• నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు – నమ్మినప్రజలకు జగన్ రెడ్డి మిగిల్చాడు కన్నీళ్లు. జగనన్న ఊళ్లు ఎప్పుడు కడతావు జగన్ రెడ్డి?
• మూడున్నరేళ్లలో వైసీపీప్రభుత్వం ముక్కి, మూలిగి 5ఇళ్లు మాత్రమేకట్టిందని కేంద్రప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా తేల్చేసింది.
• ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేదలకు 25లక్షల ఇళ్లు నిర్మిస్తానని జగన్ రెడ్డి ఊరువాడా ఊదరగొట్టాడు.
• ముఖ్యమంత్రి అయ్యాక వాలంటీర్లు సర్వేచేసి 30లక్షల ఇళ్లు కావాలని చెప్పారని, 2023 నాటికి ఇళ్లన్నీ కట్టేస్తానని చెప్పి, నమ్మినవారి నోట్లో మట్టికొట్టాడు
• ఇళ్లస్థలాల సేకరణ, భూములచదును పేరుతో వైసీపీనేతలు వందలకోట్లు మింగేస్తుంటే, నోరెళ్లబెట్టి చూసిన ముఖ్యమంత్రి, పేదలకు ఇళ్లునిర్మిస్తాడా?
-మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు కాలవ శ్రీనివాసులు
పైసాభారం పడకుండా రాష్ట్రంలో ఇళ్లులేని పేదలందరికీ తనప్రభుత్వమే 2023నాటికి 30లక్షలఇళ్లు నిర్మిస్తుందని, డబ్బాలుకొట్టిన జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం మూడున్నరేళ్లలో ముక్కి,మూలిగి కేవలం 5ఇళ్లుమాత్రమే నిర్మించిందని, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు, జగనన్న ఊళ్లు నిర్మిస్తాం అని చెప్పిన జగన్ రెడ్డి, చివరకు వారికి కన్నీళ్లే మిగిల్చాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ఎద్దేవాచేశారు. జూమ్ ద్వారా బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆయన, ఇళ్లనిర్మాణంలో జగన్ రెడ్డి అసమర్థతను, ఆయనప్రభుత్వ చేతగానితనాన్ని కేంద్రప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన సమాచారంతో ఎండగట్టారు. మాజీ మంత్రి విలేకరులతో మాట్లాడిన వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం…!
“వైసీపీ మేనిఫెస్టోలో పెట్టడమేగాక, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు అని ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఊదరగొట్టాడు. అధికారంలోకి వచ్చాక అక్కాచెల్లె మ్మల పేరుతో పక్కాఇళ్లు తానే నిర్మించి ఇస్తానని, స్థలం లేనివారికి ఉచితంగా ఇంటి స్థలమిస్తానని ప్రజల్ని నమ్మించాడు. రూ.2.50లక్షల నుంచి రూ.5లక్షలవిలువ చేసే సొంత ఇళ్లను రాష్ట్రంలోని పేదలకు కానుకగా ఇస్తానని, ముఖ్యమంత్రి అయ్యాక 5ఏళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 25లక్షల ఇళ్లు నిర్మిస్తానని నమ్మబలికాడు.
మూడున్నరేళ్లలో 18లక్షలఇళ్లు కట్టాల్సిన ముఖ్యమంత్రి, 5 ఇళ్లు నిర్మిస్తే, జగనన్న ఊళ్లు ఎప్పుడు కడతాడు?
