Suryaa.co.in

Political News

అవినాష్ రెడ్డికి పిలుపొచ్చింది… ఏంటీ సంగతి!?

మనం పత్రికల్లో అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఎక్కడో ఓ మడ్డర్ అవుతుంది. ఏ తుప్పల్లోనో శరీరం కుళ్ళిపోయి ఉంటుంది. ఎవరో….,ఎవరు చేశారో తెలియదు. అసలు ఆ డెడ్ బాడీ ఆనవాళ్లు కూడా సరిగా ఉండవు . ఆధారాలు దొరకలేదు. ఏ రకమైన ‘క్లూ’స్ లేవు. పోలీస్ జాగీలం కూడా…. డెడ్ బాడీ ని వాసన చూసింది కానీ, అక్కడే కూర్చుండి పోయింది.

అంత క్లిష్టంగా తయారైన మడ్డర్ కేసుల్లో కూడా….’ పోలీసులు 48 గంటల్లోనే మడ్డర్ కేసు ను ఛేదించారు… ” అని అప్పుడప్పుడూ పత్రికల్లోనో…, టీవీ ల్లోనో చూసి, ఆశ్చర్య పడిపోతుంటాం. మన పోలీసు యంత్రాంగం అంత ప్రతిభావంతమైనది. వారి శిక్షణ, మోటివేషన్ అలాటివి. దానికి తోడు, ఆధునిక టెక్నాలజీ వినియోగం లో నైపుణ్యం సైతం మన పోలీస్ వ్యవస్థ సొంతం. ఓ కోడి గుడ్డు వారి చేతిలో పెట్టి, అది ఏ కోడి పెట్టిందో కనుక్కోమంటే…. కనుక్కోవడం మన పోలీసులకు కష్టం కాదు. అటువంటి సమర్ధత కలిగిన పోలీసు వ్యవస్థ…. పులివెందుల లో జరిగిన వై. ఎస్. వివేకానంద రెడ్డి మడ్డర్ విషయం లో మాత్రం నిందితులను కనిపెట్టలేక చేతులు ఎత్తేసింది. ఆయనేమీ అనామకుడు కాదు. ఏ అడవి లోనో ఆయన మడ్డరై పోలేదు.
*ఆయన రాష్ట్ర స్థాయి ప్రముఖుడు
* డాక్టర్ వై ఎస్ కు స్వయానా సోదరుడు
* మాజీ ఎం. పీ, మాజీ మంత్రి
* వై.ఎస్. జగన్ కు చిన్నాన్న
* ఆయన ఇంట్లో ఆయన మడ్డర్ అయ్యారు.
*పులివెందల లో పోలీస్ స్టేషన్ ఉంది.
* వివేకా భౌతిక కాయం అక్కడ ఉండగానే పులివెందుల పోలీసులు కూడా వచ్చారు. ఈ మడ్డర్ కేస్ ను ఛేదించడానికి మన పోలీసులకు 24 గంటల సమయం కూడా ఎక్కువే. అయినప్పటికీ,
అప్పుడు అధికారం లో ఉన్న చంద్రబాబు నాయుడు ఒక ‘ప్రత్యేక దర్యాప్తు బృందా ‘న్ని కూడా నియమించారు.
* ఈ దర్యాప్తు బృందం మీద తమకు నమ్మకం లేదని ; సీబీఐ తో దర్యాప్తు కు ఆదేశించాలి అని అప్పటి ప్రతిపక్ష నేత వై. ఎస్. జగన్ హై కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.
* ఆయన ముఖ్యమంత్రి అయ్యాక, పాత ‘సిట్’ స్థానం లో కొత్త ‘సిట్’ ను నియమించారు.
*అందుకని, సీబీఐ దర్యాప్తు కోసం ఆయన హై కోర్ట్ లో వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.
*వివేకా ఏకైక కుమార్తె డాక్టర్ సునీత పోలీసు అధికారును పలు మార్లు కలిసి, తన అనుమానాలను వారి ముందు పెట్టారు.
* అయినా, ఈ మడ్డర్ లో నిందితులు ఎవరో పోలీసులు కనిపెట్టలేక పోయారు.
* ఇక, లాభం లేదనుకొని, మళ్ళీ సీబీఐ దర్యాప్తు కోసం డాక్టర్ సునీత ఏ పీ హై కోర్టును ఆశ్రయించారు. హై కోర్టు ఓకే అన్నది.
*వాళ్ళు పులివెందుల, కడప సెంట్రల్ జైలు చుట్టూ నెలల తరబడి తిరిగారు గానీ, నిందితులు ఎవరో కనిపెట్టలేక పోయారు.
*మధ్యలో కరోనా వచ్చి కేసు దర్యాప్తును అటక ఎక్కించి, సీబీఐ బృందాన్ని ఢిల్లీ పంపించింది.
* డాక్టర్ సునీత మళ్ళీ సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది. దర్యాప్తు ను వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని అభ్యర్థించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో, హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు కేసు బదిలీ అయింది.
2019 మార్చ్ 15 న వివేకానంద రెడ్డి మడ్డరైపోతే….; 2023 జనవరి 26 వరకు, నిందితులు ఎవరో నిర్ధారణ కాలేదు.

