Suryaa.co.in

Andhra Pradesh

హత్య తో సంబంధం లేకపోతే గ్యాగ్ ఆర్డర్ ఎందుకు తెచ్చారు?

-ఇతరుల వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావన ఎందుకు… ఎదుటివారి వ్యక్తిత్వ హననం సిగ్గుచేటైన చర్య
-సునీతమ్మను చంపకపోవడం వల్లే కోర్టు నాశ్రయించిందన్న సంకేతాలను సమాజానికి ఇస్తున్నారా?
-అమాయకంగా నటించినంత మాత్రాన దుర్మార్గుడిని మంచివాడని అనుకుంటారా?
-పార్టీ పేరుతో ప్రభుత్వ పథకాల అమలుకు అనుమతి ఇస్తారా?
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో ఎటువంటి సంబంధమే లేకపోతే కుటుంబ సభ్యుడిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానం నుంచి గ్యాగ్ ఆర్డర్ ను ఎందుకు తీసుకువచ్చారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్య ది నారాసుర రక్త చరిత్రయితే, జగన్మోహన్ రెడ్డి గ్యాగ్ ఆర్డర్ ను తీసుకు రావలసిన అవసరమేముందని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఆరోపిస్తున్నట్లుగా వివేకాను హత్య చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు కాదన్న నిజం వెలుగులోకి వస్తే, దాని ప్రభావం ఎన్నికల పైన తీవ్రంగా ఉంటుందని భావించే, తనని చంపాలని చూశారు… తన చిన్నాన్న చంపేశారని పదే పదే పేర్కొంటూ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందారని తెలిపారు. అందుకే, వైఎస్ వివేక హత్య గురించి ఎవరు మాట్లాడకుండా, జగన్మోహన్ రెడ్డి గ్యాగ్ ఆర్డర్ ను కోర్టు నుంచి పొందారన్నారు. శనివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియాతో మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి గ్యాగ్ ఆర్డర్ తీసుకురావడం వెనుకనున్న మతలబెమిటో అర్థం చేసుకున్న వారికి అర్థం చేసుకున్నంత అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. వైయస్ వివేకాను ఆయన రెండవ భార్య, కుమార్తె, అల్లుడు ఎందుకు చంపి ఉండకూడదన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.

ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి ల ద్వారా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంపించి ఉండవచ్చు కదా అని సజ్జల ఆరోపించడం కూడా విడ్డూరంగా ఉందన్నారు. రెండవ కుటుంబం నేరం అన్నట్లుగా సజ్జల చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే, వైయస్ వెంకట్ రెడ్డికి, వైయస్ రాజారెడ్డి కి రెండు కుటుంబాలు ఉన్నట్లుగా విస్తృతంగా ప్రజల్లో ప్రచారంలో ఉందన్నారు. వైఎస్ వివేకా రెండవ కుటుంబంతో కాపురం చేయడం సజ్జల రామకృష్ణారెడ్డి చూశారా అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, గతంలో రాజారెడ్డి ని కూడా హత్య చేయడం జరిగిందని, ఆ హత్య ను కూడా రెండవ కుటుంబం వారే చేశారని అంటే ఎలా ఉంటుందని, ఎబ్బెట్టుగా ఉండదా అని నిలదీశారు. ఇతరుల వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావన ఎందుకని, వ్యక్తిత్వ హననం సిగ్గుచేటైనా అని మండిపడ్డారు. వైఎస్ వివేక హత్యను ఆయన రెండవ కుటుంబానికి ముడి పెట్టడం అవసరమా అని ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, ఈ దిశగా సజ్జలను ప్రేరేపించిన వారి మానసిక దౌర్భాల్యాన్ని తెలియజేస్తోందన్నారు. వైయస్ వివేక హత్యకు ముందు వైయస్ భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ లేనే లేరని సజ్జల పేర్కొనడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు. వైఎస్ వివేక హత్యకు ముందు భాస్కర్ రెడ్డి ఇంట్లో హత్యలో పాల్గొన్న నిందితులంతా సమావేశమయ్యారని గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా సిబిఐ పేర్కొంటుంటే… దానికి భిన్నంగా సజ్జల వ్యాఖ్యలు చేయడం, దానికి మద్దతుగా భరత్ యాదవ్ స్టేట్మెంట్ ను సాక్షి ప్రచురించడం విడ్డూరంగా ఉందన్నారు. వైయస్ వివేకాను సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి హత్య చేశారని ప్రస్తావించిన భరత్ యాదవ్, అచ్చంగా సజ్జల మాట్లాడినట్లే మాట్లాడారన్నారు.

