ప్రలోభ పథకాలు, మందు, విందులు, ధన ప్రవాహం, 18 వేల కోట్ల కాంట్రాక్టు, 500 కోట్ల ఖర్చు, ద్రోహాలు, కుట్రలు, ఆధిపత్యం, అమ్మకాలు, కొనుగోళ్లు, రాష్ట్రంలోని జిల్లా లీడర్ల నుండి సర్పంచ్ ల వరకు వేల మంది నాయకులు, 80 మంది ఎమ్మెల్యేలు, 15 మంది మంత్రులు, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అగ్ర నాయకుల నుండి మొదలు గల్లీ నాయకుల వరకు అందరూ నెల రోజుల పాటు తిష్ట వేసి హోరా హోరీ ప్రచారం తర్వాత ముగిసిన మునుగోడు ఎన్నికల్లో మునిగింది ఎవరు? తేలింది ఎవరు?
ప్రజలకు ఏమాత్రం అక్కరకు రాని మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ పార్టీలకు చాలా అవసరమైనదిగా చెప్పవచ్చును. ఇంకో ఏడాది కాలంలో రానున్న సార్వత్రిక ఎన్నికల ముందు ఈ ఎన్నిక అన్ని పార్టీలకు ఒక రిహార్సల్ లాగా పనికి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా వెంటనే వచ్చే మార్పు ఏమి ఉండదని, ప్రభుత్వాలు పడిపోయేది లేదని, ప్రజలకు ఒరిగేదేమి లేదని ముందునుండే తెలిసినా ఈ ఎన్నికపై అన్ని రాజకీయ పార్టీలతో పాటు రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో చూసారు.
2018 లో కాంగ్రెస్ నుండి గెలిచిన రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత లాభాపేక్ష కోసం రాజీనామా చేస్తే వచ్చిన ఉప ఎన్నికల్లో ధర్మంగా అయితే కాంగ్రెస్ గెలవాలని అందరూ కోరుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను తనవెంట తీసుకెళ్లాడు. అంగ భలం, అర్ధ భలం కలిగిన రాజగోపాల్ రెడ్డి గత ఆరు నెలల నుండే మునుగోడు కాంగ్రెస్ నాయకులకు డబ్బు సంచులు అందించి మెజార్టీ శ్రేణులను తనవైపు తిప్పుకొని రాజీనామా చేసాడు. రాజగోపాల్ రెడ్డి చేసిన విద్రోహం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న చర్యలు శూన్యం. బలహీనమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వల్ల అధికార టిఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు బిజెపికి, రాజగోపాల్ రెడ్డి వ్యతిరేక ఓట్లు టిఆర్ఎస్ కు పడి మధ్యలో కాంగ్రెస్ మునిగింది.
మునుగోడులో జరిగిన విద్రోహ చర్య నుండి కాంగ్రెస్ లేచి నిలబడడానికి సరైన ప్రయత్నం చేయలేదు. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని, కేంద్ర నాయకత్వానికి సవాలు విసిరి శాసన సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేసి బిజెపి లోకి వెళ్లిన రాజగోపాల్ రెడ్డిని ఓడించి తన సీటును తిరిగి కైవశం చేసుకోవడం కోసం కాంగ్రెస్ కష్టించి పని చేయలేదు. డబ్బు, ఆధిపత్యంతో నడుస్తున్న నేటి రాజకీయాల్లో రాజగోపాల్ రెడ్డికి దీటుగా సమర్ధవంతమైన అభ్యర్థిని నిలపకపోవడం వల్లనే కాంగ్రెస్ మునిగింది. డబ్బు లేనప్పడు, బలమైన అభ్యర్థి లేనప్పుడు సామాజికంగా ఓటు బాంక్ కలిగిన బలమైన అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉంది. బి.సి వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టి, సామాజికన్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని ప్రకటిస్తే రాష్ట్రంలోని బి.సి నాయకులందరు వచ్చి మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసేవాళ్ళు. రాష్ట్రంలో అధికారంలోనున్న టిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కలిగిన నేటి తరుణంలో ఆ వ్యతిరేక ఓట్లను సాధించడంలో కాంగ్రెస్ విఫలమైంది. బలమైన అభ్యర్థిని పోటీలో నిలపనందునే ఇంతటి పరాభవం జరిగింది. కాంగ్రెస్ ను టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా చూస్తున్న నేటి తరుణంలో కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్ల నేడు మునుగోడులో టిఆర్ఎస్ గెలిచింది. రెండవ స్థానంలో నిలిచిన బిజెపి రాష్ట్రంలో వారే ప్రత్యామ్నాయమని మాట్లాడే స్థితికి రాజకీయాలు చేరుకున్నారు.
