అదొక పట్టణం…
కుప్పతొట్టి పాలైన పురిటి కందులను
విధి వంచితులైన అనాధలను
నిస్సహాయులైన వృద్ధులను
బ్రతుకు జరుగుబాటు లేని వికలాంగులను
ఇలా… ఎందరి ఎందర్నో
అక్కున చేర్చుకున్నఆ పట్టణంలోని ఓ మురికివాడ ప్రాంతం అది….!
పేగు బంధం..రక్త సంబంధం కలిగిఉన్న వారు కాకపోవచ్చు అక్కడి వారందరు..
కాని తాము పొగట్టుకున్న ఆత్మీయులను…
నోచుకోని అప్యాయత అనురాగాలను తోటి వారిలో
వెతుక్కుంటుంటారు వీరందరు…!
అందుకే ఒకరికొకరు ఆత్మబంధువులు అక్కడివారందరు…!!
అటువంటివారిలోని ఒకరి దీనగాధకు
అక్షర రూపాన్ని ఇచ్చే ప్రయత్నమే ఈ “పండుటాకు”..!
తెల్లవారుతుండటంతో….
పక్షులు గూడును వదులుతున్నాయి…
ఒకరిని ఒకరు తొసుకుని ముందుకు పోతున్నట్టుగా
జనావళి యాంత్రిక జీవితంలోకి పరుగులు పెడుతున్నారు…!
కానీ మురికివాడలో గూడులాంటి తన గుడెసలో ఉన్న సీతమ్మ దీర్ఘ ఆలోచనలో ఉంది…
బక్కచిక్కిన శరీరం…ముడతలు పడిన చర్మం.. లోతుకు పోయిన కళ్లు.. చేతి కర్రతో నడిచే నిస్సహాయ స్ధితి… డెబ్భై పైపడిన వయస్సుతో పండుటాకులా ఉంది సీతమ్మ ఆ సమయంలో…!
.. పట్టుమని పది మెతుకులతో కడుపు నిండిపోతుంది అన్నట్టుగా లోతుకుపోయిన పొట్ట ఇది సీతమ్మ పరిస్ధితి…! …….అటువంటి నిస్సహాయురాల పోషణ భారమైపోయింది స్వార్ధపరులైన తన పిల్లలకు… అచేతన స్ధితిలో ఉన్న ఆ అభాగ్యురాలిని ఓ రైలు ఎక్కించేసి వదిలించేసుకున్నారు సీతమ్మ సంతానం… ఆ సందర్భంలోనే ఈ మురికివాడకు చేరుకుంది సీతమ్మ…!
బాధపడే హృదయానికి కనీళ్ళే ఆత్మబంధువులు.. జ్ఞాపకాలన్నీ సమ్మెట పోటులా బాధించినప్పుడు వచ్చే కనీళ్ళే తనను ఊరడించే ఆత్మబంధువులుగా భావించడాన్ని సీతమ్మ రివాజుగా చేసేసుకుంది….!!
“టక…టక..”అంటూ ఎవరో తలుపును కొడుతున్న శబ్ధం అవ్వడంతో తనను చుట్టుముట్టిన ఆలోచనల నుండి కాస్త తేరుకుంది సీతమ్మ… తలుపులు తీసిన సీతమ్మకి అయాసపడుతూ.. అత్రుతగా తన ఇంటి గుమ్మం ముందు నిలుచుని ఉన్న మల్లేశం కనపడ్డాడు..
“ అమ్మ సీతమ్మ… నాలుగు రోజుల నుండి నా బిడ్డకి జ్వరం… అవ్వ కావాలి అంటూ నీ గురించి ఒకటే ఏడుస్తున్నాడు.. నువ్వు వచ్చి కాస్త ఊరడించమ్మ…నీ చేతితో ఓ నాలుగు ముద్దలు తినిపించు నా బిడ్డకి”… అంటూ రెండు చేతులు జోడించి ప్రాధేయ పడుతున్నాడు మల్లేశం.
