Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రం కలిసిపోయే పరిస్థితి వస్తే.. మోస్ట్ వెల్ కమ్

– బడుగు, బలహీనవర్గాలకు వెన్నుపోటే బాబు డీఎన్ఏ
– ఈ ప్రభుత్వం మనది-మాది అన్నట్టుగా జయహో బీసీ సభ
– ఆ వర్గాలే(బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు) మా వెన్నెముక
– బీసీలకు ఇంత ప్రాధాన్యత, గౌరవాన్ని ఇచ్చిన జగన్ గారి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి
– మేం చేతులు కట్టుకుంటే.. మీరు చంద్రబాబు భుజాల మీద చేతులు వేసి మాట్లాడేవాళ్ళా..?
– జయహో బీసీ మహా సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
– బీసీ మంత్రిగా నేను చేయలేనిది.. మీరు చేసినది ఏమిటో చెప్పండి
– బీసీవర్గాలను గౌరవించడం టీడీపీ బీసీ నేతలు నేర్చుకోవాలి.
– బడుగు, బలహీన వర్గాలకు పదవుల్లో 50 శాతం ఇస్తూ చారిత్రక చట్టం చేసింది జగన్ గారు కాదా..?
– భవిష్యత్తులో ఈ చట్టాన్ని ఎవరైనా మార్చగలరా..?
– విభజన చట్టం హామీల ఆమలు కోసం మేం పోరాటం చేస్తూనే ఉన్నాం
– రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

ఆ వర్గాలే(బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు) మా వెన్నెముక
జయహో బీసీ మహా సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సభకు వచ్చిన పార్టీ పెద్దల నుంచి బీసీ సోదరులందరికీ పార్టీ, ప్రభుత్వం, నా తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన గౌరవాన్ని, ప్రాధాన్యతను సభలోనూ, బయటా అందరూ కొనియాడారు. ఇది అతిశయోక్తి కాదు, వాస్తవం. 80 వేల మందికి పైగా బీసీ ప్రజా ప్రతినిధులు ఒక వేదిక మీదకు రావడం సామాన్యమైన విషయం కాదు. బీసీలు అంటే వెనకబడిన వర్గాలు కాదు… బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాస్ అని మా ముఖ్యమంత్రి మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. జగన్ తన ప్రసంగంలో కూడా బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఈ నాలుగు వర్గాలే పార్టీకి, ప్రభుత్వానికి వెన్నెముక అని పదే పదే చెప్పారు. ఇదే మా పార్టీ తాలుకా విధానం. బలహీనవర్గాలకు ఇంత గౌరవాన్ని, ప్రాధాన్యతను ఇచ్చిన ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీ వర్గాలపై ఉంది. అందుకే, బీసీ వర్గాలన్నీ ఏకమై నిన్న జయహో బీసీ అంటూ సభకు హాజరై దీవించారు.

ఈ ప్రభుత్వం మాది-మనది అన్నట్టుగా బీసీ సభ
ఈ ప్రభుత్వం మాది. ఈ ప్రభుత్వం మనది అనే రీతిగా సభ జరిగింది. 80వేల మందితో ప్రతిష్టాత్మకంగా జరిగిన సభ బీసీ వర్గాలకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఏ వర్గాలైతే గత ప్రభుత్వాల అలసత్వంతో ఇంతకాలం నిర్లక్ష్యానికి గురికాబడ్డారో, ఆ వర్గాలకు భరోసా, మనోధైర్యాన్ని ఇచ్చి చేయూత నిచ్చి వారి చేయిపట్టుకుని నడిపిస్తున్న ప్రభుత్వం ఇదే. అయితే దురదృష్టకరం ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో అది జరగలేదు. మాటలకే తప్ప చేతల్లో జరగలేదు. మా పార్టీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో ప్రతి ఒక్కరికి ఏం చేశాం. ప్రభుత్వం ఈ వర్గాల ఆర్థిక స్వావలంబనకు ఎంత ఖర్చు అయింది? వారి జీవన విధానం మెరుగుపడటానికి ఏవిధంగా దోహదం చేసిందనేది మా ముఖ్యమంత్రిగారు నిన్నటి జయహో బీసీ సభలో వివరంగా చెప్పారు. ఇవన్నీ కూడా అంకెల గారడీ కాదు, వాస్తవాలు. అందుకే అంత పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల నుంచి సభకు తరలి వచ్చారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో ఇలాంటి కార్యక్రమం జరగలేదు. ముఖ్యమంత్రిగారి ప్రసంగం విని చాలామంది ప్రభావితులు అయ్యారు. తెలుగుదేశం పార్టీతో పాటు మరో పార్టీ, అలాగే టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే మీడియా, వారి టీవీ చానల్స్ అన్నీ సభ ప్రారంభం నుంచి విమర్శలు, ఆ పార్టీ నాయకుల మాటలు వెటకారంగా ఉన్నాయి.

మీరు చంద్రబాబు భుజాల మీద చేతులు వేసి మాట్లాడేవాళ్ళా?
రాష్ట్రంలో బీసీ మంత్రులు పదిమంది ఉన్నాం. ముఖ్యమంత్రి వద్ద మాట్లాడేందుకు మాకు హక్కులు లేవని టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. మరి గతంలో వీరు మంత్రులుగా పనిచేసినప్పుడు, చంద్రబాబు నాయుడు భుజం మీద చేతులు వేసుకుని తిరిగారా? చెప్పమనండి. ముఖ్యమంత్రి దగ్గర అయినా సరే ఎవరి పరిధిలో వాళ్లు ఉంటారు. అయినా బీసీల సభపై నీచమైన మాటలు, విమర్శలు చేస్తున్నారు. ఆ మాటల ద్వారా, మీ తోటి బీసీ సోదరులను కించపరుస్తున్నట్లే కదా?. మూడున్నరేళ్లుగా మంత్రిగా పనిచేస్తున్న నేను చేయలేని పనేంటి? అదే టీడీపీలో గతంలో మంత్రులుగా పనిచేసినవారు ఏంచేశారో చెప్పమనండి. ముఖ్యమంత్రిగారి వద్ద చేతులు కట్టుకుని ఉండటమా? జేబులో చేతులు పెట్టుకుని ఉన్నారా?. లేకుంటే నిలబడి ఉండటం అనేది ఆయా సందర్భాలను బట్టి వస్తూ ఉంటాయి. చంద్రబాబు హయాంలో ఆయన రెండు భుజాల మీద బీసీ నాయకులు చేతులు వేసి మాట్లాడేవాళ్లా? బీసీ వర్గాలను వాళ్లే అగౌరవపరిస్తే ఎలా? ముందుగా టీడీపీ నాయకులు తమ వర్గాల వారిని గౌరవించుకోవడం నేర్చుకోవాలి. ఎవరి ప్రాపకం కోసమో చులకన భావంతో మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు. మీ మైండ్ సెట్ మారితే… ఆ తర్వాత రాజకీయాలు మారతాయి. రాజకీయాలు వేరు, గౌరవించుకోవడం వేరు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ వర్గాల వారికి ఏం చేశారో గర్వంగా చెప్పమనండి. దానికి ఈ మూడున్నరేళ్లలో మేమేమీ చేశామో చెబుతాం. అలా పోటీ పడి ఆ వర్గాలకు మంచి చేసే పరిస్థితి రావాలి. పనికిమాలిన మాటలు మానండి.. 50 శాతం పదవులు ఎందుకు ఇవ్వలేదని బాబును అడగండి
పనికిమాలిన మాటలు మాట్లాడటం సరికాదు. ఎన్నికలకు ముందు అన్ని బీసీ సంఘాల పెద్దలు వైఎస్ జగన్ గారిని కలిసి 139 కులాలుగా ఉన్నవాటిలో పదివేల జనాభా కన్నా ఎక్కువ ఉన్న కులాలు తమకు కార్పొరేషన్ ఉండాలని కోరుకున్నారు. కార్పొరేషన్ ద్వారా తమ వర్గానికి గుర్తింపు వస్తుందని ఆశించడంతోనే, ముఖ్యమంత్రిగారు ఆయా కులాలకు కార్పొరేషన్ లు ఏర్పాటు చేశారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ 50శాతం రిజర్వేషన్ లు అమలు చేస్తానని జగన్ గారు మాటిచ్చారు. దాన్ని నెరవేర్చారు. మరి ఇన్నేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు.?.