కాంగ్రెస్ మారాలి
తెలంగాణ కష్టాలను అర్ధం చేసుకుని ఇక్కడి పోరాటాలను అర్ధం చేసుకొని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆ తెలంగాణలోనే స్థానం లేకపోవడం చాలా బాధాకరం. ఇలాంటి స్థితికి రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకత్వమేనని తెలుస్తుంది. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీ కోరితే టిఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కూడా కెసిఆర్ చెప్పారు. కానీ అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం టిఆర్ఎస్ తో పొత్తు, విలీనం అవసరం లేదు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఒంటరిగానే గెలుస్తామని చెప్పి బొక్క బోర్లా పడ్డారు. నాయకత్వంలో సమన్వయం లేకపోవడం వల్ల 2014 ఎన్నికల్లో ఇచ్చిన టికెట్లను కూడా చివరి దశలో మార్చి పార్టీ ఓటమికి కారణమయ్యారు. 2018 కెసిఆర్ తెచ్చిన ముందస్తు ఎన్నికలను ఎదుర్కోవడంలో కూడా కాంగ్రెస్ విఫలమైంది. మహా కూటమి పేరుతో పొత్తులు కుదరక ఎన్నికల వేల నెల రోజుల సమయం వృధా చేసుకున్నారు. కాంగ్రెస్ విఫలాలను గమనించిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడి అధికార టిఆర్ఎస్ లోకి వెళ్లి పార్టీకి తీరని నష్టం చేశారు. పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు పూనుకోలేదు. పార్టీ ఫిరాయించిన నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలను అడుగడుగునా అడ్డుకోవాల్సి ఉన్నది. అలా చేయడం వల్ల ఆ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను కాపాడుకునే అవకాశముండేది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపాల వల్ల, ఫిరాయింపుల వల్ల పార్టీ పట్ల ప్రజలకు విశ్వాశం సన్నగిల్లింది. తద్వారా ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ వెనుకబడింది. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జాతి క్షేమం కోసం, దేశ రక్షణ కోసం జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీని చూసైనా అంతర్గత కలహాలు వీడి అంకితభావంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి.
వాపును బలుపు అనుకుంటున్న బిజెపి
ఇటీవల తెలంగాణలో జరిగిన జరిగిన ఉప ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాల్లో గెలిచి, మునుగోడులో రెండవ స్థానానికి చేరుకున్న బిజెపి మేమే తెలంగాణలో ప్రత్యామ్నాయమని రానున్న రోజుల్లో అధికారం చేపడుతామని మాట్లాడుతున్నారు. బిజెపి మాటలు వింటుంటే బిజెపి భ్రమల్లో మాట్లాడుతుందని, వాపును చూసి బలుపు అనుకుంటున్నట్లు అర్ధమవుతుంది. బిజెపి సిద్ధాంతాలు, భావజాలం రీత్యా పట్టణ ప్రాంతాల్లో కొంత మేరకు ఓట్లు ఉంటాయి కానీ గ్రామాల్లో బిజెపి కు ఓట్లు లేవు. మునుముందు కూడా బిజెపి కి తెలంగాణలో ఓట్లు రావు. వామపక్ష, ప్రగతిశీల ఉద్యమాల చరిత్ర కలిగిన తెలంగాణలో బిజెపి రాణించలేదు. దుబ్బాక, హుజురాబాద్ నియోజకవర్గాల్లో బిజెపి గెలిచినా ఆ విజయానికి పరోక్షంగా కాంగ్రెస్ కారణమైంది. కాంగ్రెస్ తో పాటు