Suryaa.co.in

Editorial

అదానీ అంటే దేశమోయ్‌!

( మార్తి సుబ్రహ్మణ్యం)

దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌ అని చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం. కానీ ఇప్పుడు వరస మారింది. అంటే దేశం మారలేదు గానీ, మనుషులు మారారన్నది కవి హృదయమన్నమాట. ఓ పది పదిహేన్ల క్రితం నాటిమాట. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ను విమర్శించిన ప్రతివారినీ, తెలంగాణ ద్రోహులుగా ముద్రవేసేవారు. అలా టీఆర్‌ఎస్‌ తన రాజకీయ ప్రత్యర్థులను, అలాంటి మానసిక భావనతో ముద్రవేసి, సక్సెస్‌ సాధించింది.

ఆ రాజకీయ మానసికభావన ఇప్పుడు దేశవ్యాపితమయిపోయింది. అన్ని పార్టీలకూ విస్తరించింది. సరే. పార్టీలకంటే ఏవేవో వ్యూహాలుంటాయి. కానీ విచిత్రమమేమిటంటే.. వ్యాపారాలు చేసుకునే వాళ్లకూ, ఇలాంటి రాజకీయ మానసిక భావన జబ్బొచ్చిపడింది. అదే ఇక్కడ విడ్డూరం! ఈ సుత్తీ, సోదీ అంతా ఎందుకు? అదానీ గురించే కదా ఈ డొంక తిరుగుడు అంతా. అదేదో నేరుగా చెబితే సరిపోతుంది కదా అనే కదా మీ అసహనం?!

సరే ఈ ముసుగులో గుద్దులాటెందుకు? అదానీ అనే జాతిరత్నం-గుజరాతీ వ్యాపారరత్నం గురించే ఇప్పుడు, లోకం కూడైకూస్తోంది. కాబట్టి మనమూ ఆయన మంచి చెబ్బర్లు కొద్దిగా ముచ్చటించుకుందాం!
ఎన్టీరామారావు ఒక సామాన్య కుటుంబీకుడు. బాగా చదువుకున్నప్పటికీ సరైన ఉద్యోగం రాక.. ఉదయం పూట ట్యూషన్‌ చెప్పి, మధ్యాహ్నం రిక్షా తొక్కి, రాత్రి టాక్సీ నడిపేవాడు. మధ్యలో బియ్యం షాపుల్లో బస్తాలు మోసేవాడు. అలా కొద్దికాలానికే లక్షాధికారయి, ఖరీదైన కార్లలో తిరుగుతాడు. ఇది ఒక పాత సినిమాలో మనం చూసిన కథ.

అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు.. మన గుజరాతీ అదానీ అన్నయ్య, ఆంధ్రా ఎన్టీరామారావు కంటే అరడజను ఆకులు ఎక్కువే చదివారు. అంటే ఒకేరోజు మూటలు మోసి, టాక్సీలు నడిపి, ట్యూషన్లు చెప్పి కోట్లాది రూపాయలు సంపాదించాడు. అయినా ఈ పాడు సమాజం.. అదానీ అన్నయ్య కష్టాన్ని గుర్తించడం లేదు. పైగా ఈటెల్లాంటి సూటిపోటి మాటలు! దారుణం కదూ? కళ్లవెంట నీళ్లు రావడం లేదూ?!

ఒకప్పుడు గుజరాత్‌లో చిన్న వ్యాపారిగా ఉన్న అదానీ, అప్పట్లో కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన అహ్మద్‌పటేల్‌ అనే, రాజకీయ ఆసామీ సాయంతో కాంట్రాక్టులు పట్టేశారు. అప్పట్లో అదానీలు కూడా సోనియమ్మ కచేరీలోనే ఉండేవారు లెండి. అది వేరే కథ. ఆ తర్వాత అదానీ అన్నయ్య వెనక్కి తిరిగి చూడలేదు. మోదీ గుజరాత్‌ సీఎం అయిన తర్వాత ఆయననూ పట్టేసి, మరింత వెలిగిపోయారు. అలా వారిద్దరి బంధం ఇప్పటికీ కొనసాగుతోంది. దేశంలో ఉన్న పోర్టులు, ఎయిర్‌పోర్టులన్నీ అదానీ కంపెనీని అయస్కాంతం మాదిరిగా వచ్చి అతుక్కుపోతున్నాయి. ఆయన కోసం శ్రీలంక దేశంలో కూడా రాయబారం జరిగిందట. ఏదైనా అదానీ అన్నయ్య తెలివే సెప‘రేటు’.