ఇప్పుడు, కడప ఎం పీ అవినాష్ రెడ్డి కి సీబీఐ నోటీసులు జారీ చేయడం తో రాష్ట్రం ఒక్క సారిగా ఉలిక్కి పడింది. ఆయనకు, వివేకా మడ్డర్ కు లింకు ఏమిటో తెలియక పోయినా ; డాక్టర్ సునీత వ్యక్తం చేసిన అనుమానితుల జాబితాలో ఆయన, ఆయన తండ్రి వై. ఎస్. భాస్కర రెడ్డి ఉన్నట్టు గట్టి ప్రచారం జరిగింది. దానితో, వారిరువురి పేర్లూ బాగా ప్రచారం లోకి వచ్చాయి. అయినప్పటికీ, మొన్న – జనవరి 23 వ తేదీ వరకు అవినాష్ రెడ్డి ని సిట్ లు గానీ, సీబీఐ గానీ విచారణకు పిలువలేదు. ‘ ఎందుకు పిలవడం లేదు ‘ అంటూ ప్రతిపక్ష నేతలు అదేపనిగా ప్రశ్నలు సంధించేవారు. అయినా ఆయనను పిలువలేదు. ముఖ్యమంత్రి జగన్ పలుకుబడి ఢిల్లీ లో ఆ రేంజ్ లో ఉన్నదని ; అందుకే ఆయన సోదరుడైన అవినాష్ రెడ్డి వైపు సీబీఐ కన్నెత్తి చూడడం లేదంటూ మీడియా కధనాలు, ప్రతిపక్ష విమర్శలూ హోరెత్తి పోయాయి..

ఉరుము, మెరుపు లేకుండా పిడుగు పడ్డట్టు… ఇప్పుడు సీబీఐ వారు హఠాత్తుగా అవినాష్ రెడ్డి కి నోటీసులు జారీ చేశారు. ఆయన తండ్రి వై ఎస్ భాస్కర రెడ్డి కోసం పులివెందులలో సీబీఐ వారు మూడు, నాలుగు చోట్ల ఆరా కూడా తీశారంటూ మీడియా లో వార్తలు షికార్లు చేశాయి.. సీబీఐ ప్రదర్శించిన ఈ ‘దూకుడు ‘ దేనికి సంకేతం అనే విషయం మీదే రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ‘దూకుడు’లో కూడా మామూలు దూకుడు కాదు. ఈ రోజు సాయంత్రం పులివెందుల లో నోటీస్ జారీ చేసి, రేపు మధ్యాహ్నం…. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి రమ్మని ఆదేశించడం. నిజానికి, పులివెందుల లోనే ఫైవ్ స్టార్ ఆర్&బీ గెస్ట్ హౌస్ ఉంది. వై. ఎస్. హయాం లో ఆర్ & బీ మంత్రి గా నియమితుడైన జక్కంపూడి రామమోహనరావ్…. వై ఎస్ పట్ల కృతజ్ఞతగా ఈ అతిధి గృహం నిర్మింప చేశారు.
ఈ అతిధి గృహాన్ని సీబీఐ అధికారులు నెలల తరబడి వాడుకున్నారు. అనేక మంది సాక్షులను ఇక్కడే విచారించారు.