ఇదే విషయాన్ని చంద్రబాబును మీరెందుకు అడగలేకపోయారు?. బలహీనవర్గాలకు చెందినవారు మార్కెట్ యార్డు చైర్మన్ అయ్యాడంటే వారికి ఎంత గౌరవం. దాన్ని మా జగన్ గారు చేసి చూపించారు. మా ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు పదవుల్లో 50శాతం అవకాశం కల్పించాలనేది చారిత్రక నిర్ణయం. ఇంతవరకూ అలాంటిది జరగలేదు. భవిష్యత్ లోనూ 50శాతాన్ని తగ్గించే ధైర్యం ఏ నాయకుడు అయినా చేయగలడా. రాబోయే వందేళ్లలోనూ ఎవరైనా చేయగలరా అనేది చెప్పాలి. బలహీన వర్గాల అభ్యున్నతికి రాబోయే రోజుల్లో కూడా ముట్టుకోవడానికి వీల్లేనట్లుగా ముఖ్యమంత్రిగారు కాంక్రీట్ వేసినట్లుగా చేశారు. ఈ విషయాన్ని మేము గర్వంగా చెబుతున్నాం. మరి అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎందుకు చేయలేకపోయింది. రాబోయే రోజుల్లో ట్రస్ట్ బోర్డు చైర్మన్ల, సభ్యుల సంఖ్యను తగ్గించగలరా? స్టేట్ కార్పొరేషన్లను 50శాతం కంటే తగ్గించగలరా? బీసీ మంత్రులు డమ్మీలు అయితే… మీరేమైనా డబ్బాలా?కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా కులాలకు ఓ గుర్తింపు వచ్చింది. దాంతోపాటు సమాజంలో ఆ కులాల అభ్యున్నతికి పనికి వచ్చే కార్యక్రమాలు చేపట్టాం. 80శాతం మంది మేయర్లు వచ్చారంటే గొప్ప కాదా?. ఆ కుర్చీ అలంకారమా?. గతంలో టీడీపీ ఎందుకు చేయలేకపోయిందో ముందు సమాధానం చెప్పాలి.

బీసీల గురించి మాట్లాడే అర్హత మాకే ఉంది
వైయస్సార్ సీపీకి బీసీల గురించి మాట్లాడే అర్హతే లేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ రాష్ట్రంలో బీసీల గురించి మాట్లాడే హక్కు మాకు లేకుంటే మరి ఎవరికి ఉంది?. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిగారి హయాం నుంచి నేటి జగన్ పరిపాలనలో కూడా బీసీలు తలెత్తుకుని తిరిగేలా చేస్తున్నాం. తండ్రి కంటే రెండడుగులు ముందుకు వేస్తానని చెప్పిన ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు దాన్ని కార్యచరణలో చూపించారు. ఇది వాస్తవం కాదా? ఇస్త్రీ పెట్టె, మోకు ఇవ్వడం ద్వారా బీసీలు జీవితాంతం అదే వృత్తిలో కొనసాగాలన్నదే మీ అభిమతమా? . వాళ్లలో ఉన్న ప్రతిభను బయటకు తీసి, వారి పిల్లలు ఉన్నతవిద్యను అభ్యసించాలి. సమాజంలో వారు కూడా రాజ్యాంగ పదవులు అనుభవించే అవకాశం కల్పించాలి. ఇదే జగన్ గారి విధానం. టీడీపీ ఇంకా బూర్జువా వ్యవస్థలోనే ఆలోచిస్తోంది. ఆ పార్టీ ఆలోచనా విధానంలో మార్పు రావడం లేదు. బీసీలంతా గర్జన సభకు వచ్చి హర్షం వ్యక్తం చేస్తుంటే.. దాన్ని తట్టుకోలేక మీ మీడియా చానల్స్ లో ఇష్టారాజ్యంగా చూపిస్తారా? అందుకే ఆ చానల్స్ ను చూస్తుంటే జాలేస్తోంది. వాస్తవాలను విస్మరించి అవాస్తవాలను ప్రచారం చేస్తే చివరకు వాళ్లే కాలగర్భంలో కలిసిపోతారు. వాస్తవాలు ప్రసారం చేస్తే సమస్యలేదు. కానీ వాస్తవాలను వక్రీకరిస్తే ఎలా?. గతంలో ఓ బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా చేయాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది.

