– రూ.22.10కోట్ల విలువైన ఆస్తులు అటాచ్
తాడిపత్రి: తెదేపా మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి సంస్థకు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన సంస్థల బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగినట్లు ఈడీ పేర్కొంది.
దివాకర్ రోడ్‌లైన్స్, ఝటధార ఇండస్ట్రీస్ ఆస్తులు, సి.గోపాల్ రెడ్డి అండ్‌కోకు సంబంధించిన కంపెనీ ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపింది. జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడైన కాంట్రాక్టర్ గోపాల్‌రెడ్డి కంపెనీ ఆస్తులను సైతం అటాచ్ చేసింది. సుమారు రూ.22.10కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.
‘‘సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఝటధార ఇండస్ట్రీస్, గోపాల్ రెడ్డి అండ్ కో కంపెనీలు అశోక్‌లేలాండ్ నుంచి తక్కువ ధరకే బీఎస్-4 వాహనాలను కొనుగోలు చేశాయి. నాగాలాండ్, కర్ణాటక, ఏపీలో తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించాయి. రూ.38.36 కోట్ల లావాదేవీలు అక్రమంగా జరిగినట్లు గుర్తించాం’’ అని ఈడీ పేర్కొంది.