ఇళ్లపేరుతో జగన్ రెడ్డి పేదలకు చేసిన వంచన, ద్రోహం మాటల్లో చెప్పలేనిది… జగన్ రెడ్డి సీఎం అయి మూడున్నరేళ్లయినా లక్షఇళ్లుకూడా నిర్మించలేదు. జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీప్రకారం మూడున్నరేళ్లలో దాదాపు 18లక్షల ఇళ్లు నిర్మించాలి. కేంద్రప్రభుత్వం నిన్న పార్లమెంట్ సాక్షిగా ఇళ్లనిర్మాణంలో జగన్ రెడ్డి వైఫల్యాన్ని ఎత్తిచూపింది. జగన్ రెడ్డి హయాంలో మూడున్నరేళ్లలో రాష్ట్రంలో కేవలం 5ఇళ్లుమాత్రమే కట్టారని కేంద్రమంత్రి పార్లమెంట్ లో చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణపథకం కింద 2019-20, 2020-21, 2021-22 సంవత్సరాల్లో ఏపీ ప్రభుత్వం కేవలం 5 ఇళ్లు మాత్రమే నిర్మించింది. ఇళ్లనిర్మాణంలో భాగంగా తొలిదశకింద తమప్రభుత్వం 15లక్షల ఇళ్లునిర్మిస్తుందని, దానికోసం రూ.28,084 కోట్లు ఖర్చుపెడుతోందని జగన్ రెడ్డి చెప్పాడు. కానీ మూడేళ్లలో ఇళ్లనిర్మాణానికి ఈ ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం రూ.3,927కోట్లు మాత్రమే. ఆ సొమ్ము కూడా ఇళ్లనిర్మాణం మొదలుపెట్టిన పేదలకు దక్కలేదు. మధ్యలో తనపార్టీవారి జేబుల్లోకే వెళ్లింది. ఇళ్లనిర్మాణంపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి, క్షేత్రస్థాయిలో చేసిన ఖర్చుకి ఎక్కడా పొంతనలేదు. జగన్మోహన్ రెడ్డి 100ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాకూడా, తాను చెప్పిన విధంగా పేదలకోసం 25లక్షల ఇళ్లు నిర్మించలేడు. జగనన్నఊళ్లు నిర్మిస్తానంటూ మీడియాలో, ప్రజల్లో ఊదరగొడుతున్న ముఖ్యమంత్రి, ఎప్పటికి నిర్మిస్తాడో చెప్పాలి? పేదల సొంతింటి కలను నిజం చేయాలన్న ఆలోచనగానీ, తాపత్రయం గానీ జగన్ రెడ్డికి లేవు.
పేదలు సొంతిళ్లలో సంతోషంగా ఉంటే, వారిని చూసి ఓర్చుకోలేని తత్వం జగన్ రెడ్డిది. బీహార్ వంటి వెనుకబడిన రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మూడేళ్లలో 16 నుంచి 17లక్షల ఇళ్లు నిర్మించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కేవలం 5 ఇళ్లుమాత్రమే కట్టిందంటే గృహనిర్మాణం ఎంతటి దయనీయస్థితిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. తాను 25 లక్షల ఇళ్లు నిర్మించిఇస్తానని వాగ్ధానంచేస్తే, తనప్రభుత్వంలోని వాలంటీర్లు సర్వేలుచేసి, 30లక్షలవరకు ఇళ్లు నిర్మించాలని నివేదికలు ఇచ్చారని కూడా గతంలో ముఖ్యమంత్రి చెప్పాడు. 2023 నాటికి రాష్ట్రంలో ఇల్లులేని పేదకుటుంబమే ఉండదని మీడియాముందు, సమీక్షల్లో ఊదరగొట్టాడు. తీరా కేంద్రప్రభుత్వ సమాచారం చూస్తే, జగన్ రెడ్డి వాగ్ధానాలన్నీ నీటిమూటలేనని తేలిపోయింది.
ఇళ్లనిర్మాణానికి మూడువిధానాలనిచెప్పి, ప్రజల్ని ముంచేశాడు…
ఇళ్లనిర్మాణంలో వైసీపీప్రభుత్వం మూడు విధానాలు ప్రజలముందు ఉంచింది. ప్రభుత్వం ఇంటినిర్మాణానికి అవసరమైన మెటీరియల్ అందిస్తే, లబ్ధిదారులు కూలీలను పెట్టుకొని ఇళ్లునిర్మించుకోవాలనే విధానం ఒకటైతే, లబ్ధిదారులే సొంతఖర్చుతో ఇళ్లు నిర్మించుకుంటే, ప్రభుత్వం డబ్బుచెల్లిస్తుందన్న నిబంధన మరోటి, ప్రభుత్వమే సొంతంగా ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు ఇస్తుందన్నది మూడోవిధానం. ఈ మూడు విధానాలు ప్రజలముందు ఉంచిన జగన్ రెడ్డి ప్రభుత్వం, అంతిమంగా ఇళ్లకోసం ఎదురుచూసిన ప్రజల్ని ముంచేసిందనే చెప్పాలి.