తోకలు కత్తిరిస్తానన్న బాబు మాటలు మర్చిపోగలమా?
ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా అన్న చంద్రబాబు మాటలను మర్చిపోగలమా?. దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం ఇవ్వాలి. బీసీలు తమ బాధలు, ఆవేదనను చెప్పుకోడానికి వస్తే వారి తోకలు కత్తిరిస్తామని అన్న మాటలు ప్రజానీకం మరిచిపోతుందనుకున్నారా? . అదే మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలు కూడా సమాజంలో తలెత్తుకుని సగౌరవంగా తిరిగేలా చేసింది. దానితో పాటు ప్రభుత్వ పథకాలు వారికి అందుతున్నాయి. రాష్ట్రంలోని బలహీనవర్గాల అవసరాలను గుర్తెరిగి, వారిని దృష్టిలో పెట్టుకునే నవరత్నాలు పథకాలను రూపొందించారు. దానిద్వారా బీసీల జీవన ప్రమాణాల్లో మార్పు వస్తుందనే ఈ పథకాలు అమలు చేశారు. కూలివాడు పిల్లలు కూలోళ్లుగానే మిగిలిపోవాలో, రిక్షా తొక్కుకునే వ్యక్తి వారసులు అలాగే ఉండాలనుకునే మనస్తత్వం మాకు లేదు. డీబీటీ ద్వారా బీసీలకు 86వేల కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా?. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ. 1.6 లక్షల కోట్లు ఇచ్చింది నిజం కాదా?. ఇవన్నీ వాస్తవం కాదని నిరూపించగలరా?. 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అంతమందికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో చెప్పగలరా? రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలు దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నాయి. వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వారి అభివృద్ధి కోసమే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. గతంలో అయిదేళ్లు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇవన్నీ చేయలేకపోయింది. పేదవాడికి ఇల్లు ఇద్దామనే ఆలోచన ఎందుకు రాలేదు?. చంద్రబాబుకు మనసు లేదు కాబట్టే ఇవేమీ ఆలోచన చేయలేకపోయాడు.

గతంలో నువ్వేమీ చేశావో, ఇప్పుడు మేమేమీ చేస్తున్నామో బేరిజు వేసుకుని చంద్రబాబు సిగ్గుపడాలి. లేకుంటే నీ దగ్గర కొత్త ఆలోచన ఉంటే మాతో పంచుకో. అంతేకానీ చౌకబారు మాటలు మాట్లాడటం సరికాదు. టీడీపీలోని బీసీ నాయకుల విమర్శలు చాలా తప్పు. మీ సోదరుల్ని మీరే కించపరుచుకున్నట్లు అవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు చంద్రబాబు నాయుడు ఏమైనా ఉద్దరిస్తే కదా… బీసీల పట్ల మీ పార్టీకి, మీ నాయకుడికి అంకితభావం అనేదే లేదు. బీసీలను టీడీపీ ఎప్పుడూ ఓటు బ్యాంక్ గానే చూసింది. మా పార్టీకి మాత్రం బీసీలే వెన్నెముక. వారు మా ఓటు బ్యాంక్ కాదు. మా పార్టీ విధానం ఇది. రాబోయే రోజుల్లో బీసీలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లి… ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిగారిని కాపాడుకునే బాధ్యత బలహీనవర్గాలుగా మాపైన ఉంది. దుష్ట శక్తులు, దుర్మార్గులు తయారై చేసే కుట్ర రాజకీయాల వల్ల బలహీన వర్గాలు నష్టపోయే పరిస్థితి ఉంది. మంచి పని చేసినవారిని పదికాలాల పాటు చల్లగా ఉండాలని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. అదే నిన్న బీసీ సభకు హాజరైన బీసీ సోదరులంతా నిరూపించారు. మనసున్న ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీలను జగన్ మోహన్ రెడ్డి నెరవేరుస్తారు.

రాష్ట్రం కలిసిపోయే పరిస్థితి వస్తే.. మోస్ట్ వెల్ కమ్
మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. రెండు రాష్ట్రాలు కలిసే ప్రతిపాదన వస్తే మోస్ట్ వెల్ కమ్.. తప్పేం ఉంది? రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలనే మేం కోరుకుంటాం.. విభజన చట్టం ప్రకారం, హక్కుల సాధన కోసం మేం పోరాటం చేస్తూనే ఉంటాం.చంద్రబాబు డీఎన్ఏ ఏమిటో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు.ఆయన డీఎన్ఏ బడుగు, బలహీన వర్గాలను వెన్నుపోటు పొడవటమే.అమరావతిలో ఏం జరిగిందో చూశాం కదా.. చంద్రబాబు దోపిడీ వల్ల భూములు కోల్పోయింది, నష్టపోయింది ఆ వర్గాలే కదా.

LEAVE A RESPONSE