– ఏపిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్ర రాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగాన్ని మాండూస్ తుఫాన్ కోలుకోలేని దెబ్బతీసిందని ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. చేతికి వచ్చిన పంట ఇలా నీటిపాలు అవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారని ఆయన అన్నారు. వరి, పత్తి, మిర్చి తదితర పంటలకు అపార నష్టం వాటిల్లిందని వెల్లుబుచ్చారు. సోమవారం ఉదయం క్రిష్ణా జిల్లాలోని మొవ్వ, కూచిపూడి గ్రామాలలోని పొలాలను సందర్శించిన గిడుగు అక్కడి రైతుల ఆవేదన చూసి చలించిపోయారు.
ఆరుగాలం కష్టించి పనిచేసే రైతన్నలు, పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ఇలా జరగడంతో వారి బాధ వర్ణనాతీతమన్నారు. ఈ కృష్ణ జిల్లా మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వున్న అనేక జిల్లాలలో మండోస్ తుఫాన్ రైతుల వెన్ను విరిచిందని, రేపల్లె, బాపట్ల వ్యవసాయ సబ్ డివిషన్ల పరిధిలో వర్షాలకు ముందు ఆరబెట్టిన 30 వేల ఎకరాలకుపైగా వరికంకులు నీట మునిగాయని, మాగాణి భూముల్లో కోసిన వరి ఓదెలు నీటిపై తేలియాడుతున్నాయని అన్నారు. మరో 40 వేల ఎకరాల్లో వరి పైరు గాలులకు ఒరిగిపోయిందని, ఇవి గాక మినుము, పొగాకు, బొబ్బర్లు పంటలకు, అలాగే అరటి, ఉల్లి, టమాటో పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. వర్షాలకు వందలాది కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారన్నారు.
మండోస్ తుఫాన్ దెబ్బకు నష్టపోయిన జిల్లాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి బాధితులకు తగు నష్టపరిహారాన్ని అందజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గిడుగు డిమాండ్ చేశారు.