వందే భారత్ ట్రయిన్ లో… నా తొలి ప్రయాణ అనుభవం…..!

జపాన్ లో బుల్లెట్ ట్రయిన్స్… కొరియాలో హైస్పీడ్ ట్త్రెన్స్… అని వింటూ సంబరపడటమేకాని అలాంటి ట్రయిన్స్ మన దేశంలో ఎప్పుడు ప్రవేశ పెడతారా అనుకుంటూ ఉండేవాడ్ని…!.

ఒకవేళ మన దేశంలో ఆ తరహా ట్రయిన్స్ ప్రవేశపెట్టినా కూడ ప్రాధాన్యత క్రమంలో “గుజరాత్” వంటి రాష్ట్రం తరువాత మన ప్రాంతాలకు వాటి వడ్డన ఎప్పటికి జరుగుతుందో?…..అప్పటి వరకు నేను ఉంటానా అంటూ మదన పడుతూ ఉండేవాడ్ని…!

…సరిలే ఇంతకాలనికైనా సెమీ హ్తె-స్పీడ్ ట్రయిన్ అంటున్నారు కదా ఓ మారు వందేభారత్ ట్రయిన్ ఎక్కి నా ముచ్చట కాస్త అయినా తీర్చుకుందామని బయలు దేరాను…. .!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నాను. ఇక్కడ నుండి వందే భారత్ ట్రయిన్ ఎక్కి రాజమండ్రి వెళ్దామని…!

ఆశ్యర్యం…!…. వందే భారత్ ట్రయిన్ ఆగిఉన్న ఫ్లాట్ ఫ్లాం వైపుగా ఆ స్టేషన్ లో మిగిలిన ఫ్లాట్ ఫ్లాం మీద ఉన్న ప్రయాణీకులు ఆసక్తి గా చూస్తున్నారు..!… అంతేనా ఆ ట్రయిన్ లో ఎక్కేవారిని సెలెబ్రిటీలను చూస్తున్నట్లు కన్నులు ఆర్పకుండా ఆసక్తిగా చూస్తున్నారు వారిలోని కొందరు.!….. ఆ క్షణంలో నా మొహంలో కాస్తంత గర్వం తొణికిసలాడింది..!..

…ఎందుకంటే నేను కూడ ఆ ట్రయిన్ ఎక్కుతున్న వాడ్ని కాబట్టి… లిప్తకాలం పాటేనా వారందరి దృష్టిలో సెలెబ్రిటిని అయినందకు…!

ఆ ట్రయిన్ లోకి వెళ్ళగానే అటెండెంట్ వాటర్ బాటిల్ ను, కొద్దిపాటి స్నాక్స్ ను తీసుకొచ్చి నాకు అందివ్వబోయాడు…

.. కాసేపు సందేహించాను వాటీని తీసుకోడానికి…!.. ….ఎందుకంటే నేను తొలిసారి గతంలో విమాన ప్రయాణం చేసినప్పుడు కూడ ఎయిర్ హోస్టెస్ ఇలానే వాటర్ బాటిల్, ఓ కప్పు కాఫీ అందించింది… ! .. “ఓహో… విమానంలో ఎక్కేవారిని ఇలాగే మర్యాద చేస్తారు కాబోలు అనుకుని, వాటిని తీసుకుని గబగబా కప్పులోని కాఫీని తాగేశాను… వాటర్ బాటిల్ ను నా బ్యాగ్ లో కుక్కేశాను…!

కొంతసేపటికి చేతిలో 200 రూ. బిల్లు రశీదుతో నా దగ్గరకు వచ్చింది ఎయిర్ హోస్టెస్… బిల్లు కట్టమంటూ సైగలు చేసింది…!.. .. ఇందాక నేను తీసుకున్న వాటర్ బాటిల్, కాఫీ కి బిల్లు అని నేను గ్రహించాను ఆక్షణంలో వెంటనే…! …

….. “ తస్సదియ్యా.!…. 15- 20 రూల.కు వచ్చే వాటర్ బాటిల్ , కాఫీలకు ఇంత బిల్లు వేస్తారా..పోని ఎయిర్ హోస్టెస్ ఇచ్చిందే తడువుగా నేను మాత్రం ఎందుకు తీసుకోవాలి…నాకే బుద్దిలేదు అని నా మనస్సులో నన్నే తిట్టుకుంటూ మారుమాట్లడకుండా ఆ బిల్లును చెల్లించేశాను కాస్త ఏడుపు మోహంతో…!

…సరిగ్గా ఇప్పుడు కూడ అదే సంఘటన పునరావృతం అవుతుందేమోన్న సందేహాం నాలో కలిగింది. ట్రయిన్ అటెండెంట్ ఇచ్చిన వాటర్ బాటిల్, స్నాక్స్ ను తీసుకోవటానికి నిరాకరిస్తూ నా సీట్లోకి వెళ్లి కూర్చున్నాను… అయితే ఆ ట్రయిన్ అటెండెంట్ మాత్రం నావైపు ఎందుకు విచిత్రంగా చూస్తున్నాడో మాత్రం అర్ధం కాలేదు. … !