ఇప్పుడు, వై ఎస్ అవినాష్ రెడ్డి న పిలిచి విచారించాలి అనుకుంటే, ఈ అతిధి గృహానికి పిలిచి విచారించవచ్చు కదా అనేది పలువురి సందేహం. అదేమీ లేకుండా, కేవలం 24 గంటల లోపు, హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయం లో తమ ముందు హాజరు కావాలని సీబీఐ అధికారులు ఆదేశించారు. ఒక్క రోజు వ్యవధి లో ఎలా వీలవుతుంది అని అవినాష్ రెడ్డి నిల దీయడం తో, అయితే 28 వ తేదీ శనివారం రమ్మని మళ్ళీ ఆదేశించారు. ఈ పరిణామం పై అవినాష్ రెడ్డి సహజం గానే నొచ్చుకున్నారు. ఆ మడ్డర్ ఘటన నే జీర్ణం చేసుకోలేకపో తుంటే , తనపై గత రెండున్నరేళ్లుగా ఆరోపణలు చేయడం మరింత బాధాకరం గా ఉన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఢిల్లీ లో గల పలుకుబడి దృష్ట్యా, వరుసకు సోదరుడు అయిన అవినాష్ రెడ్డి ని జగన్ రక్షిస్తున్నారనే ప్రచారం వాస్తవం అయితే గనుక ; ఇప్పుడు ఆ ‘పలుకుబడి ‘ ఏమైంది? తగ్గిందా? తగ్గితే….., ఎందుకు తగ్గింది? తగ్గక పోతే…..; ఇన్నాళ్ళూ పిలవని సీబీఐ ఇప్పుడు ఎందుకు పిలిచింది? ఇవన్నీ ఇప్పటికిప్పుడు సమాధానాలు దొరకని ప్రశ్నలు.

వివేకా మడ్డర్ విషయం లో నిజం ఏమిటో తెలియాలని, న్యాయం జరగాలని తాను భగవంతుడిని కోరుకుంటున్నట్టు అవినాష్ రెడ్డి ప్రకటించారు. వివేకా కుమార్తె డాక్టర్ సునీత కూడా ఈ మూడేళ్ల నుంచీ అదే కోరుకుంటూ ఉండి ఉండాలి . అందుకే, హైదరాబాద్ – విజయవాడ – ఢిల్లీ మధ్య షటిల్ సర్వీస్ చేశారు. సీబీఐ అధికారులు ఎం పీ అవినాష్ రెడ్డి ని విచారణకు రమ్మని ఆదేశించడం పట్ల వైసీపీ నేతలు ఎవరూ స్పందించినట్టు లేరు. నిజానికి, వారు స్పందించాల్సిన సందర్బమే ఇది. రోజా, అంబటి రాంబాబు, పేర్ని నానీ, కొడాలి నానీ, గుడివాడ అమర్నాధ్, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు మొదలైన వారి లో ఏ ఒక్కరూ ఈ పరిణామం పై స్పందించక పోవడం కొంచెం ఆశ్చర్యకరమే. వీళ్ళు స్పందించకపోయినప్పటికీ ; జగన్ సోదరి షర్మిల స్పందించారు.వివేకా ఘోరమైన మడ్డర్ కు గురయ్యారని, దర్యాప్తు ఇంత ఆలస్యమైతే, సీబీఐ పై విశ్వాసం సన్నగిల్లుతుందని ఆమె అన్నారు.

ఇకనైనా, తొందరగా దర్యాప్తు చేయమని షర్మిల – సీబీఐ కి విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద, మన్ను తిన్న పాము లాగా ఇంతకాలమూ స్థబ్దు గా ఉన్న సీబీఐ…., కుబుసం విడిచిన పాము లాగా చాలా చురుకుగా కదిలింది. జీతాలు మొర్రో…. అంటూ ఓ పక్కన ప్రభుత్వ ఉద్యోగులు… అప్పులు ఇక ఇచ్చేది లేదంటూ మరో పక్క రిజర్వ్ బ్యాంకు, ఇంకో పక్క నుంచి కోర్టులు, రాజకీయం గా ప్రతిపక్షాలు ఏకమవుతున్న సంకేతాలు, యువగళం అంటూ లోకేష్ హడావుడి…..కి అదనంగా ఇప్పుడు – కదులుతున్న వివేకా మడ్డర్ కేస్. సీబీఐ కి షర్మిల అక్షింతలు. ఈ నేపథ్యంలో వివేకానంద రెడ్డి స్మృతి ఈ సారి ఏపీ ఎన్నికల్లో గణనీయమైన పాత్ర పోషించిబోతున్నదనడం లో సందేహం అవసరం లేదు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తరువాత, అసలైన రాజకీయ, సామాజిక, నేర సంబంధిత, కుటుంబ పరమైన సవాళ్ళను జగన్ మొదటి సారిగా ఎదుర్కొంటున్నారు.
(లాయర్ పత్రిక, నెల్లూరు సౌజన్యం తో )

భోగాది వేంకట రాయుడు
bhogadirayudu2152@gmail. com

LEAVE A RESPONSE