మనం సమాజానికి ఇస్తున్న సంకేతం ఏమిటి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకొని ఉంటే డాక్టర్ సునీత సుప్రీంకోర్టులో కేసు వేసి ఉండేవారా? అని పేర్కొనడం ద్వారా, సమాజానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఇస్తున్న సంకేతం ఏమిటని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. సునీతను తాము ఏమైనా చేయగలమని చెబుతున్నారా?, సుప్రీంకోర్టును మేనేజ్ చేసే సామర్థ్యం తమకున్నప్పటికీ, మేనేజ్ చేయకపోవడం వల్లే కేసు వేయగలిగిందని పరోక్షంగా పేర్కొంటున్నారా??, సునీతను లేపేయకపోవడం వల్లే సుప్రీంకోర్టును ఆశ్రయించగలిగిందని పరోక్షంగా ప్రస్తావిస్తున్నారా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. మూడు నెలలపాటు సిట్ చేత దర్యాప్తు జరిపించిన గత ప్రభుత్వం సాధించింది ఏమిటని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించడం చూస్తే నవ్విపోదురు కాక… అన్నట్లుగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రెండు నెలల పాటే సిట్ పోలీసులు కేసు దర్యాప్తు నిర్వహించారని, అంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిందని గుర్తు చేశారు.అయినా తొమ్మిది నెలల పాటు దర్యాప్తు చేసిన ప్రస్తుత ప్రభుత్వం కేసును ఒక కొలిక్కి ఎందుకు తీసుకు రాలేకపోయిందని నిలదీశారు. వైఎస్ వివేకా హత్య తో నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కి, శివ ప్రసాద్ రెడ్డికి, ఆయన రెండవ కుటుంబానికి సంబంధం ఉండి ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహించిన సిట్ పోలీసులు ఎందుకు వెలుగులోకి తీసుకు రాలేదని ప్రశ్నించారు.

కేసు దర్యాప్తు అధికారులైనా అమిత్ గార్గ్, అభిషేక్ మహంతి బదిలీ వెనుక ఆంతర్యం ఏమిటో అందరికీ తెలిసిందేనన్నారు. తొమ్మిది నెలల పాటు దర్యాప్తు నిర్వహించి కేసు పురోగతి సాధించకపోగా, సిబిఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డడం ప్రజలందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. ఆదినారాయణ రెడ్డి ఫోన్ కాల్ డాటా ను సీబీఐ ఎందుకు పరిశీలించలేదని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్న రఘురామకృష్ణం రాజు, వైఎస్ వివేక హత్యతో సజ్జలకు సంబంధం లేదు కాబట్టి , ఆయన ఫోన్ కాల్ డాటా ను సిబిఐ అధికారులు పరిశీలించలేదని, అలాగే ఆదినారాయణ రెడ్డి ఫోన్ కాల్ డాటాను పరిశీలించలేదన్నారు. వైయస్ వివేకాను హత్య చేసింది ఎవరో… రక్తపు మరకలను తుడ్చింది ఎవరో స్పష్టంగా తెలిసిన తరువాత ఇంకా బుకాయించాలని చూడడం, ఇతరుల పైన హత్య నేరాన్ని నెట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. వైఎస్ వివేకా బావమరిది శివప్రసాద్ రెడ్డి గుండెపోటు అని చెప్పారన్న సజ్జల వ్యాఖ్యలకు రఘురామకృష్ణం రాజు దీటుగా కౌంటర్ ఇచ్చారు. వైఎస్ వివేక వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి, ఎర్ర గంగిరెడ్డి లు కలిసి గుండెపోటు డ్రామా ఆడి అదే విషయాన్ని శివప్రసాద్ రెడ్డికి చెప్పారని, వీళ్లు చెప్పిన విషయం నమ్మి ఆయన గుండెపోటుతో మరణించినట్లుగా ఫోన్ ద్వారా ఇతరులకు సమాచారం అందించారన్నారు. ఒళ్లంతా చీరేసి, కుట్లు వేశాక కూడా అనుమానస్పద మృతి అని అవినాష్ రెడ్డి చెప్పడం, ఆ తర్వాత విజయసాయిరెడ్డి గుండెపోటుతో మరణించారని పేర్కొనడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఒకవేళ మీరన్నట్లుగానే ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవిలు హత్య చేస్తే, మీరెందుకు రక్తపు మరకలను తుడిచి, గాయాలకు కుట్లు వేశారని ప్రశ్నించారు. ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి లు మేము హత్య చేస్తాం… మీరు రక్తపు మరకలను తుడిచి వేయండి అని చెప్పారా అంటూ అపహాస్యం చేశారు.

సీబీఐ చంద్రబాబు అదుపు ఆజ్ఞలలో ఉందట!
రాష్ట్రంలో సీబీఐ ని చంద్రబాబు నాయుడు అడుగుపెట్టనివ్వడం లేదని, తామే సిబిఐ దర్యాప్తు కోరామని చెప్పిన వారే ఇప్పుడదే సిబిఐ చంద్రబాబు నాయుడు అదుపు ఆజ్ఞలలో పని చేస్తుందని పేర్కొనడం సిగ్గుచేటని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. సిబిఐ దర్యాప్తుకు మోకాలు అడ్డెందుకు ఎన్ని ప్రయత్నాలు చేశారో అందరికీ తెలుసునన్నారు. సాక్షులను ఎంతగా ప్రభావితం చేశారో, వారి చేత ఎలా తప్పుడు వాంగ్మూలాలను ఇప్పించారో, సిబిఐ అధికారి రామ్ సింగ్ పై గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి చేత ఫిర్యాదు ఇప్పించి కేసులు నమోదు చేయించారో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారన్నారు. సాక్షి దినపత్రికలో పైత్యపు కథనాలను రాసుకొని, మన పార్టీ సభ్యులను మభ్య పెట్టాలని అనుకుంటే నిజము దాచేస్తే దాగుతుందా అని ప్రశ్నించారు. మనకు మనమే మన లేకితనం ద్వారా అన్ని విషయాలను బయటపెడుతున్నామని రఘురామకృష్ణం రాజు చెప్పారు. గూగుల్ టేక్ అవుట్ గురించి సజ్జల మాట్లాడుతూ టిడిపి టేక్ అవుట్ గా అభివర్ణించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సజ్జల కేవలం ప్రభుత్వ ప్రజా సంబంధాల సలహాదారుడని, సాంకేతిక సలహాదారుని సంప్రదిస్తే గూగుల్ టేక్ అవుట్ గురించి చెప్పి ఉండేవాడని ఎద్దేవా చేశారు. సజ్జల ఉద్యోగ ధర్మం నిర్వహించే క్రమంలో వ్యక్తిగతంగా తప్పులు చేస్తున్నారన్నారు. అధికారులు అపరాధ పరిశోధనలో భాగంగా గూగుల్ టేక్ అవుట్ సహాయంతో నిందితుల ఆనవాళ్లను గుర్తిస్తారని పేర్కొన్నారు.

జీవో నెంబర్ 1ని తీసుకొచ్చింది ఈ డకోటా ప్రభుత్వం కాదా?
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ డకోట ప్రభుత్వం ఉందని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు . సభలు సమావేశాలు నిర్వహించకుండా జీవో నెంబర్ 1 ని తీసుకువచ్చింది ఈ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. తనని గత మూడు ఏళ్లుగా తన నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా చెత్త కేసులు బనాయించి వేధిస్తున్నది ఈ ప్రభుత్వమే కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనని అకారణంగా అరెస్టు చేసి పోలీసుల చేత కొట్టించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆ వీడియోను తిలకించి ఆనందించింది నిజం కాదా అంటూ నిలదీశారు. అమాయకుడి మాదిరిగా నవ్వుతూ ఫోటోలు దిగినంత మాత్రాన దుర్మార్గుడిని మంచివాడని అనుకుంటారా అని ప్రశ్నించారు. రౌడీలు రౌడీల లాగా ఉండాలని, తామేదో ప్రజాస్వామ్య పరిరక్షకులమన్నట్లు గా బిల్డప్ ఇవ్వవద్దన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నామని చెప్పుకునే వారే ఇన్ని దారుణ మారణకాండలు చేస్తే, వారిని ప్రజాస్వామ్య పరిరక్షకులని ఎలా అంటారని నిలదీశారు.

గన్నవరం రాకపై పట్టాభిని ఐదు రోజులు విచారించాలట…!
గన్నవరం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఎందుకు వచ్చారనేదానిపై ఐదు రోజులపాటు విచారించాలని పోలీసులు కోరడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు విరుచుక పడ్డారు . గన్నవరంలో పట్టాభి కి పని ఏమిటని కొంత మంది ప్రశ్నించడం వారి అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. పట్టాభి, తెలుగుదేశం పార్టీలో ఒక కీలక నాయకుడని, రానున్న ఎన్నికల్లో అవకాశం లభిస్తే గన్నవరం నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్నారు. అయినా, అది టిడిపి అంతర్గత వ్యవహారమని, దాని గురించి ప్రశ్నించడానికి మనం ఎవరమంటూ రఘురామకృష్ణం రాజు నిలదీశారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుయాయులు పట్టాభిని మంచిగా మాట్లాడమని కోరినప్పటికీ, ఆయన పరుషంగా మాట్లాడడం వల్లే కోపం తో టీడీపీ ఆఫీస్ పై దాడి చేసి, వాహనాలకు నిప్పు పెట్టామని చెప్పడమే ప్రజాస్వామ్య పరిరక్షణ అంటారా? అని ప్రశ్నించారు..

పిలిచినప్పుడు రాకుండా… పిలవనప్పుడు హాజరుకు సిద్ధమంటారా?
వైయస్ వివేక హత్య కేసు విచారణలో భాగంగా వైయస్ భాస్కర్ రెడ్డికి ఇప్పటికే సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేసి ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరగా , తాను అందుబాటులో ఉండడం లేదని చెప్పిన విషయం తెలిసిందేనని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. అయితే ఈనెల 25వ తేదీన విచారణకు హాజరు కావాలని సిబిఐ అధికారులు పేర్కొన ముందే , హాజరు కావాలని చెప్పారని భాస్కర్ రెడ్డి అందుబాటులో ఉన్నారంటూ నీలి మీడియా ఛానల్స్ లీకులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. సీబీఐ విచారణకు హాజరు కావాలని అధికారులు కోరినప్పుడు తాను బిజీగా ఉన్నానని చెప్పడానికి ఇటువంటి సాకులను వెతుకుతున్నారని, ఇది బెడిసి కొట్టే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు. మరో వారం రోజుల వ్యవధిలో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ కోర్టులో విచారణకు రానుందని, అప్పుడు మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. వైఎస్ వివేక హత్య కేసులో ఎవరి అరెస్టులు జరగకపోవడం వల్ల తాడేపల్లి ప్యాలెస్ లో అంతా ప్రశాంతంగా ఉన్నారని, వారాంతం కావడం వల్ల ఇటు సిబిఐ అధికారులు కూడా ప్రశాంతంగా ఉన్నారన్నారు.