నేను కూర్చున్న వరుసలో మూడు సీట్లు… మాకు ఎదురుగా మరో మూడు సీట్లు ఉన్నాయి…! .. సరిగ్గా ట్రయిన్ బయలుదేరే సమయానికి ఓ మూడు దినపత్రికలను మా ముందు వేశాడు ట్రయిన్ లోని ఇంకో అటెండెంట్. ఆ వరుసలో మేము మొత్తం 6 మంది ఉన్నాము… కాని వారు ఇచ్చింది మాత్రం 3 పేపర్సే.. అంటే ఒకడు మొదటి పేజిని చదువుతూంటే ఎదురుగా కూర్చున్న మరొక ప్రయాణికుడు చివరిపేజివైపు చూస్తూ చదవుకోవలన్న మాట…!… అని మనస్సులో చమత్కార ఆలోచన చేసుకుంటూ నాలో నేను నవ్వుకున్నాను… !

అంతేకాదు ఆ దినపత్రికలను చూసి కాస్త బిత్తర పోయాను ఆ క్షణంలో..!… ఎందుకంటే అవి ఆంగ్ల దినపత్రికలు…

….ఏదో నామటుకు నేను ఆఫీస్ కు లీవ్ లేటర్ ను ఇంగ్లీషులో వ్రాసి ఇచ్చేంత అవగాహన ఉంది.!… అంతేగాని….ఇంత పెద్ద పెద్ద ఇంగ్లీషు న్యూస్ పేపర్స్ ను చదివేంతా ఇంగ్లీషు నాలెడ్జ్ లేదు..!…. అయినా తెలుగు ప్రాంతంలో నడిచే ట్రయిన్ లో ఆంగ్ల పేపర్స్ సప్లయ్ ఏంటిరా బాబు అని మనస్సులో అనుకున్నాను. కాని ట్రయిన్ లోని మిగిలిన ప్రయాణీకుల ముందు ఆ న్యూస్ పేపర్స్ ను సీరియస్ గానే చదివేస్తున్నట్లు నటించేసాను.

….ట్రయిన్ బయలుదేరి నెమ్మది..నెమ్మదిగా వేగం అందుకుంటోంది. కంపార్ట్మెంట్ లో ఉన్న ఎలక్ట్రానిక్ డిస్ – ప్లే బోర్డులో ఆ ట్రయిన్ ఎంత స్పీడులో వెళుతుందో కనిపిస్తూనే ఉంది..!.. .

…మరొపక్క ఇతర స్టేషన్లను దాటుకుంటూ నేను ఎక్కిన ట్రయిన్ దూసుకుపోతోంది.!… అయా ఫ్లాట్ ఫాంలలో ఉన్న వారు వేగంగా వెళ్తున్న వందే భారత్ ట్రయిన్ ను తమ సెల్ ఫోన్లలోని కెమెరా లలో బంధించేస్తున్నారు.. ఆ దృశ్యాల్ని ట్రయిన్ లోనుండి చూస్తున్న నాకు కాస్త గర్వం తొణికిసలాడింది ఆ క్షణంలో..!..ఎందుకంటే ఎంతో మంది తదేకంగా చూస్తున్న ఓ కొత్త ట్రయిన్ లో ప్రయాణిస్తున్నాన్న ఆనందంలో..!..

… ఆ క్షణంలో నేను ప్రయాణిస్తున్న ట్రయిన్ ను ఓ సామ్రాజ్యంగాను, ఆ రాజ్యానికి నేను యువరాజు గాను, కూర్చున్న సీటును నా సింహాసనం గాను భావించుకుంటూ క్రొత్త ట్రయిన్ ను తొలిసారి ఎక్కిన అనుభూతిని తెగ అస్వాధించేస్తున్నాను.

నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్న మగత కారణంగా హైద్రాబాద్ మెట్రో ట్రయిన్ లో ప్రయాణిస్తున్నానేమో అనుకున్నాను… !… ఆ మగత కారణంగా అరగంట దాటినా కూడ నేను దిగాల్సిన స్టేజీ ఇంకా రాలేదేమిబ్బా…అనుకున్నాను. ఎందుకంటే హైద్రారాబాద్ మెట్రోలో ఓ ముప్పావుగంట కు మించి ప్రయాణించే అవసరం ఉండదు ఎవరికి కూడ-…!…

…అంతలోనే ఎమరపాటు నుండి బయటకు వచ్చిన నాకు నేను ప్రయాణిస్తున్నది వందే భారత్ ట్రయిన్ లో రాజమండ్రికి అని…..అప్పుడు వరకు ట్రయిన్ తలుపులు తేరుచుకోవు అని…!.. ఎందుకో ఆ క్షణంలో నాలో నేను నవ్వుకున్నాను నా నిద్ర అవస్ధకి…!