పసితనంలోనే ఈ మురికివాడకు వచ్చి పెరిగిన మల్లేశానికి తన తల్లి తండ్రులు ఎవరోకూడ తెలియదు…! తనకు కుప్పతొట్టిలో దొరికిన బిడ్డనే తన కన్నబిడ్డ కంటే ఎక్కువగా సాకుతున్నాడు.. తనలాగే మరొకరికి అనాధ బ్రతుకు కాకుడదని…!. అలాగే సీతమ్మలో కన్నతల్లిని చూసుకుంటున్నాడు. మల్లేశం మాటలు విన్న సీతమ్మ అత్రుతగా మల్లేశం ఇంటికి చేరుకుంది….
మల్లేశం బిడ్డని ఒడిలోకి తీసుకుని “బంగారు కొండ నానమ్మని వచ్చేసాను… మందులు వేసుకో నీకు ఆయ్ తగ్గిపోతుంది… కొంచెం అన్నం తిను నాన్న”…అంటూ ఆ బిడ్డను తన ప్రేమతో మురిపిస్తోంది…
ఆ బిడ్డకు అన్నం తినిపిస్తున్నంత సేపు తన పిల్లలే కళ్ళముందు కనిపించారు సీతమ్మకి.. అన్నం తినడానికి మారం చేస్తున్న వారిని “ఇది తాతయ్య ముద్ద.. ఇది మావయ్య ముద్ద” అంటూ మురిపిస్తూ వారికి తినిపిస్తున్న సందర్భం తన కళ్ళముందు ఒక్కసారిగా తొణికిసలాడింది సీతమ్మకి.
“పాపం ఇంకా వాళ్ళు అన్నం తిన్నారో లేదో.. కారం అంటే అసలు పడదు వారికి”.. అనుకుంటూ ఆ జ్ఞాపకాలతో చెమ్మ గిల్లిన తన కళ్లను తుడుచుకుంది. తన ఒడిలోనే ఆదమరిచి నిద్రపోతున్న మల్లేశం బిడ్డ తలను ప్రేమగా నిమురుతు అక్కడే ఉండిపోయింది సీతమ్మ.
సీతమ్మ కళ్ళల్లో ఒకటే ఆనందం… దీనికి ప్రధాన కారణం తానుండే వాడలోనే ఉంటున్న భుజంగం తన కుమార్తెను పెండ్లి కూతురు చేసే కార్యక్రమానికి తనని పెద్ద రికం వహించమని అడిగినందుకు…. “విధవరాలిని నేను ఎందుకు నాయనా ఈ కార్యక్రమానికి”….అని సీతమ్మ అంటున్నప్పటికి భుజంగం ఒప్పుకోలేదు… “నీ చల్లని మనస్సుతో మా చిట్టి తల్లిని దీవించాల్సిందే”…అంటూ భుజంగం దంపతుల మంకు పట్టును కాదనలేక పోయింది…. ….తాను కూడ పెద్ద కుటుంబం నుండి వచ్చిందే… సిరి సంపదులతో తులతూగినప్పుడు బంధువుల ఇంట జరిగే వేడుకలలో తానే అంతా అయి పెద్దరికం వహించేది సీతమ్మ..!
“ఒరే రామభద్రం నీ అదృష్టమంతా సీతమ్మతోనే వచ్చిందిరా”…అంటూ తన భర్తను బంధుజనం పొగుడుతూ ఉంటే రామభద్రం కేసి చూస్తు ముసిముసి నవ్వులు నవ్వుకునేది సీతమ్మ…
కాలం ఒకేలా ఉండదు ఎప్పుడూ… అపాత్ర ధానాలు… అడిగిన వారికి కాదనకుండా చేసిన సహాయాలు, వ్యాపారల్లో నష్టాలు కారణంగా ఆస్తిపాస్తులు కరిగిపోగానే బంధుజనం, శ్రేయోభిలాషులు అనుకున్నవారు ఒకొక్కరు దూరమయ్యారు…!..