ఆ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిష్ట ద్వారానే బిజెపి గెలిచిందని అర్ధం చేసుకోవాలి. మునుగోడులో కూడా బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి రెండవ స్థానంలో నిలవడం అనేది రాజగోపాల్ రెడ్డి వల్లనే అని చెప్పాలి. దుబ్బాక, హుజురాబాద్ లో బిజెపిని గెలిపించిన తెలంగాణ ప్రజలు మునుగోడులో ఓడించారు. మునుగోడు ఓటమిని చూసైనా తన బలాన్ని అంచనా వేసుకోవాలి. తెలంగాణ ఉద్యమ చరిత్ర కలిగి ప్రజలతో సత్సంబంధాలు కలిగిన రఘునందన్ గెలవడం వెనుక కెసిఆర్ దయతో పాటు కాంగ్రెస్ అక్కడ ఓట్లను చీల్చడం ద్వారా బిజెపి గెలుపు సులువైంది. కెసిఆర్ అహంకారినికి వ్యతిరేకంగా జరిగిన హుజురాబాద్ ఎన్నికలో ఈటల రాజేందర్ ను ప్రజలు గెలిపించారు. గత ఎన్నికల్లో 60 వేల ఓట్లున్న కాంగ్రెస్ ఈటలకు మద్దతుగా నామమాత్ర పోటీలో ఉండి బిజెపిని గెలిపించారు. మునుగోడులో కూడా బిజెపి కి వచ్చిన ఓట్లు గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లనే విషయం బిజెపి నాయకత్వం గుర్తెరిగి మాట్లడాలి.
భవిషత్ లో తెలంగాణలో పాగా వేయడం ద్వారా దక్షిణ భారతదేశంలో విస్తరించాలని ఎప్పటినుండో చూస్తున్న బిజెపి తెలంగాణలో ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు సంపన్న నాయకులను పార్టీలోకి లాక్కుంటుంది. దానిలో భాగమే మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని లాగి ఉప ఎన్నికకు కారణమయ్యారు. మునుగోడులో గెలిస్తే నెల రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని కూడా బిజెపి నాయకత్వం మాట్లాడింది. ప్రజలను ఇలాంటి భావోద్వేగాలకు గురిచేసి లేని భలాన్ని సృష్టించడంలో బిజెపి దిట్టని గతంలో రుజువైంది. గతంలో రాష్ట్రంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇలాంటి జిత్తులతోనే నాలుగు సీట్లు గెలిచారు. ఆదిలాబాద్ లో లంబాడ, ఆదివాసుల మధ్య వైరుధ్యాన్ని గమనించి ఆదివాసీని పోటీలో నిలబెట్టి గెలిచారు. హిందూ ముస్లిం అల్లర్లను పెంచి కరీంనగర్ లో గెలిచారు.
గెలుపు టిఆర్ఎస్ ది కాదు
మునుగోడు పోరులో గెలిచి నిలిచామని సంబరాలు జరుపుకుంటున్న టిఆర్ఎస్ ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి నాయకుల వరకు మునుగోడులో మోహరించి, అధికార యంత్రాంగంతో పాటు పోలీసుల సహాకారంతో మందు, విందులతో పాటు డబ్బు పంపిణీ చేసినా టిఆర్ఎస్ తన స్వంత భలంతో మునుగోడులో గెలవలేదు. హుజురాబాద్ లో ఏ అంశం బిజెపిని గెలిపించిదో ఇక్కడ అదే అంశం బిజెపిని ఓడించి టిఆర్ఎస్ ను గెలిపించింది. కెసిఆర్ అహంకారానికి అడ్డుకట్ట వేయడం కోసం హుజురాబాద్ లో బిజెపి అభ్యర్థి ఈటలను గెలిపించారు. ఇక్కడ అదే రిపీట్ అయింది కాకపోతే ఇక్కడ బిజెపిని ఓడించి టిఆర్ఎస్ ను గెలిపించి రాజగోపాల్ రెడ్డి అహంకారానికి మునుగోడు ప్రజలు బుద్ధిచెప్పారు. 