వారం రోజులలో పెన్షన్ కార్డుల పంపిణీ పూర్తి

దళితబందు కార్యక్రమం రెండో విడత అర్హులైన లబ్దిదారుల వివరాలను నాలుగు రోజులలో అందజేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో నగరానికి చెందిన పలువురు MLA లు, అధికారులతో దళిత బందు, ఆసరా పెన్షన్ ల పై మంత్రి శ్రీనివాస్ యాదవ్ హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు అనే గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ప్రారంభించారని తెలిపారు. మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 100 మంది చొప్పున ఎంపిక చేసి ఒకొక్కరికి 10 లక్షల రూపాయలు చొప్పున వారి ఖాతాలలో జమచేసి, వారు ఎంపిక చేసుకొన్న యూనిట్లను అందజేసినట్లు వివరించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 15 నియోజకవర్గాలలో మొదటి విడతలో 1484 మంది అర్హులైన లబ్దిదారులకు లబ్దిచేకూర్చినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా దళితబందు క్రింద మొదటి విడతలో లబ్దిపొందిన వారు పొందిన లబ్ది, సాధించిన విజయాలను వివరిస్తూ రూపొందించిన వీడియో లను ప్రదర్శించారు. ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఈ పథకం వలన తాము ఎంతో ప్రయోజనం పొందామని, తమకు 10 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందజేసిన ముఖ్యమంత్రి KCR, రాష్ట్ర ప్రభుత్వానికి లబ్దిదారులు కృతఙ్ఞతలు తెలిపారు. వీడియో ప్రదర్శన అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రెండో విడతలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం 500 చొప్పున అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసి 10 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందజేయనున్నట్లు చెప్పారు.

నాలుగు రోజులలో అర్హులైన వారి దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందించేలా చూడాలని MLA లను మంత్రి కోరారు. దరఖాస్తులను అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపిన అనంతరం లబ్దిదారుల ఖాతాలలో నిధులను జమ చేస్తారని తెలిపారు. లబ్దిదారులకు ఆసక్తి కలిగిన రంగాలలో అవసరమైన శిక్షణ ను అందించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. మొదటి విడతలో అందజేసిన యూనిట్లు సక్రమంగా ఉన్నాయా? లేదా? పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. మొదటి విడత అమలులో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రెండో విడత అమలులో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. లబ్దిదారుల వివరాలు, యూనిట్లు తదితర సమాచారంతో నియోజకవర్గాల వారిగా ప్రత్యేకంగా నివేదికలను రూపొందించి సంబంధిత శాసనసభ్యులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని SC కార్పోరేషన్ ED రమేష్ ను మంత్రి ఆదేశించారు.

వారం రోజులలో పెన్షన్ కార్డుల పంపిణీ పూర్తి …మంత్రి తలసాని
ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీని వారం రోజులలోగా పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ఆసరా పెన్షన్ ల పంపిణీ పై సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఆగస్టు 15 న రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల నూతన పెన్షన్ లను మంజూరు చేసిందని, అందులో హైదరాబాద్ జిల్లాకు 80,824 నూతన పెన్షన్ లను మంజూరు చేసిందని చెప్పారు. అందులో ఇప్పటి వరకు 74,231 గుర్తింపు కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేసినట్లు వివరించారు. మిగిలిన 5933 గుర్తింపు కార్డులను కూడా లబ్దిదారులకు పంపిణీ చేసే ప్రక్రియను వారం రోజులలో పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో MLC ప్రభాకర్ రావు, MLA లు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, సాయన్న, కౌసర్ మొయినుద్దీన్, మౌజం ఖాన్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, SC కార్పోరేషన్ ED రమేష్, RDO లు వసంత, వెంకటేశ్వరరావు, పలువురు తహసిల్దార్ లు పాల్గొన్నారు.

Leave a Reply