Suryaa.co.in

Andhra Pradesh

కులాలను విభజించి రాజకీయ చలి మంటలు కాచుకోవాలనుకుంటున్న వ్యక్తి జగన్

-కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన మహానుభావుడు పూలే
హవ్వ… పూలే తో పోలికనా?
-బీసీలకు అధిక ప్రాధాన్యత నిచ్చిన పార్టీ టిడిపి
-విజయసాయిరెడ్డి ట్వీట్ల భాష ను మాత్రమే ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లా
-నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణంరాజు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభినవ పూలే అని తమ పార్టీ నాయకులు కొందరు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు విమర్శించారు. పూలేతో, జగన్మోహన్ రెడ్డికి పోలికనా అంటూ విస్మయం వ్యక్తం చేశారు. కుల వ్యవస్థ నిర్మూలన కోసం కృషి చేసిన మహానుభావుడు పూలే అయితే, కులాలను విభజించి రాజకీయాలు చేయాలనుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు . కలిసిపోయిన కులాలను కూడా విడగొట్టి ఆ మంటలు చలికాచుకోవాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని అభినవ పూలే అని పేర్కొనడం సిగ్గుచేటన్నారు.

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…తన వెనుక నలుగురు ఉన్నారని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం నిజమేనని తెలిపారు . జగన్ వెనుక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డిలు మాత్రమే ఉన్నారన్నారు. దానికి జగన్ వక్ర భాష్యం చెబుతూ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు తన వెనుక ఉన్నారని భ్రమిస్తున్నారన్నారు. ఆయా వర్గాల ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేకపోయినా, ఎంతో చేసినట్లుగా అబద్దాలను చెబుతున్నారని మండిపడ్డారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ దమన నీతి వల్ల రాష్ట్రంలో ఏ ఒక్క సర్పంచ్ కూడా సంతోషంగా లేరని రఘురామకృష్ణం రాజు తెలిపారు. వాలంటీర్ వ్యవస్థతోనెగ్గుకు రావచ్చుననే ఉద్దేశంతో పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు . జనాభాలో 52 శాతం బీసీలు ఉన్నప్పుడు, పంచాయతీ నుంచి మొదలుకుంటే పార్లమెంట్ వరకు ఎన్నికవుతారన్నారు. దానికి తానేదో చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి భావించడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీలకు రాజకీయంగా అధిక ప్రాధాన్యతను ఇచ్చింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీరామారావు అయితే, వారి రాజకీయ ఉన్నతికి కృషి చేసింది చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు.

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వంటి వారికి రాజకీయ జన్మనిచ్చింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్ గా చంద్రబాబు నాయుడు బీసీలకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయ తలుపులు తెరిచే అవకాశం యాదవులకు కల్పించామని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తిరుమలలో ఆ సాంప్రదాయం మొదటి నుంచి కొనసాగుతూ వస్తుందని పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్ గా యాదవ సామాజిక వర్గానికి చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ కు చంద్రబాబు నాయుడు అవకాశం కల్పిస్తే, మనం చేసిందేమిటని ప్రశ్నించారు.

పిన్ని భర్త అయిన సుబ్బారెడ్డికి జగన్ అవకాశం కల్పించారంటూ ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా టీటీడీ చైర్మన్ పదవి తన సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించారని గుర్తు చేశారు. తిరుపతిలో 13 ఉన్నత పదవులు ఉంటే, వాటిలో 12 ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారికే దక్కాయన్నారు. ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవి, కూడా చైర్మన్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి కట్టబెట్టారన్నారు. బీసీలకు ఏమి చేయకపోయినా, చేసినట్లుగా నిర్భయంగా మాట్లాడడగలిగిన జగన్మోహన్ రెడ్డి గొప్ప వ్యక్తి అంటూ రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు.

బీసీలు సభను కూడా నిర్వహించుకోలేరా?
బీసీలు సభలను కూడా సొంతంగా నిర్వహించుకోలేరా?, బీసీ సభ ఏర్పాట్లను కూడా మన పాలెగాల్లే చేయాలా?, బీసీలు సభ ఏర్పాట్లు కూడా చేసుకోలేరా?, మనము చేసుకోనివ్వలేదా?? అంటూ రఘురామకృష్ణం రాజు శరపరంపర ప్రశ్నస్త్రాలను సంధించారు. విజయవాడలో జరిగిన జయహో బీసీ సభలో ఉన్నత రాజకీయ విలువలు కలిగిన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. విజయసాయి ముందు నడిస్తే, ఆయన వెనుక బీసీ మంత్రులు నడవడం… అన్నీ తానే అన్నట్లు విజయ సాయి వ్యవహరించడం చూస్తే, అది బీసీల సభ అన్నట్లుగా లేదన్నారు. బీసీ సభ సందర్భంగా ఆర్టీసీ బస్సులను ఆకస్మికంగా రద్దు చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఇక సభకు హాజరైన ప్రజలకు మధ్యాహ్నం తర్వాత కానీ భోజనాలు వడ్డించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వారు తీవ్ర ఆకలితో నకనకలాడారన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు మీకు మాదిరిగా ఉదయం 10:30 కు టిఫిన్ చేసి, మధ్యాహ్నం భోజనం చేయరని గుర్తు చేశారు. ఉదయం 10, 11 గంటలకే వారు భోజనం చేస్తారని తెలుసుకోవాలని సూచించారు. అదేవిధంగా వారికి భోజన ఏర్పాట్లు చేయాలన్నారు.

మీ పాలనలో ఏ వర్గానికి మంచి జరిగింది?
జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ వర్గానికి మంచి జరిగిందని రఘురామకృష్ణంరాజు నిలదీశారు. తన పాలనలో జరిగిన మంచిని వివరించాలని ఆయన పిలుపునివ్వడం హాస్యాస్పదంగా అనిపించిందన్నారు. చెత్త పన్ను వేయడం వల్ల ప్రజలకు మంచి జరిగిందా?, క్వార్టర్ మందు బాటిల్ ధర పెంచడం వల్ల మందుబాబులకు మంచి జరిగిందా??, ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నావని వారు ఆనందంగా ఉన్నారా?, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఏమైనా మేలు జరిగిందా??, అంటూ ప్రశ్నించారు. అన్ని వర్గాల వారికి పెన్షన్ ఇచ్చినట్లుగానే, జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు పెన్షన్ ఇచ్చి వారికి అదనంగా ఏదో మేలు చేసినట్లు చెప్పుకోవడం ఒక్క జగన్మోహన్ రెడ్డి కే సాధ్యమన్నారు. ఏమి చేయకుండానే, అన్నీ చేసినట్లుగా అబద్ధాల రాజకీయాలకు ఇక కాలం చెల్లిందన్నారు. ప్రజలను మభ్యపెట్టి , ఇతరులను తిట్టిపోసి నెగ్గాలనుకుంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. హింసే మార్గంగా ఎంచుకుంటే భూమా రాంగ్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బీసీలకు సేవ చేయడం అవసరమని, సిన్సియర్ గా చేయాలని సూచించారు. అలాగే బీసీ నేతలకు మంచి పదవులు ఇవ్వాలన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో బీసీ నేతలను ఎంతలా ప్రోత్సహించారో ఒక్కసారి తెలుసుకోవాలన్నారు. ఒకరిద్దరూ తను వందిమాగాదులకు మంత్రి పదవులు ఇచ్చి తనకు తానే జగన్మోహన్ రెడ్డి బీసీ జనోద్ధారకుడిగా భావిస్తుండడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు. నిన్న కర్నూలు గర్జన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, నేడు బీసీ బహిరంగ సభ పేలవంగా ముగిసిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం విజయ సాయి
ఢిల్లీ మద్యం కుంభకోణం సూత్రధారి తమ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి అని రఘురామకృష్ణం రాజు తెలిపారు . ఆంధ్ర మద్యం కుంభకోణంలో విజయసాయి పాత్రధారి అయి ఉండవచ్చునని పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోగా విజయసాయిరెడ్డి విచారణకు హాజరుకావాలని నోటీసులు అందే అవకాశాలు ఉన్నాయన్నారు. రాజ్యసభ ప్యానల్ చైర్మన్ల, లేదంటే వైస్ చైర్మన్ల జాబితాలో తొలు త విజయసాయిరెడ్డి పేరు ఉన్న మాట నిజమేనన్నారు. కానీ రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెల్లడించిన జాబితాలో ఆయన పేరు లేకపోవడం ఒక విధంగా తనకైతే ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. రాజ్యసభ చైర్మన్ స్థానం గౌరవం తగ్గకుండా తగిన చర్యలు తీసుకోవాలని మాత్రమే తాను ఉపరాష్ట్రపతిని కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కోరడం జరిగిందని తెలిపారు. విజయసాయిరెడ్డి చేస్తున్న ట్వీట్ల భాష ను మాత్రమే ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లాలని, అంతేకానీ తాను ఆయన పై ఫిర్యాదు చేయలేదన్నారు. మద్యం కుంభకోణంలో పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయిన విజయసాయిరెడ్డి, తన మొబైల్ ఫోను ను పోగొట్టుకోవాల్సి వచ్చిందన్నారు.

సిబిఐ వారు విచారణ కోసం పిలిస్తే, టైం అడిగినట్లు తెలిసిందని తనకున్న సమాచారం అన్నారు. మద్యం కుంభకోణం లో కింగ్ పిన్ గా ఉన్న విజయసాయి రెడ్డి విచారణకు హాజరు కాక తప్పదన్నారు. నా మీద నోరు పారేసుకోవడమే కాదు, ఎవరిని ఎలా హింసించాలని A1, A2 లు నిత్యం మంతనాలు జరుపుతుంటారన్నారు. ఇతరులకున్న పదవులను పీకి శునకానందం పొందే విజయ సాయి రెడ్డికి , తనకున్న పది పదవుల్లో ఒక్క పదవి పోతే వచ్చే నష్టమేమీ లేదన్నారు. తానేమి ఆయన పదవులు పోవాలని కోరుకోవడం లేదని, తన విధానాలను మార్చుకోకపోతే ఇంకొన్ని పదవులు కూడా చేజారి పోవచ్చునని హెచ్చరించారు. పదవులు పోవాలని కాదని, ప్రవృత్తి మారాలని తాను కోరుకుంటున్నాట్లు చెప్పారు. విజయసాయిరెడ్డి ఉపయోగిస్తున్న భాష ను యావత్ సమాజం అసహ్యించుకుంటుందని తెలిపారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు లాంటి వ్యక్తిని ఏకవచనంతో సంబోధించడం దారుణం అని మండిపడ్డారు . ఏనాడైనా రామోజీరావు, ఇతరులను ఏకవచనంతో సంబోధించారా? అంటూ ప్రశ్నించారు. విజయసాయి పదవి పోయినందుకు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

LEAVE A RESPONSE