Suryaa.co.in

Andhra Pradesh

వందేభారత్ రైలుపై దాడి చేసిన వారిని శిక్షించండి: సోము వీర్రాజు

సికింద్రాబాద్_ విజయవాడ_ విశాఖపట్నం మధ్య నూతనంగా ప్రవేశపెట్టనున్న వందే భారత్ హై స్పీడ్ రైలు ట్రైల్ రన్ పై నేటి సాయంత్రం విశాఖపట్నం కంచరపాలెం ప్రాంతంలో కొందరు దేశద్రోహశక్తుల ప్రోత్సాహంతో దుండగులు దాడి చేయడాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు.

దేశాభివృద్ధిలో కీలకమైన రైల్వేల అభివృద్ధిలో భాగంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రవేశపెట్టిన వందే భారత్ ప్రత్యేక హై స్పీడ్ రైళ్లకు పెరుగుతున్న ఆదరణ ప్రజల యొక్క అభిమానాన్ని చూసి ఓర్వలేని దుష్ట శక్తులు ఇలా దాడి చేశాయని సోము వీర్రాజు మండి పడ్డారు.

ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన దోషులను దుండగులను ప్రోత్సహించిన దేశ వ్యతిరేక శక్తులను కనుగొని చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించి కఠినంగా శిక్షించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈనెల 19వ తారీఖున ప్రారంభించనున్న ఈ రైలు రాకను ఎందుకు ఆ దుష్టశక్తులు వ్యతిరేకిస్తున్నాయో ప్రజలు గమనించాలని సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE