-అభ్యర్థులను బలపరిచారని కడప, కర్నూలలో ఏడుగురిని పోలీసులు కిడ్నాప్ చేయడం దుర్మార్గం
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది. పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలు సృష్టిస్తున్నారు. పోటీలో ఉన్న స్థానిక సంస్థల అభ్యర్థులపై బెదిరింపులకు పాల్పడటం వైసీపీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. అభ్యర్థులను బలపరిచిన వారిని పోలీసులే మాయం చేయడం ఒక్క జగన్ పాలనలోనే చూస్తున్నాం.
ఎమ్మెల్సీ అభ్యర్థులను బలపరిచినందుకు కడపలో ముగ్గురు, డోన్ లో నలుగురిని కిడ్నాప్ చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన బోన్ చెరువుపల్లి ఎంపీటీసీ ఆలా శేఖర్, బేతంచర్ల కౌన్సిలర్లు పూజారి రామాంజనేయులు , నంద్యాల మధు, గోపాల్ లను పోలీసులు వేధించడం అప్రజాస్వామికం.
నిన్న అర్ధరాత్రి వారిని స్టేషన్ కు తీసుకెళ్లి ఇంతవరకూ వారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. కిడ్నాప్ కు పాల్పడ్డ వైసీపీ నేతలు, వారికి సహకరించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగేలా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి.