-ఎవరి కొంప ముంచాలి? ఎవరిని నాశనం చేయాలన్నదే కేసీఆర్ తపన
-కొండగట్టు, ధర్మపురి, వేములవాడ ఆలయాల అభివృద్ధికి ఇస్తానన్న నిధులేవి?
-బీజేపీ ఆధికారంలోకి వస్తే ఆయా ఆలయాలను అభివృద్ధి చేస్తాం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
-కొండగట్టు అంజన్నను దర్శించుకుని కార్యకర్తల మొక్కును చెల్లించిన సంజయ్
ముఖ్యమంత్రి కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఎవరి కొంప ముంచాలి? ఎవరిని నాశనం చేయాలన్నదే కేసీఆర్ కుటుంబం ఆలోచన అని మండిపడ్డారు. ఇతరుల నాశనం కోరేవాళ్లు చేసే పూజలు ఫలించబోవన్నారు. కొండగట్టు, ధర్మపురి, వేములవాడ ఆలయాల అభివృద్ధి ఇస్తానన్న నిధులు ఇంతవరకు ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఆయా ఆలయాలను అభివ్రుద్ధి చేయడంతోపాటు భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, మధుకర్ తదితరులతో కలిసి కొండగట్టు అంజనేయ స్వామి దేవాలయానికి విచ్సేసిన బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. కార్యకర్తల మొక్కులను చెల్లించారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని, కష్టాలు తొలిగిపోవాలని అంజన్న స్వామిని కోరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…
బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలను ముంచుతున్నరు. దేవుడికి కూడా శఠగోపం పెడుతున్నరు. సీఎం కేసీఆర్ నోటికి అడ్డూ అదుపు లేదు. ఎములాడ రాజన్నకు ఏటా రూ,100 కోట్లు చొప్పున 400 కోట్లు ఇస్తానన్నడు. ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి రూ.100 కోట్లు విడుదల చేస్తానన్నడు. కొండగట్టు అంజన్న ఆలయానికి రేపే రూ.100 కోట్లు ఇస్తానని చెప్పి 2 నెలలు కావొస్తున్నా పైసా ఇవ్వలేదు. ప్రజలకు సమాధానం చెప్పాలి.
సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం నిత్యం ఎవరి కొంప ముంచాలి? ఎవరిని ముంచాలి? ఎవరిని నాశనం చేయాలని చూస్తున్నరు. క్షుద్ర పూజలు చేస్తున్నరు. ఇతరుల నాశనం కోరేటోడు బాగుపడరనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. మంచి కోసం మొక్కితేనే, పూజలు చేస్తేనే ఫలితం ఉంటుంది.
కేసీఆర్, ఆయన కుటుంబం అవినీతితో వేల కోట్లు సంపాదిస్తున్నరు. దొంగ దందాలు చేసి కోట్లు కూడబెట్టుకుంటున్నారు. తెలంగాణ ప్రజలను మాత్రం బికారులను చేస్తున్నారు. కేసీఆర్ లాంటి మూర్ఖుడికి అధికారం ఇవ్వడంతో ప్రజలు బతుకులు నాశనమైపోతున్నయ్.
కేసీఆర్ నోటి నుండి ఏ దేశం పేరొచ్చినా అవుట్ అవుతోంది. పాకిస్తాన్, శ్రీలంకలో తిండి లేక జనం కొట్టుకుచస్తున్నరు. పాకిస్తాన్ లో గోధుమ పిండి కోసం ఒకరినొకరు చంపుకుంటున్నరు. చైనా కరోనాతో అల్లాడుతోంది.
కార్యకర్తల పోరాట ఫలితంగా త్వరలోనే బీజేపీ ఆధ్వర్యంలో పేదల రాజ్యం రాబోతోంది. రామరాజ్యం వచ్చిన తరువాత కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న, ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి, కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయాలను అభివృద్ధి చేస్తాం. భక్తులకు ఇబ్బందుల్లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.