– ప్రైవేట్ మెంబర్ బిల్లుకు వైసీపీ రె‘ఢీ’
– ఎన్నికల సమయంలో మళ్లీ తెరపైకి హోదా అంశం
– సీబీఐ కేసుల సమయంలో బీజేపీకి వైసీపీ ఝలక్
– మెట్రో ప్రాజెక్టులపైనా వైసీపీ మెలిక
– ఏపీపై కేంద్రం సవతిప్రేమ అని ఆగ్రహం
– బీజేపీని బెదిరించడానికే అంటున్న కమలదళాలు
– బీజేపీ జాతీయ నేత సత్యకుమార్ వ్యాఖ్యల మర్మం అదేనా?
– ఇన్నాళ్లూ హోదా మాట ఎందుకు ఎత్తలేదని సత్య ఎదురుదాడి
– బీజేపీని అప్రమత్తం చేసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు
– హోదా చరిత్రలో కలవదని కాదని విజయసాయి స్పష్టీకరణ
– హోదాపై వైసీపీ-బీజేపీ రాజకీయ వ్యూహాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
నాలుగున్నరేళ్ల పాటు స్తబ్దుగా.. సుషుప్త నిద్రావస్థలో ఉన్న ప్రత్యేక హోదా అంశానికి, మళ్లీ రెక్కలు రావడం ఆసక్తికరంగా మారింది. తమకు 23 మంది ఎంపీలను ఇస్తే, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని.. ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన హామీకి, ఏపీ జనం గంపగుత్తగా ఓటేశారు. మూడు ఎంపీ స్థానాలు మినహా, అన్ని స్థానాలూ గంపగుత్తగా వైసీపీకే కట్టబెట్టారు.
కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నందున, హోదా ఇవ్వండని అభ్యర్ధించడం తప్ప మరేమీ చేయలేమని, సీఎం జగన్ తన తొలి-తుది మీడియా భేటీలో తన నిస్సహాయత వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే ప్రత్యేక హోదా అంశం, మళ్లీ ఓ రాజకీయ అంశంగా తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల వేళ ఏపీకి ప్రత్యేక హోదా అంశం, మళ్లీ చిన్నగా రాజుకుంటోంది. హోదా కోసం తాము పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతామని, వైసీపీ పార్లమెంటరీపార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్య.. ఏపీ రాజకీయాలను కొత్త మలుపు తిప్పేందుకు కారణమయింది. రాజ్యసభ సాక్షిగా.. హోదా అనేది గతించిన అంశం కాదన్నారు. బీజేపీ చెబుతున్నట్లు, దానిని చరిత్రలో కలవనివ్వబోమని విజయసాయి స్పష్టం చేశారు.
దానితోపాటు.. మెట్రో ప్రాజెక్టుల అంశంలోనూ, కేంద్ర వైఖరిని విజయసాయిరెడ్డి తూర్పారపట్టడం విశేషం. మెట్రో ప్రాజెక్టులపై కేంద్రం, ఏపీపై సవతిప్రేమ చూపుతోందని నిరసన వ్యక్తం చేశారు. విశాఖ మెట్రో ప్రాజెక్టుకు, కనీసం 20 శాతం నిధులివ్వాలని గళమెత్తారు. ఈ విషయంలో ఆయన, ఏపీకే చెందిన బీజేపీ ఎంపీ జీవీఎల్పైనా సభలో విమర్శలు కురిపించడం చర్చనీయాంశమయింది.
నిజానికి పార్లమెంటు సమావేశాల ప్రారంభం తర్వాత.. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతామని, విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. నిజంగా ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడితే, బీజేపీ రాజకీయంగా ఇరకాటంలో పడుతుందన్న దిశగా చర్చ జరిగింది.
అయితే ఇప్పటిదాకా కేవలం రెండు ప్రైవేట్ మెంబర్ బిల్లులు మాత్రం సభలో వచ్చాయని, విజయసాయి ప్రకటన కేవలం బీజేపీని బెదిరించడానికేనని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్య, బీజేపీని అప్రమత్తం చేసింది. వివేకా హత్య కేసులో విచారణను సీబీఐ దూకుడు పెంచిన సమయంలో, విజయసాయి ఇలాంటి ప్రకటనలు చేయడం మంచిదికాదని, అవి బీజేపీని బెదిరించేలా ఉన్నాయన్న అనుమానాలకు తావిస్తుందని రఘురామకృష్ణంరాజు హితవు పలికారు.
దీనితో రంగంలోకి దిగిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్.. హోదాపై దాడి చేస్తున్న వైసీపీపై, ఎదురుదాడి ప్రారంభించటం రసవత్తరంగా మారింది. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న వైసీపీ, ఇప్పుడే హోదా గురించి మాట్లాడటం వింతగా ఉందని సత్యకుమార్ విరుచుకుపడ్డారు.
అభివృద్ధి-అవినీతిపై మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, కేసుల కోణంలో చూసే సంస్కృతి బీజేపీకి లేదని స్పష్టం చేశారు. సీబీఐ కేసుల నేపథ్యంలో వైసీపీ నేతలు కొత్తగా మాట్లాడుతున్నారేమోనని ఆయన అసలు విషయాన్ని వెల్లడించారు. దీన్నిబట్టి కేవలం బీజేపీని బెదిరించేందుకే, వైసీపీ హోదా అంశాన్ని తెరపైకి తీసుకువచ్చినట్లు స్పష్టమవుతోందని, బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు.
అటు బీజేపీ సీనియర్లు సైతం, వివేకా హత్య కేసు విచారణ వేగం అందుకున్న సమయంలో.. వైసీపీ ఇలాంటి వ్యూహాలు పన్నడం, కేవలం తమ పార్టీని బెదిరించేందుకేనన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది టిట్ ఫర్ టాట్ మాదిరిగా కనిపిస్తోంది. మీరు సీబీఐ విచారణలో ఒక అడుగు ముందుకేస్తే, మేం హోదాపై రెండు అడుగులు ముందుకేస్తాం అన్నట్లు వైసీపీ వైఖరి ఉందని బీజేపీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.
‘‘ వివేకా కేసు విచారణలో సీబీఐని నియంత్రించాలన్న వైసీపీ కోరికను వారు ఈ విధంగా పరోక్షంగా హోదా పేరుతో వ్యక్తీకరిస్తున్నట్లు ఉంది. కేసు విచారణ తీవ్రత పెంచితే, తాము కూడా ప్రత్యేక హోదా డిమాండ్ గళం పెంచుతామని చెప్పకనే చెబుతున్నట్లు స్పష్టమవుతోంది. అందుకే ఇప్పటిదాకా హోదా గురించి మాట్లాడని వైసీపీ, ఇప్పుడు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టేంతవరకూ వెళుతోంది. అయినా హోదాపై వైసీపీ ఇప్పటిదాకా ఏం చేసిందో, మా పార్టీ విమర్శించాల్సిన పనిలేదు. టీడీపీ చాలాకాలం నుంచీ అదే పనిలో ఉంది కదా’ అని ఓ బీజేపీ సీనియర్ నేత విశ్లేషించారు.
ఈ అంశంలో తమ పార్టీ ఎంత తక్కువ మాట్లాడితే తమకు అంత మంచిదని, రాజకీయంగా అది తమకు నష్టమన్న భావన బీజేపీలో వ్యక్తమవుతోంది. వైసీపీ హోదా నాటకంపై టీడీపీ ఎంతవరకూ వెళుతుందో చూడాలని ఓ బీజేపీ అగ్రనేత వ్యాఖ్యానించారు.