అయినా సరే.. అదానీ అన్నయ్య ఎదుగుదలకు-మోదీ బంధానికీ ఎలాంటి బాదరాయణ సంబంధం-ఫెవికాల్‌ బంధం లేనే లేదు. నిజం. నమ్మండి. అవన్నీ అదానీ ప్రతిభా పాటవాలకు మెచ్చి, ఇతర కంపెనీలు ముందుకొచ్చి, తమంతట తామే అదానీకి అమ్మేసుకున్నవే. ఇందులో మోదీ ప్రమేయం ఇసుమంతయినా లేదు. అసలు కుటుంబాన్నే పట్టించుకోని మోదీ.. నీతి నిజాయితీకి పటేల్‌ విగ్రహమంత ఎత్తు నిదర్శనమయిన మోదీ..గుజరాతీ అయినంత మాత్రాన అదానీకి సాయం చేస్తారా ఏంటి? పిచ్చిమాటలు కాకపోతే?!

అవన్నీ అదానీ సొంత తెలివితేటలే. అదానీ అందం-తెలివి-మేధస్సు- ఒడ్డూ-పొడుగూ చూసి, రాష్ర్టాల ముఖ్యమంత్రులే ఆయనకు తమ పోర్టులు తీసుకోమని బలవంతం పెడుతున్నారు. దానికి అదానీ మాత్రం ఏం చేస్తారు చెప్పండి? అయినా.. ఒక భారతీయడు ఇన్నేసి అద్భుతాలు సృష్టిస్తే సంతోషించకుండా, ఈ కడుపుమండిన మాటలేంటి? అన్యాయం కదూ?! మరి అదానీ అన్నయ్య అంత మొనగాడయితే, కొత్తవి సృష్టించకుండా, ఉన్నవాటిని, అవి కూడా ఎవరెవరివో లాగేసుకోవడమేమిటి? అన్న పిచ్చి ప్రశ్నలేసే వారిని ఏమీ చేయలేం.

కరోనా కష్టకాలంలో అన్ని కంపెనీలు దివాలా తీసి, నష్టపోయాయి. కానీ అదానీ అన్నయ్య కంపెనీల ఆదాయం మాత్రం, తారాజువ్వ మాదిరిగా రివ్వున పైకెదిగాయి. అప్పటికీ ఆయన కుబేరుడి లిస్టులో నెంబరు తగ్గలేదు. దానికి అదానీ అన్నయ్య ప్రతిభే కారణం. అంతే తప్ప, ఆయన ఎదుగుదలకు- మోదీకి ఎలాంటి సంబంధం లేదు. నమ్మకపోతే మీ ఇష్టం!

మరి మోదీ ప్రధాని బాధ్యతలు స్వీకరించేందుకు, అదానీ అన్నయ్య విమానంలోనే వెళ్లారు కదా? అని ప్రశ్నించవచ్చు. కావచ్చు. ఏదో సాటి గుజరాతీకి ప్రధాని పదవి వచ్చింది కదా అని.. అదానీయే ముచ్చటపడి, మోదీని ఫ్రీగా ఢిల్లీకి తీసుకువెళ్లవచ్చు. అంతమాత్రాన వారిద్దరి బంధానికి ఏవేవో ముడిపెడితే ఎలా? గుజరాతీ అయితే అదానీ డబ్బులు సంపాదించుకోకూడదంటే ఎలా? తప్పు కదూ?!

పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఇన్‌ఫ్రా, రియల్‌ ఎస్టేట్‌, ఆయిల్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌, ధర్మల్‌ పవర్‌, మైనింగ్‌, గోడౌన్లు, డిఫెన్స్‌, రైల్వే, గ్రీన్‌ఎనర్జీ, పవర్‌ప్లాంట్స్‌, సోలార్‌ డేటాసెంటర్లు ఇలా అన్ని రంగాలూ.. అదానీ అన్నయ్య సొంతం కావడంలో ఆయన వ్యాపార తెలివితేటలే తప్ప, మోదీ గానీ, బీజేపీ గానీ సాయం చేశాయనడం అబద్ధమే కాదు. అబద్ధంన్నర! హిండెన్‌బర్గ్‌ అనే ఓ అమెరికా తలకుమాసిన సంస్థ, అదానీ మోసం గురించి రచ్చరంబోలా చేసింది. అదానీ కంపెనీలు వేల కోట్ల రుణాలు తీసుకున్నాయని, ఎల్‌ఐసీ కూడా పెట్టుబడి పెట్టిందని నానా యాగీ చేసింది. అదానీ వ్యాపార తెలివితేటలకు ముచ్చటపడిన ఎల్‌ఐసీ.. ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టింది, అందులో తప్పేమిటి? ఇరుగు పొరుగూ అన్నాక, ఆ మాత్రం మాట సాయం-మూటసాయం చేసుకోకపోతే ఎలా?

హిండెన్‌బర్గ్‌ కంపెనీ చేసిన నిర్వాకంతో పాపం అదానీ అన్నయ్య, కోటీశ్వరుడి ర్యాంకు ఢమాలున పడిపోయింది. దానితో చిర్రెత్తుకొచ్చిన అదానీకి దేశభక్తి గుర్తుకొచ్చింది. తన కంపెనీపై దాడి చేయడమంటే, దేశంపై దాడి చేయడమేనని శపించారు. అమ్మయ్యో.. అన్నయ్య బుర్రలో ఎన్ని తెలివితేటలు? నిజమే కదా మరి!

అదానీ దేశం కోసం, దేశ సరిహద్దుల్లో శత్రువులతో పోరాడుతున్న యోధుడాయె మరి! ఆ ప్రకారంగా తనపై దాడి చేస్తే, భారతదేశంపై దాడి చేయడమే కదా? హిండెన్‌బర్గ్‌ అనే శత్రుదేశపు కంపెనీ, ఓ భారత కంపెనీపై దాడి చేసి ఆగమాగం చేస్తుంటే.. భారతీయులంతా అదానీ అన్నయ్యకు.. మేమున్నాం అని భుజం తట్టకుండా, ఈ శల్యపరీక్షలు, శూలశోధనలు ఏమిటి? చిరాకు కాకపోతే!

ఇంతోటి దానికి పార్లమెంటులో ప్రతిపక్షాల రచ్చ. అదానీ అన్నయ్య అక్రమాలపై మోదీ భయ్యా మౌనంగా ఉన్నారెందుకు? పార్లమెంటులో ఎందుకు మాట్లాడటం లేదు? అన్న మతిలేని మాటలొకటి! అవినీతి, అక్రమాలు, బంధుప్రీతిని ఏమాత్రం సహించని మోదీ.. వీరందరికీ సమాధానం చెప్పాలా? నాన్సెన్స్‌!

దేశం కోసం ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా కష్టపడి పనిచే స్తూ, బ్యాంకులను కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన పుండాకోర్లను, ఎలా దేశానికి రప్పించాలన్నదే ఇప్పుడు మోదీ దృష్టంతా! ఆ పనిలో ఉన్న మోదీని పట్టుకుని, అదానీ రక్షకుడని బురదచల్లితే.. వారంతా కచ్చితంతా దేశద్రోహుల కిందే లెక్క. ఆ తర్వాత మీ ఇష్టం!

LEAVE A RESPONSE