– నిధులు తేలేని అసమర్థ ఎమ్యేల్యేను నిలదీయండి
– వచ్చేది బిజెపి ప్రభుత్వమే బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప
బిఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్లలో ఒక్కటంటే ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా పేదల కడుపు కొడుతున్నాడని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప అన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ ముగింపు సభలో జిల్లా అధ్యక్షురాలు జయశ్రీ, మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి, పార్లమెంట్ ఇన్చార్జి రవికుమార్ గౌడ్ తో కలిసి మాట్లాడారు. ప్రజా పరిపాలన గాలికొదిలేసి, కుటుంబ పరిపాలన కొనసాగిస్తూ బిడ్డను లిక్కర్ స్కామ్లో, మంత్రి ఇరిగేషన్ స్కామ్ లో, కొడుకును ఐటి స్కామ్లో దించి వేల కోట్లు వెనకేసుకున్నారే తప్ప, సగటు పేదవాడి తెలంగాణ ప్రజల బాగోగులను పట్టించుకోవడం పూర్తిగా విఫలమయ్యారన్నారు. దొర గడీల పాలన నాలుగునెలల్లో బీజేపీ పార్టీ బద్దలుకొట్టి తెలంగాణ రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
స్త్రీట్ కార్నర్ మీటింగ్ ద్వారా ప్రజల గుండెల్లో కి బీజేపీ వెళ్లిందని తద్వారా, బిజెపి స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ ఆదేశానుసారం ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త సైనికుల్లా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. నారాయణఖేడ్ లో ఫ్యాక్టరీలు కంపెనీలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతామని సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు డ్రామాలు ఆడారని, ఇప్పుడు బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ కోసం సీఎం ముఖ్యమంత్రి, మంత్రి హరీష్ రావు ఇద్దరు పోటాపోటీగా శంకుస్థాపన కార్యక్రమాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న 6 లిఫ్ట్ ఇరిగేషన్ లకు రూ.30 కోట్లు ఇవ్వని ప్రభుత్వం కొత్తగా రూ.1774 కోట్లతో బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, వాటి బాగు చేయలేని అసమర్థ ఎమ్యేల్యే భూపాల్ రెడ్డి అని సంగప్ప ఆరోపించారు. గ్రామాలకు రోడ్లు బాగా లేక జనం ఇక్కట్లు పడుతుంటే ఎమ్యేల్యే తన భూములకు రోడ్లు వేసుకున్నాడని సంగప్ప ఆరోపించారు.
బీజేపీ వైపు తిరిగితే కల్యాణలక్ష్మి, పెన్షన్ రాకుండా అడ్డుకుంటామని బెదిరిస్తున్నారని సంగప్ప ఆరోపించారు. ఇంకో కొన్ని నెలల్లో జరిగే ఎన్నికల్లో బిజెపి సర్కార్ రాష్ట్ర రాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. మీటింగ్ లో మాజీ ఏమ్యేల్యే విజయ్ పాల్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ రవికుమార్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, సీనియర్ నాయకులు మారుతి రెడ్డి, సాయిరామ్, రామకృష్ణ, రాథోడ్ సంతోష్, సంజు పాటిల్, సుధాకర్, రాజు గౌడ్ తో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.