– గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు డొక్కా మాణిక్య ప్రసాద్
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలు వృధా ప్రయాసలని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం లాలాపేటలోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద డొక్కా విలేకరులతో మాట్లాడారు.
రాజకీయ రంగంలో ఎంతో కొంత శూన్యత ఉన్నప్పుడే పాదయాత్రలు విజయవంతమవుతాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలు, సంక్షేమ పథకాల పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పాదయాత్రలు విజయవంతమయ్యే ప్రసక్తే లేదన్నారు. లోకేష్ చేస్తున్న పాదయాత్ర కేవలం తాను నాయకుడినని నిరూపించుకునేoదుకే తప్ప ప్రజల కోసం కాదని విమర్శించారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పొంతన లేని విధంగా ఉంటున్నాయని రాజకీయాల్లో ఈ సంప్రదాయం మంచిది కాదని సూచించారు. సమావేశంలో స్థానిక కార్పొరేటర్ చిష్టి భాష, వైసీపీ నాయకులు ఫిరంగిపురం మండలపరిషత్ అధ్యక్షురాలు షహెల నర్గీస్, పేరేచర్ల మస్తాన్ వలీ, మాదా రాధ పాల్గొన్నారు.