అమృత ప్రసాదం

నిత్యజీవితంలో
పగటివేళ ఎంత ముఖ్యమో
రాత్రి వేళ కూడా అంతే ముఖ్యం…!!

నిద్ర ఎంత గొప్పదంటే
వస్తే అన్నింటినీ మరిపిస్తుంది…
రాకపోతే అన్ని జ్ఞాపకాలను
తలుచుకునేలా చేస్తోంది.

పగలంతా కష్టపడి మనిషికి
నిద్ర రూపంలో
విశ్రాంతి అందించే
శర్వారి రాత్రి….!!

తనను ఆశ్రయించే వారిని
ఒడిలో చేర్చుకొని
ప్రశాంతతను ప్రసాదించే
చల్లని తల్లి రాత్రి…!!

యవ్వనంలో ఉన్న
యువతీ యువకులకు
ఆనందానుభూతులను
పంచే విభావరి రాత్రి…!!

పండు వెన్నెలలో
చిరుగాలుల సందడిలో
నులక మంచం పై పడుకొని
జాబిలమ్మ సాక్షిగా
తాతయ్య ,అమ్మమ్మ చెప్పే
కథలు వింటూ
చిన్నపిల్లలకు‌
కమ్మటి నిద్రను ప్రసాదించే
తమస్విని రాత్రి…!

విశ్రాంతి తీసుకోవటానికి,
సుఖంగా నిద్రించి
ఆరోగ్యాన్ని రక్షించుకోవటానికి
రాత్రి వేళను ఉపయోగిస్తే
మనిషికి
సత్ఫలితాలు కలుగుతాయి..!!

చెడు పనులు చేయడానికి
రాత్రిని వాడుకుంటే
జీవితం కల్మషాల మచ్చలతో నిండిపోతుంది…!!

మధురానుభూతులకు నెలవు అనురాగాల కొలువు
రాత్రి దైవ సృష్టిలో
ఒక అమృత ప్రసాదం
అందుకే…
ప్రతి రాత్రి కావాలి శుభరాత్రి….!!

– నలిగల రాధికా రత్న

Leave a Reply