చంద్రబాబుప్రభుత్వం రూ.1.50లక్షలిస్తే, జగన్ రెడ్డి దాన్ని రూ.30వేలకే పరిమితంచేశాడు…
ఇంటినిర్మాణానికి ఇచ్చే ఆర్థికసాయాన్ని కూడా గతప్రభుత్వంలో ఇచ్చినదానికంటే జగన్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా తగ్గించింది. చంద్రబాబుగారి హాయాంలో పట్టణప్రాంతాల్లో సొంతస్థలాలున్న పేదలకు ఇంటినిర్మాణానికి రూ.2.50లక్షలు ఇచ్చారు. రాష్ట్రప్రభుత్వ వాటా రూ.1.50లక్షలు అయితే, కేంద్రప్రభుత్వ వాటా లక్షరూపాయలు. నేడు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న గృహనిర్మాణపథకంలో ప్రభుత్వవాటా సున్నా అనే చెప్పాలి. ఇంటి నిర్మాణానికి రూ.లక్షా80వేలు ఇస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం, దానిలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.1.50లక్షలు కూడా కలిపేసింది. ఆ లెక్కన జగన్ ప్రభుత్వం అంతి మంగా ఇళ్లనిర్మాణానికి పేదలకు ఇచ్చేది కేవలం రూ.30వేలు మాత్రమే.
ఇళ్లనిర్మాణం పేరుతో వైసీపీనేతలుచేసిన వందలకోట్ల అవినీతిని నిరూపించడానికి తాము సిద్ధం…
ఇళ్లనిర్మాణం పేరుతో పేదల ఆశలను అడియాశలను చేసిన జగన్మోహన్ రెడ్డి, నిర్మాణం ముసుగులో వందలకోట్ల కుంభకోణానికి తెరలేపాడు. ఇళ్ల నిర్మాణంకోసమని చెప్పి, కారు చౌకగా రైతులనుంచి భూములుకొన్న వైసీపీనేతలు, లే అవుట్ల అభివృద్ధిపేరుతో వందల కోట్లు తినేశారు. నివాసానికి పనికిరాని స్థలాలను ఇళ్లనిర్మాణానికి ఎంపికచేసి, తమజేబులు నింపుకున్నారు. రాష్ట్రంలో ఇళ్లనిర్మాణం ముసుగులో వైసీపీనేతలు చేసిన అవినీతిని నిరూపించడానికి తాము సిద్ధంగాఉన్నాం. 98శాతం హామీలు నెరవేర్చామని గొప్పలు చెబుతున్న వైసీపీనేతలు, 25లక్షల ఇళ్ల నిర్మాణంలో ఎన్ని లక్షలఇళ్లు నిర్మించారో చెప్పాలి. ఇళ్లనిర్మాణానికి సంబంధించి ఇచ్చిన హామీలో 10శాతం హామీని కూడా నెరవేర్చని వారు సిగ్గులేకుండా 98శాతం హామీలు నెరవేర్చామని ఎలా చెప్పుకుంటారు. గృహనిర్మాణశాఖ మంత్రికి తనశాఖ గురించి తెలియదు. చంద్రబాబుపై అవాకులుచవాకులు పేలమంటే మాత్రం ఆయన ఎగేసుకొని ముందుకొస్తాడు. జోగి రమేశ్ లాంటి వారు మంత్రులుగా ఉండబట్టే, ప్రజల్ని అడుగడుగునా మోసగిస్తూ, అబద్ధాలు వల్లెవేస్తూ, తమఖజానా నింపుకుంటున్నా రు.
టీడీపీ ప్రభుత్వం ఇళ్లనిర్మాణానికి రూ.11,414కోట్లు ఖర్చుపెడితే, మూడున్నరేళ్లలో జగన్ రెడ్డి రూ.3,960కోట్లు వెచ్చించాడు. ఆ సొమ్ముకూడా వైసీపీ నేతల జేబుల్లోకే వెళ్లింది..
