జగన్ అండగా నిలబడుతున్నారని సునీత అర్థం చేసుకుంది. ఈ రాష్ట్రంలో కేసు విచారణ అంగుళమైనా ముందుకు కదలదని నిర్ధారించుకున్న సునీత ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీం కోర్టు తలుపులు తట్టాల్సివచ్చింది.
గవర్నర్ ను కలవడం బూటకమే:
వివేకా హత్య కేసును సీబీఐ తో విచారణ చేయించి, దోషులను పట్టుకునేందుకు సహకరించాలని జగన్ ప్రతిపక్షంలో ఉండగా నాటి ఏపీ గవర్నర్ ను కలిసి హడావిడి చేశారు. ఇలాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం వేసిన సిట్ ను రద్దు చేయడం, వైసీపీ ప్రభుత్వం ఒక సిట్ వేయడం, సీబీఐ చేస్తున్న విచారణను తక్షణమే నిలిపివేయాలని హైకోర్టులో తాను వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకోవడం వెనువెంటనే జరిగిపోయాయి. దీన్ని బట్టి జగన్ గవర్నర్ ను కలవడం, సీబీఐ విచారణ కోరడం మొదలగు అంశాలన్నీ కేసు విచారణను జాప్యం చేసి…దోషులను కాపాడడం కోసమేనని రుజువవుతోంది. గవర్నర్ ను కలిసిన ఎపిసోడ్ మొత్తం బూటకమేనని తేలిపోయింది.
జగన్ కు టీడీపీ బంపర్ ఆఫర్:
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జగనాసురుడుగా కనిపిస్తున్నారు. బాబాయ్ హత్య కేసులో తన ప్రమేయం ఉంది గనుకనే కేసు విచారణకు అడ్డుపడుతున్నారని రాష్ట్రమంతా కోడై కూస్తోంది. జగన్ రెడ్డికి వివేకా హత్యతో సంబంధం లేకుంటే…తాను నిర్ధోషి అని నిరూపించుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక బంపర్ ఆఫర్ ఇస్తోంది. తాము అడిగే పది ప్రశ్నలకు సమాధానం చెప్పి..తనను తాను నిర్ధోషినని జగన్ రెడ్డి నిరూపించుకోవాలి. దీనికి ఆయన 10 నిమిషాలు లేదా 10గంటలు, లేదా 10రోజులైనా సమయం తీసుకోవచ్చు. జగన్ కు ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పే ధైర్యం లేకపోతే తన జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డినైనా తెచ్చుకోవచ్చు. తనతో సమాధానం చెప్పించి తనను తాను నిర్ధోషి అని నిరూపించుకోవాలి.
జగన్ కు టీడీపీ సంధిస్తున్న పది ప్రశ్నలు:
1.వివేకా హత్య జరిగిన సంఘటనా స్థలానికి జగన్ సతీమణి భారతీరెడ్డి కుటుంబ సభ్యులే అందరికంటే ముందుగా 3నిమిషాల్లోనే ఎందుకు వెళ్లారు? ఎలా వెళ్లారు? ఏం చేయడానికి వెళ్లారు? వాళ్లు వెళ్లిన పది నిమిషాలకే సాక్షి ఛానల్ లో మీ విలేకరి మోపూరి బాలకృష్ణారెడ్డితో వివేకా గుండెపోటుతో మరణించారని బ్రేకింగ్ న్యూస్ ఎందుకు వేయించారు?
(వివేకా హత్య జరిగిన నిమిషాల వ్యవధిలోనే భారతీరెడ్డి కుటుంబీకులంతా ఘటనా స్థలానికి చేరుకుని సాక్ష్యాలను రూపుమాపే పనులు మొదలు పెట్టి, దీన్ని గుండెపోటుగా చిత్రీకరించారు. ఫోన్ వెళ్లిన మూడు నిమిషాల్లోనే అవినాష్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లారు)
2.మీ మామ ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో కాంపౌండర్ గా పనిచేసే గజ్జల జయ ప్రకాష్ రెడ్డి వచ్చి వివేకానందరెడ్డి శరీరంపై ఉన్న గాయాలకు కుట్లు వేశారా, లేదా? దీని గురించి ఎప్పుడైనా మీ మామను, నీ భార్య భారతీరెడ్డిని అయినా అడిగావా?
(వివేకాను గొడ్డలితో నరికి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించేందుకు హంతకులు ప్రయత్నించారు. దీనికోసం వివేకా శరీరంపై ఉన్న గాయాలకు కుట్లు వేసి, రక్తంతో తడిచిన బట్టలను కూడా మార్చారు. ఇదంతా అవినాష్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగింది)
3.మీరు సీఎం అయిన రెండు వారాల్లోనే 13-06-2019న అడిషనల్ డీజీ స్థాయిలో నడుస్తున్న సిట్ ను నిర్వీర్యం చేసి, కేవలం ఎస్పీ స్థాయి అధికారితో సిట్ ఎందుకు వేశారు? దీని వెనుక ఉన్న కుట్ర ఏంటి?
(ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్ వేరే పనులేవీ లేనట్లు అడిషనల్ డీజీ అమిత్ గార్గ్ గారి నేతృత్వంలోని ఉన్న సిట్ ను రద్దు చేసి, దాని స్థాయిని దిగజార్చి దోషులను కాపాడేందుకే ఈ పనిని చేశారు)
4.వివేకా హత్యకేసులో నిందితుడు ఏ-1 ఎర్ర గంగిరెడ్డికి మీరు సిఎం అయిన నెలరోజుల్లోపే బెయిల్ ఎందుకు వచ్చింది? మీరు సీఎం అయ్యాక ఎర్ర గంగిరెడ్డిపై చార్జిషీటు ఎందుకు వేయలేదు? గంగిరెడ్డికి బెయిల్ ఇప్పించడం కోసమే చార్జిషీటు వేయలేదనేది నిజం కాదా?
5.కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు, మరియు గజ్జల జయప్రకాష్ రెడ్డి కుమారుడు ఉదయ్ కుమార్ రెడ్డి ని సిట్ అధికారి అభిషేక్ మహంతి విచారించేందుకు 02-09-2019న కడప తీసుకెళ్తుంటే నీ ప్యాలెస్ నుండి మహంతికి ఫోన్ ఎందుకు వెళ్లింది? మార్గం మధ్యలోనే ఉదయ్ కుమార్ రెడ్డిని ఎందుకు వదిలిపెట్టారు? అభిషేక్ మహంతిని సుదీర్ఘ సెలవులపై ఎందుకు పంపారు? ఎవరిని కాపాడడం కోసం ఇదంతా చేశారు జగన్?
6. వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ చేయాలని హైకోర్టును సునీత పిటిషన్ ద్వారా 24-01-2020న కోరింది. ఇది జరిగిన రెండు వారాల్లోనే 06-02-2020న గతంలో సీబీఐ విచారణ చేయాలని హైకోర్టులో మీరు వేసిన పిటిషన్ ను ఆఘమేఘాల మీద మీరు ఎందుకు ఉపసంహరించుకున్నారు? సీబీఐ విచారణ జరిగితే నీ బండారం బయటపడుతుందనా?
7.వివేకా హత్య కేసులో కీలక సాక్షి అయిన శంకరయ్య సీబీఐకి 164 సీఆర్పీసీ ద్వారా అవినాష్ రెడ్డి ముఠా సాక్ష్యాలు రూపుమాపు చేసిన వ్యవహారంపై వాంగ్మూలం ఇచ్చి, ఆ తర్వాత మీ ఒత్తిడితో ప్లేటు ఫిరాయించిన వారం రోజుల్లోనే అప్పటి వరకు సస్పెన్షన్ లో ఉన్న శంకరయ్యపై సస్పెన్ష్ ఎత్తివేసి, అతనికి తిరిగి పోస్టింగ్ ఎందుకు ఇచ్చారు? శంకరయ్య సీబీఐకి ఎదురుతిరిగినందుకా?
(సీఐ శంకరయ్య 28-09-2021న సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో అవినాష్ రెడ్డి, అతని మిత్రులు, బంధువులు ఘటనా స్థలంలో చేసిన నిర్వాకాన్ని 164 సీపీఆర్సీ స్టేట్ మెంట్ ద్వారా మేజిస్ట్రేట్ ముందు చెప్పడానికి సిద్దపడ్డాడు. 30-09-2021న శంకరయ్య వాంగ్మూలం చెప్పడానికి మేజిస్ట్రేట్ ముందుకు హాజరుకాకుండా ఆ తర్వాత ప్లేటు ఫిరాయించి సీబీఐ తనను ఒత్తడి చేస్తోందని తప్పుడు ఆరోపణలు చేశారు. అది జరిగిన వారంలోనే శంకరయ్యపై సస్పెండ్ ఎత్తేసి, 06-10-2021న తిరిగి పోస్టింగ్ ఇచ్చారు)
8.వివేకా హత్య కేసులో కీలక సాక్ష్యులు కె శ్రీనివాసరెడ్డి(02-09-2019)న, గంగాధర్ రెడ్డి(09-06-2022)న అనుమానాస్పద మృతి వెనుక జరిగిన కుట్ర ఏంటి? వీళ్ల మరణంపై మీ ప్రభుత్వం ఏమైనా విచారణ చేసిందా? పరిటాల రవి హత్యకేసులో నిందితులను, సాక్ష్యులను చంపినట్టే వీళ్లను కూడా చంపేశారా?
(వివేకా హత్యకేసులో ప్రధాన నిందితుడు పరమేశ్వరరెడ్డికి కె శ్రీనివాసరెడ్డి తోడుఅల్లుడు. అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చిత్రీకరించారు. దీన్ని హైకోర్టు తప్పుబట్టి 11-03-2022న కేసున సీబీఐకి ఇస్తూ ఇచ్చిన ఆర్డర్ కాపీలోని 42వ పేరాలో శ్రీనివాసరెడ్డి ది అనుమానాస్పద మృతిగా పేర్కొంది. గంగాధర రెడ్డికి శివశంకర్ రెడ్డి రూ.10కోట్లు ఇస్తాను, తప్పును మీద వేసుకోవాలని కోరారు. దీనిగురించి 25-11-2021న సీబీఐకి వాంగ్మూలంలో చెబుతారు. 27-11-2021న వాంగ్మూలం రిజిస్టర్ చేయడానికి మేజిస్ట్రేట్ ముందు చెప్పడానికి ఒప్పుకున్నాడు. కానీ 29-11-2021న గంగాధర్ రెడ్డి ప్లేటు ఫిరాయించి, సీబీఐ ఒత్తిడి చేస్తుందని చెబుతాడు. ఆ తర్వాత అతి కొద్దికాలంలో 09-06-2022న అనుమానాస్పదంగా మరణించాడు)
9.ప్రొఫెసర్ ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి(భారతీరెడ్డి పెదనాన్న కుమారుడు)ని డాక్టర్ వైఎస్ ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీకి రిజిస్ట్రార్ గా ఎందుకు నియమించారు? వివేకా హత్యానంతరం సాక్ష్యాలను తారు మారు చేయడంలో అవినాష్ రెడ్డికి సహకరించినందుకు ఈ పదవి నజరానాగా ఇచ్చారా?
10.వివేకా హత్యకేసులో ఏ-4 శివశంకర్ రెడ్డిని మీరు అనేక రకాలుగా కాపాడడం లేదా? ఆఖరికి ఇతన్ని కడప జైల్లో సీబీఐ రిమాండ్ లో పెడితే కోర్టు అనుమతి లేకుండా అతనిని కడపలోని రిమ్స్ ఆసుపత్రికి మీరు తరలించి సకల సౌకర్యాలు కల్పించింది నిజం కాదా? శివశంకర్ రెడ్డిపై మీకు ఎందుకు అంత ప్రేమ?
(శివశంకర్ రెడ్డిని కోర్టు అనుమతి లేకుండా రిమ్స్ కు తరలించినందుకు కోర్టు 25-11-2021న ఏపీ ప్రభుత్వానికి చీవాట్లు పెడుతుంది. అలాగే కడప జైలు సూపరింటెండెంట్ కు నోటీసులు ఇచ్చింది. బాబాయ్ హత్య కేసులో ఏ-4 ముద్దాయి కొడుకు ఫంక్షన్ కు 26-05-2022న క్యాబినెట్ మంత్రులు వెళ్లడం ఏంటి? వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న శివశంకర్ రెడ్డిపై పార్టీ నేటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. శివశంకర్ రెడ్డి నోరు తెరిస్తే అవినాష్ రెడ్డి, తన వెనుక ఉన్న గ్రూపు గుట్టు రట్టవుతుందనే జగన్ కొమ్ముకాస్తున్నాడు)
ఈ పది ప్రశ్నలకు టకటకా సమాధానం చెప్పి…అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ అనే మచ్చను తొలగించుకుంటారా, లేక వివేకా హత్యతో తనకు సంబంధం ఉందని ఒప్పుకుంటారా? అని పట్టాభి జగన్ రెడ్డిని ప్రశ్నించారు.
బాబాయ్ హత్య ఏ గొడ్డలితో జరిగింది?
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఒకానొక సందర్భంలో వివేకా హత్య కేసును తక్షణమే సీబీఐ కి అప్పగించాలని సునీత కోరితే..జగన్ రెడ్డి చాలా హేళనగా మాట్లాడుతూ…సీబీఐకి ఇస్తే ఏమవుతుంది? అవినాష్ రెడ్డిపై ఉన్న 11కేసులకు మరో కేసు కలిసి 12వ కేసు నమోదవుతుంది తప్ప..మరేం కాదు అని సమర్థించడంపై సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
సునీత పోరాటానికి అండగా నేను సైతం:
వివేకా కుమార్తె డాక్టర్ సునీత న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి నేను సైతం అండగా ఉంటా. పార్టీలతో ప్రమేయం లేకుండా ఒక బాధ్యతగల పౌరుడిగా సునీత వెనుక నేను నిలబడతాను. రాష్ట్ర ప్రజలు కూడా జగన్ పై సునీత చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలబడాలి.