– సజ్జల వ్యాఖ్యలకు అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య కౌంటర్
తపస్సు చేసి శివుని మెప్పించి వరం పొందిన భస్మాసురుడు అనే దానవరాజు ఇచ్చిన వరం నిజమో, కాదో తేల్చుకునేందుకు శివుని నెత్తిన చెయ్యి పెట్టే ప్రయత్నం చేశాడని, ఎంత వారించినా వినలేదని, ఆఖరికి తాను కాలే దాకా గంతులు వేస్తూ శివుని వెధించాడని, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి పై పదేపదే చేసే వ్యాఖ్యలు కూడా అలాంటివే అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అభివర్ణించారు. శుక్రవారం ఆయన మీడియాకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేంద్రం రాజ్య సభలో చేసిన ప్రకటనపై కూడా తప్పుడు సంకేతాలు ఇచ్చేలా మాట్లాడటాన్ని ఆయన తప్పుపట్టారు.అమరావతి మాటకు ముందు చంద్రబాబు, అమరావతి మాటకు వెనుక చంద్రబాబు నామధేయాన్ని జపించే సజ్జలకు అమరావతిలో చంద్రబాబు కనిపించటంలో ఆశ్చర్యం లేదు అని అభివర్ణించారు.
2019కి ముందు ప్రతిపక్ష హోదాలో ఇల్లు కట్టుకున్నామని, కార్యాలయం పెట్టుకున్నామని, చంద్రబాబు కంటే మిన్నగా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పిన మాటలన్నీ ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఏక గ్రీవ తీర్మానానికి ఎందుకు ఓటేశారు అని గుర్తు చేశారు. అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడ చెప్పింది? కేంద్ర అఫిడవిట్ ను వక్రీకరించారు? అంటూ వ్యాఖ్యలు చేయటం రాజధానిపై ప్రభుత్వ కుట్రలో భాగమే అని అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతి విధ్వంసం అంటే 2 కోట్ల 80 లక్షల జనాభా కలిగిన మధ్యాంధ్ర విధ్వంసం అని, ఒక ప్రాంతాన్ని హననం చేయటమే అని గుర్తు చేశారు.రైతుల ఉద్యమానికి, రాష్ట్ర హైకోర్టు తీర్పుకి వక్ర భాష్యాలు చెప్పిన వైకాపా నాయకులు కేంద్ర అఫిడవిట్ కు భాష్యాలు చెప్పటంలో వింతేముంది? అన్నారు.
విభజన చట్టం, ఆనాటి శివరామయ్య కమిటీ సిఫార్సులు, నాటి ప్రభుత్వ కాపిటల్ నోటిఫికేషన్, కేంద్ర ఇచ్చిన డబ్బులు వంటి అంశాలు నిజాలు కావా? అని ప్రశ్నించారు.అంపశయ్యపై ఉన్న వైకాపా పార్టీ మూడు రాజధానితో ఊపిరి పోసుకోలేదని తేల్చి చెప్పారు. రాజధాని పేరుతో విశాఖ రుషికొండ పై కొంగర మల్లయ్యలా కూర్చుంటే ఓట్లు వస్తాయనే వైకాపా భ్రమలు దింపుడు కల్లం ఆశలే అని బాలకోటయ్య స్పష్టం చేశారు.