టీడీపీప్రభుత్వం ఉన్నప్పుడు ఇళ్లనిర్మాణం కోసం ఐదేళ్లలో తాముచేసిన ఖర్చు రూ. 11,414కోట్లు. ఇది తాముచెప్పడం కాదు, అధికారిక సమాచారమే. రూ.11,414కోట్లతో నిర్మించిన ఇళ్లే కాకుండా, టిడ్కోద్వారా దాదాపు రాష్ట్రవ్యాప్తంగా బహుళఅంతస్థుల సముదాయాలుగా 2.50లక్షల ఇళ్లను నిర్మించాము. తాము నిర్మించిన ఇళ్లను పేదలకు ఇస్తే, వారు ఎక్కడ చంద్రబాబుగారిని అభిమానిస్తారోనన్న దుగ్ధతో, జగన్ రెడ్డి వాటిని పాడుపెట్టాడు. పేదల సొంతింటికలను ఛిద్రంచేసిన జగన్ రెడ్డి, నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నాడు. జగన్ రెడ్డి, వైసీపీనేతలను ఏమని పిలవాలి? నయవంచకుల పాలనలో పేదలు అడుగడుగునా వంచనకు గురవుతున్నారు. ప్రభుత్వం చెప్పిందని రాష్ట్రంలో చాలాచోట్ల సొంతఖర్చుతో ఇంటినిర్మాణం మొదలుపెట్టిన పేదలకు పాలకులనుంచి అందాల్సిన డబ్బు అందలేదు. ఇళ్లన్నీ పునాదులుదశలోనే ఆగిపోయాయి. ఇళ్లనిర్మాణానికి సంబంధించి, పేదలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలే రూ.800కోట్లవరకు ఉన్నాయని వైసీపీసర్కార్ లోని అధికారులే చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక తొలి సంవత్సరం రూ.964కోట్లు, రెండోసంవత్సరం రూ.1141కోట్లు కలిపి, ఇప్పటికీ రూ.3,960కోట్లు మాత్రమే ఇళ్లనిర్మాణానికి ఖర్చుచేసింది. పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి రూ.56వేలకోట్లు ఖర్చుపెడతామని చెప్పిన జగన్ రెడ్డి, మూడున్నరేళ్లలో రూ.3,960కోట్లు మాత్రమే ఖర్చుపెడితే, మిగిలిన కాలంలో తానుచెప్పిన లక్ష్యాన్ని ఎలా చేరుకుంటాడని ప్రశ్నిస్తున్నాం. చెప్పిదానికిచేస్తున్నదానికి, వాస్తవంలో జరిగిన దానికి ఎక్కడైనా పొంతన ఉందా? ఏడాదికి 20వేలు, 30వేల ఇళ్లు నిర్మిస్తే, 25లక్షల ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారు? జగనన్న కాలనీలు ఊళ్లుగా ఎప్పుడు మారతాయని ప్రశ్నిస్తున్నాం?
ఇచ్చిన హామీని నెరవేర్చనందుకు జగన్ రెడ్డి చెంపలేసుకొని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
ముఖ్యమంత్రి అసమర్థత, చేతగానితనం, నిర్లక్ష్యం కలిసి పేదలకుశాపంగా మారాయి. జగన్ రెడ్డి ఇప్పటికైనా తనతప్పు ఒప్పుకొని, పేదలకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని చెంప లేసుకొని వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఇళ్లనిర్మాణంపై ఆశలు పెట్టుకొని జగన్ రెడ్డి వంచనకు గురైన పేదలు ఆయనపై తిరగుబాటుచేసేరోజు దగ్గర్లోనే ఉంది. టీడీపీప్రభుత్వంలో ఇళ్లునిర్మించుకుంటే, దానికి సంబంధించిన బిల్లులు కూడా ఆపేసిన జగన్ రెడ్డి, పేదలపై కక్షసాధిస్తున్నాడు. త్వరలోనే టీడీపీ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జగనన్న కాలనీల నిర్మాణాన్ని పరిశీలించి, పేదల వేదనను, ప్రభుత్వం నిర్మిస్తామని చెబుతున్న ఇళ్లనిర్మాణంలోని డొల్లతనాన్ని బయటపెడతాయి” అని కాలవ స్పష్టంచేశారు.