2018 లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డిని ఆనాడు గెలిపించడం కోసం నియోజకవర్గంలో ఉన్న కమ్యూనిస్టులు, మాజీలు అండగా ఉన్నారు. బిజెపి సిద్ధాంతంపై, దాని మతతత్వ రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించే వామపక్ష ప్రగతిశీల శక్తులు రాజగోపాల్ రెడ్డి ని ఓడించడం కోసం టిఆర్ఎస్ తో జతకట్టారు. వీరికి తోడు కాంగ్రెస్ శ్రేణులు కూడా టిఆర్ఎస్ కు ఓట్లను మరల్చారు. 2018 లో కాంగ్రెస్ నుండి గెలిచి పార్టీ మారి విద్రోహానికి పాల్పడిన రాజగోపాల్ ను ఓడించడానికి కాంగ్రెస్ భలమైన అభ్యర్థిని నిలబెట్టకపోవడం వల్ల కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి ఓట్లు వేసినా రాజగోపాల్ రెడ్డి ని ఓడించడం సాధ్యం కాదని గమనించిన మునుగోడు ప్రజలు ఓడించగలిగే టిఆర్ఎస్ కు ఓటు మార్పిడి జరిగితేనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ ఓటు కూడా టిఆర్ఎస్ కు వేసారు. టిఆర్ఎస్ గెలుపులో కాంగ్రెస్ శ్రేణుల పాత్ర కూడా కీలకంగా ఉంది. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ప్రగతిశీల శక్తుల ఓట్లు టిఆర్ఎస్ కు పోలైనందువల్లనే టిఆర్ఎస్ గెలిచింది.
టిఆర్ఎస్ కు గడ్డు కాలం
ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో రెండవసారి అధికారం చేపట్టిన టిఆర్ఎస్ పార్టీకి ముందున్న కాలం గడ్డు కాలమే. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయంపాలన నినాదాలతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరక పోవడం వల్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడ్డది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనడంలో కెసిఆర్ సఫలీకృతుడయ్యాడు. అయినా కాంగ్రెస్ పార్టీ పుంజుకుని టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారుతుంది. కెసిఆర్ తన రాజకీయ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ భలాన్ని తగ్గించి బిజెపి భలాన్ని పెంచాలని చూసి ఆ దిశగా తన ప్రచారాన్ని పెంచాడు. డామిట్ కథ అడ్డం తిరిగినట్లు కెసిఆర్ వ్యూహం అడ్డం తిరిగింది. మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి టిఆర్ఎస్ ను ఓడించినంత పని చేసి రెండవ స్థానంలో నిలిచి తెలంగాణలో ప్రత్యామ్నాయం మేమే అంటున్నారు. మునుగోడు తదనంతర పరిణామాలతో కెసిఆర్ తలపట్టుకున్నాడు. కేంద్రంలో అధికారంలోనున్న బిజెపి కన్నా కాంగ్రెస్ పార్టీనే రెండవ స్థానంలో ఉంటే బాగుండని బాధపడున్నాడు. ఇప్పటివరకు జరిగిన మూడు ఉప ఎన్నికల పలితాలను చూసైనా కెసిఆర్ తన పాలనలో మార్పు తీసుకురావాలి. ఉద్యమ ఆకాంక్షల అమలుకు ప్రణాళికలు తయారు చేసి తక్షణమే అమలు చేయాలి. లేదంటే ప్రజలే కెసిఆర్ ను మార్చడానికి సిద్ధంగా ఉన్నారు.
విలువల రాజకీయాలు రావాలి
ప్రజల ఓట్లతో గెలిచి ఐదు సంవత్సరాల కాలం పదవిలో ఉండకుండా మధ్యంతర రాజీనామాలను ప్రజలు వ్యతిరేకించాలి. ప్రజా తీర్పును తిరస్కరించి, ప్రజాస్వామ్య విలువలను కాలరాసి స్వీయ లాభాపేక్షతో రాజీనామా చేసిన వారిని తిరిగి అదే ఎన్నికలో పోటీ చేయకుండా నిరోధించే చట్టం రావాలి. అర్థంపర్ధం లేని ఈ మధ్యంతర రాజీనామాలు ప్రజాస్వామ్య ప్రక్రియలో గొడ్డలి పెట్టుగా మారాయి. తద్వారా అవినీతికరమైన, అరాచకమైన కార్యకలాపాలకు కారణమవుతుంది.