సరిగ్గా 6 గంటల ప్రయాణం చేసి ట్రయన్ రాజమండ్రి చేరుకుంది. ట్రయిన్ తలుపులు ఎక్కడ త్వరగా మూసుకుపోతాయో అన్న తొందరలో హడవుడిగా అందర్నీ త్రోసుకుంటూనే ట్రయిన్ దిగాను బ్రతుకు జీవుడా అనుకుంటూ…!…

సరిగ్గా ట్రయిన్ దిగేముందే ట్రయిన్ అటెండర్ అన్నాడు… “ సార్…ట్రయిన్ ఫేర్ లోనే అతిధ్య ఖర్చులు కలిసి ఉన్నాయి… మీరు అనవసరంగా వాటిని తీసుకోలేదు అంటూ”…..!… అప్పుడు అర్ధం అయ్యింది నాకు నేను ట్రయిన్ లో ఉన్నంత సేపు నాకేసి ఆ ఆటెండర్ ఎగా-దిగా ఎందుకు చూశాడా అని…!

“పన్నెండు వందల రూపాయలకు పైగా వసూలు చేసి కనీసం ఓ పది, పదిహేను గంటలు కూడ తిప్పకుండా 6 గంటల్లోనే దింపేస్తాడా…ఇది అన్నాయం అధ్యక్షా..!”… అని కొస్తా జిల్లాల వారీ వెటకారంతో ర్తేల్వే వారిని మనస్సులో తిట్టుకుంటూనే రాజమండ్రి రైల్వే స్టేషన్ బయటకు వచ్చేసాను..!

మొత్తం మీద చెప్పాలంటే…… రైల్ ఎక్కేటప్పుడు…దిగేటప్పుడు తలుపులు వాటంతటఅవే తెరుచుకోవడం, లేదా మూసుకుపోవడం… అలాగే ట్రయిన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు లోపల వారికి “గ్రెండర్ లో ఇడ్లీ పిండి ఆడుతున్నప్పుడు వచ్చే శబ్ధం అనుభూతిని పొందడం…!

ఈ తరహా అనుభూతి హైదరాబాదు మెట్రో రైల్ లో తరచూ ప్రయాణించే ప్రయాణీకులకు కొత్తమి కాదు….! నాకు కూడ అదే అనుభూతి కలిగింది ఈ ప్రయాణం మొత్తంలో…!

అంతేకాదు…ఉభయ గోదావరి జిల్లాలనుండి వచ్చిన స్ధిరపడిన వారు ఎక్కువే హైదరాబాదులో..!….. ఇక్కడ తమ వారిని చూడటానికి అయా జిల్లాలనుండి జంట నగారాలకు తరచు ప్రయాణించేవారు ఎక్కువే…!.. ఆ నేపధ్యంలో వారు- వీరు కలిసి హైదరాబాదు మెట్రోలో ప్రయాణించడం షరా మాములే…!…

అలాగే హైస్పీడ్ ట్రయిన్స్ కోస్తా ప్రాంతం వారికి కొత్తమికాదు. బాలయోగి గారు లోక్ సభ స్పీకరుగా ఉన్న కాలంలోనే రాజమండ్రి నుండి హైదరాబాదుకు హైస్పీడ్ ట్రయిన్ ఒకటి నడపబడేది. ఆ తరువాత రద్దు చేయబడింది…!…… అదే విధంగా ఈ ప్రాంతం మీద గా ఇప్పటికీ పలు సూపర్ ఫాస్ట్ ట్రయిన్స్ నడుస్తున్నాయి… వాటికి తరచూ ఎదురయ్యే సిగ్నల్ వంటి సాంకేతిక ప్రతిబంధకాలను సరిచేస్తే వందే భారత్ ట్రయిన్ తో సమానంగా ప్రయాణ కాలన్ని తగ్గించే సామర్ధ్యం ఉన్నవే…!

…అందుకే వందే భారత్ ట్రయిన్ లో ప్రయాణం కోస్తా వాసులకు కొత్త అనుభూతులను అంతగా అందించదు ఏమో అనిపించింది. అదే మాటున “ఈ మాత్రం ప్రయాణానికి చాల ఖర్చు పెట్టేసామన్న” భావన మనస్సను తోలిచేస్తుంటుందనే భావనను మాత్రం కాదనలేము…!

దీనికి తోడు ఇటీవల అనేక ట్రయిన్స్ లో జనరల్, మరియు స్లీపర్ క్లాసు బోగీలను తగ్గించేస్తూ, ఎ.సి.కోచ్ ల సంఖ్యను పెంచుతున్న సంఘటనలు జరుగుతున్నాయి.. ఈ నేపధ్యంలో సామాన్య తరగతి ప్రజలకు మున్ముందు రైలు ప్రయాణం అంటే భారంతో కూడిన వ్యవహారం కావడం ఖాయంగా అనిపిస్తోంది.

శ్రీపాద శ్రీనివాస్

Leave a Reply