… ఒకప్పుడు పొగిడినవారే “సీతమ్మ” నష్ట జాతకురాలు అందుకే వారికి ఈ దరిద్రం”…అంటూ చాటుమాటుగా సన్నాయి నొక్కులు నొక్కడం సీతమ్మ దంపతున్ని బాధిస్తూ ఉండేవి”…. ఇలాంటి ఆటుపోటుల మధ్య భర్త కూడ దూరం కావడంతో పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి అష్టకష్టాలు పడింది. “సీతమ్మ నీ మనవరాలిని అశీర్వదించమ్మ”…అంటూ భుజంగం దంపతులు తమ కుతుర్ని తన పాదలచెంత నిలపడంతో ఒక్కసారిగా ఆలోచనల సుడిగుండం నుండి వర్తమానంలోకి వచ్చింది సీతమ్మ…!
భుజంగం కూతురుని ప్రేమతో ముద్దడుతూ తన కొంగు ముడిన దాచిఉంచుకున్న ఉంగరాన్నిఆమెకు తొడిగింది సీతమ్మ….
…“ఒరేయ్ భుజంగం ఈ ఉంగరాన్ని నా చిన్నప్పుడు మా అమ్మనాకు తొడిగింది… నేను ముసలిదాన్ని అయిపోయాను…ఆ ఉంగరాన్ని ఇప్పుడు నేనేమి చేసుకోవాలి అనుకునేదాన్ని” ….ఇప్పుడు నీ కూతురులో మా అమ్మే కనిపిస్తోందిరా….. అందుకే మా అమ్మకే ఈ ఉంగరాన్ని ఇచ్చేస్తున్నాను”….అంటూ వారందర్నీ అశీర్వదిస్తూ అక్కడనుండి కదలసాగింది సీతమ్మ..
సీతమ్మ నిరాడంబరతకు… ఆమె చూపిన ప్రేమవాత్సల్యలకు అక్కడి వారి కళ్ళు చెమ్మగిల్లాయి వెనువెంటనే…!. ఆమె అక్కడనుండి కదులుతున్న దృశ్యాన్ని కన్నీళ్ళతో మసకబారిన తమ కళ్ళను తుడుచుకుంటూ చూడటం అక్కడవారి వంతైంది ఆక్షణంలో…!
*
.. “అమ్మ సీతమ్మ… నీ సేవ, ప్రేమ వాత్యల్యలతో ఈ వాడలోని అందరికి తలలో నాలుక అయ్యావు.. ఇక్కడ పిల్లలందరితో ప్రేమగా అవ్వ అని పిలిపించుకుంటున్నావు.. మరొపక్క దైవరాధన, సేవ చేసుకుంటూ నీ జన్మ ధన్యం చేసుకుంటున్నావు… ఈ విధంగా “మానవ సేవే మాధవ సేవ” అనే నానుడిని నీ వ్యక్తితతత్వానికి చక్కని ఆభరణంగా చేసేసుకున్నావు…
…ఇంత కలుపుకోలు తనం ఉన్న నిన్ను నీ పిల్లలు దూరం చేసుకోవడం చాల బాధకరంగా ఉంది… నువ్వు మళ్ళీ వారి దగ్గరకి వెళ్లడానికి ప్రయత్నించలేదా”??…. అంటూ ప్రసాదాన్ని అందిస్తూ గుడి పూజారి పరంధామయ్య అంటున్న మాటలు సీతమ్మను ఒక్కసారి గతంలోకి నెట్టెసాయి.
“పూజరి గారు నాకు ఇద్దరు పిల్లలు..!….. పెద్దోడు పుట్టుకతోనే వికలాంగుడు… వాడి అలానా పాలానకు నేను దగ్గరే ఉండాల్సి వచ్చింది… నా తదనంతరం వాడి భారం తమ మీద పడుతుందని నా చిన్న కొడుకు, కోడలు రుసరుసలాడుకుంటూ ఉండేవారు… వాడిని వికలాంగుల కేంద్రంలో ఉంచేద్దామని పోరు పెడుతూ ఉండేవారు”….
…“ఎదో ఒక కొమ్మకు పూత పూయకపోయినా… కాయ కాయకపోయినా ఆ కొమ్మను భారమని చెట్టు అనుకోదు…తన నుండి వదల్చుకోవాలని ఏనాడు ఆ చెట్టు అనుకోదు”…కన్నతల్లి మనస్సు కూడ అంతే”…!
నన్ను వదుల్చుకుంటే వాడి బాధ తప్పుతుందని కూడ నా పిల్లలిద్దరికి చాలమంది నూరిపోస్తూండేవారు… ఆస్తిపాస్తులు తరుక్కుపోయాయి…ఇంక ముసలితల్లి కూడ ఎందుకు అనుకున్నారేమో…అందుకే నన్ను వదల్చుకున్నారు… పర్యవసానంగా ఇక్కడికి చేరుకున్నాను….
నా వికలాంగ కొడుకు పోయిన తరువాత తప్పును తెలుసుకున్నాం అంటూ నన్ను తీసుకెళ్లడానికి చిన్న కొడుకు, కోడలు వచ్చారు… బహుశ ఇంటి పనులకి…వారి చంటి పిల్లలను చూసుకోడానికి నేను పనికివస్తాను అనుకుని ఉంటారు…ఎందుకంటే ఇంకా కాస్త ఓపికతో ఉన్నాను కదా…!.. ఒంట్లో ఓపిక చచ్చిన తరువాత మరల వీధులపాలవ్వక తప్పదేమో….?.. ఈ విధంగా మనస్సుకు మలినం పట్టిన మనుషులు నా చుట్టూ ఉన్నారని బాధపడుతున్నాను…
….ఇక్కడ మన వాడ చూడండి… ఇక్కడ ప్రాంతానికి..రోడ్లకు…ఇండ్లకు మురికి పట్టిఉండొచ్చు…కాని ఇక్కడ ఉన్న మనషుల మనస్థత్వాలకు మురికి పట్టలేదు… ఇక్కడవారందరు మట్టిలోని మాణిక్యాలే…. అందరికి నేను ఇక్కడ బంధువునే… అందుకే వీరందరు నాకు నిజమైన ఆత్మబంధువులు”… అందుకే ఇక్కడ నుండి నేను వెళ్లిపోదలచుకోలేదు.. నేను కావాలి అనుకుంటే నా చిన్న కొడుకు కుటుంబం ఇక్కడకే వచ్చి చూసి పోవచ్చు …. అంతేకాని కల్మషం ఎరుగని ఈ వాడ ప్రజలను విడిచి నేను ఎక్కడకి పోలేను… అంటూ భోరున ఏడ్చేస్తోంది సీతమ్మ..
ఇంతలో అక్కడకి చేరుకున్న వాడలోని పిల్లలు “నానమ్మ మా స్కూల్ అయిపోయింది… మాతో వచ్చేయ్ నిన్ను ఇంటి వరకు తీసుకుపోతాం.”. అని వాడలోని కొందరు పిల్లలు అంటూంటే… “అదేం కాదు ఈ రోజు నువ్వు మాతోనే రావలి అవ్వ”…అంటూ ఇంకొంతమంది పిల్లలు పోటిపడ్డారు…
ఆ పిల్లల ముద్దు ముద్దు మాటలకు మురిసిపోతూ తన కంట కన్నీటిని తుడుచుకుంటూ…”పూజారి గారు నా మనవలు వచ్చేసారు… ఇంక ఇంటికి వెళ్లిపోతాను వారితో”…అంటూ అక్కడ నుండి నెమ్మదిగా కదలసాగింది సీతమ్మ…..
“మాధవడు మానవుడిలోకూడ ఉంటాడని అనేక పురాణ ఇతీహాసాలలో చెప్పబడింది……అందుకే “మానవసేవే మాధవసేవ” అని ఉంటారు పెద్దలు.. అటువంటి మాధవుడు నీలోనే ఉన్నాడమ్మ… నిజంగా నీ జన్మధన్యమైంది సీతమ్మ”… అని మనస్సులో అనుకుంటా ఆమె వైపు రెండు చేతులు జోడిస్తూ మిన్నకుండిపోయాడు పరంధామయ్య