ఇంకో వార్త లేదా?… ఈనాడు ప్రతుల దగ్ధం గురించి అంతగా రాయాలా??
మరే వార్త లేనట్టుగా ఈనాడు ప్రతులను పలుచోట్ల దగ్ధం చేశారని సాక్షి దినపత్రికలో మొదటి పేజీ కథనంగా ప్రచూరించడం జర్నలిజం విలువలకే మాయని మచ్చ అని రఘురామకృష్ణం రాజు అభిప్రాయపడ్డారు. జర్నలిజంలో ఫైల్ ఫోటో అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందని, ఈనాడు దినపత్రిక పట్టాభి ఫోటో ప్రచురణలో అదే విధానాన్ని అనుసరించిందన్నారు. గతంలో పట్టాభిని అరెస్టు చేసి కొట్టారని ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. గతం లో వేసుకున్న చొక్కాలో ఉన్నప్పుడే, ప్రస్తుతం అరెస్టు చేసి ఉండడం వల్ల ప్రస్తుత ఫోటో అనుకొని గతంలో ఫోటో వాడి ఉంటారని చెప్పారు. దానికే సాక్షి దినపత్రిక జర్నలిజం విలువల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సాక్షి దినపత్రికలో తేదీ, వారం తప్పితే అన్ని అబద్ధాలేనని విమర్శించారు. గన్నవరం ఎందుకు వచ్చారనే దానిపై పట్టాభిని ఐదు రోజులపాటు విచారించాలని పోలీసులు కోరడం విస్మయాన్ని కలిగిస్తోందన్న ఆయన, ఈ ఐదు రోజులపాటు పోలీసు లాకప్ లో చిత్రహింసలు పెట్టాలని భావించి ఉండి ఉంటారన్నారు.

పార్టీ నైనా రద్దు చేయండి… అధ్యక్ష పదవికి ఎన్నికలైనా నిర్వహించండి
తమ పార్టీనైనా రద్దు చేయాలని, లేకపోతే అధ్యక్ష పదవికి ఎన్నికలైనా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ కు రాసిన లేఖలో రఘురామకృష్ణం రాజు కోరారు. గత ఏడాది జూలై మాసంలో శాశ్వత జీవితకాల అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించారని, పార్టీ రాజ్యాంగం ప్రకారం ఆ ఎన్నిక చెల్లదని పేర్కొన్నారు. శాశ్వత జీవితకాల అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించడం వల్ల తనతోపాటు పలువురు పోటీ చేయలేకపోయారని వెల్లడించారు. తమ పార్టీ పేరు ఏమిటి అన్నది తెలియజేయాలని రఘురామకృష్ణం రాజు ఎన్నికల కమిషన్ ని కోరారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా ఉన్న తమ పార్టీ పేరును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీగా మారుస్తున్నట్లు గత ఏడాది జరిగిన ప్లీనరీలో తీర్మానించారని తెలిపారు. తమ పార్టీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 55 సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, పార్టీ పేరుతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి అనుమతి ఇస్తారా అంటూ ప్రశ్నించారు.

ఒకవేళ అనుమతి ఇస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్లో ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్లు కాదా అని నిలదీశారు. తమ పార్టీ ప్రధాన కార్యదర్శులకు, ప్లీనరీకి హాజరైన లక్షన్నర మందికి ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలియదని కానీ తమ పార్టీ అధ్యక్షుడికి మాత్రం మూడున్నర నెలల తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థ స్ఫుర ణకు వచ్చిందని ఎద్దేవా చేశారు. జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటించినప్పుడు ముసిముసి నవ్వులు నవ్విన జగన్మోహన్ రెడ్డి, మూడున్నర నెలల తర్వాత తూచ్… ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని శాశ్వత జీవితకాల అధ్యక్ష పదవిని త్యజించారని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారన్నారు. పార్టీ అధ్యక్ష పదవికి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే తనతో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లు పోటీ చేస్తారేమోనని చెప్పారు. తనని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే పోటీ చేస్తానన్న ఆయన, పార్టీలో ఉంచుకోవాలని కోరే అధికారం తనకు లేదని చెప్పారు. ఇక పత్రికల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని, ఈ నిధులతో గ్రామ సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు కేవలం సాక్షి దినపత్రికను మాత్రమే కొనుగోలు చేస్తూ ఆ పత్రిక సర్కులేషన్ కు దోహదపడుతున్నారన్నారు. ప్రభుత్వ నిధులతో ఇతర పత్రిక లేవైనా కొనుగోలు చేశారా అన్న దానిపై ఆరా తీయాలని కోరారు.

LEAVE A RESPONSE