– భార్య కొడుతోందని భర్త ఫిర్యాదు
– ప్రధాని మోదీ కార్యాలయానికి ఓ పురుషుడి మొర
– మీరు చెప్పే నారీశక్తి ఇదేనా అని ట్వీట్
– భార్యపై గృహహింస కేసు పెట్టొచ్చా అని మోదీకి ప్రశ్న
– కర్నాటక వాసి వింత ఫిర్యాదు
– భార్యా బాధితుడి మొర పీఎంఓ ఆలకించేనా?
– ‘మగబాధ’ను పంచుకుంటున్న పురుషులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆయనో పురుష పుంగవుడు. పేరు యదునందన్ ఆచార్య. ఈ కర్నాటక వాసికి ఈమధ్య పెద్ద కష్టమే వచ్చిపడింది. దానిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. నేరుగా ప్రధాని మోదీ కార్యాలయానికి ట్వీట్ చేశాడు. పైగా ఇది ‘మగవారి బాధ’గా అభివర్ణించాడు. పాపం ఆ పురుష పుంగవుడు చేసిన ట్వీట్, పీఎంఓనూ ఆలోచనలో పడవేసిందట.
ఇంతకూ విషయమేమిటంటే.. యదునందన్ ఆచార్య భార్యా బాధితుడు. సహజంగా భార్యలను వేధించే భర్తల గురించి వింటుంటాం. వారు పెట్టే చిత్రహింసలు చూస్తుంటాం. అత్తా మామల వేధింపుల గురించీ, పత్రికల్లో చదవి ఉంటాం. భార్యను వేధించే భర్తపై చర్యలు తీసుకోవాలని, మహిళా సంఘాలు కొంగుబిగించడమూ చూస్తుంటాం.
కానీ మన యదునందన్ ఆచార్యది మాత్రం, రొటీన్‌కు భిన్నమైన స్టోరీ. ఎందుకంటే పాపం ఆయన భార్యా బాధితుడు కాబట్టి. అవును. తన భార్య చిత్రహింసలు పెడుతోందని ఆయన వాపోతున్నాడు. అంతేనా?.. ‘నా భార్య నాపై కత్తితో దాడి చేసింది మహాప్రభో. నన్ను కాపాడండి’ అంటూ సదరు ఆచార్య.. ఏకంగా
ప్రధానమంత్రి కార్యాలయానికే ట్వీట్ చేశారు. మరో అడుగు ముందుకేసి.. మీరు చెప్పే నారీ శక్తి అంటే ఇదేనా? అని ఆవేశపడి.. ఇప్పుడు నన్నేం చేయమంటారు చెప్పండి? ఆమెపై గృహహింస కేసు పెట్టవచ్చా? లేదా?అని అమాయకంగా పీఎంఓనే సలహా అడిగాడు.
‘నాకు మీరేమైనా సహాయం చేయగలరా? ఎందుకంటే నేను పురుషుడిని’అంటూ దీనంగా అర్ధించి, పీఎంఓ అధికారులనే సందిగ్థంలో పడేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయి, సాటి పురుష పుంగవుల సానుభూతిని టన్నుల కొద్దీ దోచేస్తోంది.
మరి ప్రధాని కార్యాలయ అధికారులు, సాటి పురుషుడికి సాయం చేస్తారా? లేక ఇదేదో పిచ్చోడి కేసులే అని లైట్ తీసుకుంటారో చూడాలి. అయినా.. ఆచార్య తన కష్టాన్ని కర్నాటకలోని పోలీసులకు ఫిర్యాదు చేయకుండా, పీఎంఓకు ఫిర్యాదు చేయడమే వెరైటీ కదా?
Would anyone help me? Or did anyone help me when this happened?
No, Because I am a man!
My wife attacked me with knife, Is this the naari shakti you boost about? Can I put a domestic violence case against her for this? No!@PMOIndia @KirenRijiju @NyayPrayaas@CPBlr#MenToo pic.twitter.com/VNqtTQ5kPK— Yadunandan Acharya (@yaadac) October 29, 2022