Suryaa.co.in

Andhra Pradesh

175 కాకపోతే 500 స్థానాల్లో పోటీ చేసుకోండి

-ఓపిక ఉంటే పక్క రాష్ట్రాల్లోనూ పోటీ చేసుకోండి
-ప్రతిపక్షాల అజెండా ముఖ్యమంత్రికి ఎందుకు?
-ముఖ్యమంత్రికి దమ్ములేకే ఐ ప్యాక్ మీద ఆధారపడుతున్నారు
-రాష్ట్రంలో ఏ రోడ్డు వేయాలో కూడా ఐ ప్యాక్ నిర్ణయిస్తోంది
-హెలికాప్టర్ వదిలి దమ్ముంటే రోడ్ల మీద పర్యటించాలి
-తెనాలిలో మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

తెనాలి : ప్రతిపక్షాల జెండా.. అజెండా గురించి అతిగా ఆలోచించడం మానేసి ముఖ్యమంత్రి దమ్ము చూపుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు. 175 కాకపోతే 500 స్థానాల్లో పోటీ చేసుకోవాలనీ, ఓపిక ఉంటే పక్క రాష్ట్రాల్లోనూ పోటీ చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రికి దమ్ము లేదు కాబట్టే వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి ప్రభుత్వ కార్యక్రమాలో రాజకీయ కక్షలు రెచ్చేగొట్టే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రతి అంశంలోకీ ఐ ప్యాక్ వాళ్ళని తీసుకువచ్చి ప్రభుత్వానికి సమాంతర వ్యవస్థను నిర్మిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే సామాన్య ప్రజల దగ్గరకు వచ్చి సమస్యలు తెలుసుకోవాలని సవాలు చేశారు. తెనాలిలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ముఖ్యమంత్రి తెనాలి పర్యటన గురించి రాష్ట్రం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎందుకు చూసింది. ముఖ్యమంత్రి ఖచ్చితంగా నియోజకవర్గానికి పనికి వచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటిస్తారని ప్రజలు భావించారు. చిరు వ్యాపారులు, సామాన్యులు పర్యటించే రహదారిపై సీఎం పర్యటిస్తే మార్పు వస్తుందని తెనాలి ప్రజలు ఎదురు చూశారు. ముఖ్యమంత్రి హడావిడిగా హెలికాప్టర్లో వచ్చి వెళ్లిపోయారు. గతంలో తెనాలి – మంగళగిరి మధ్య ప్రయాణానికి 30 నిమిషాలు సమయం పట్టేది. ఇప్పుడు గుంతల వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రయాణ సమయం కూడా గంటకు పైగానే పడుతోంది. రోడ్డుకు కనీసం మరమ్మతు చేయించే దిక్కులేదు. మరమ్మతులు చేసేందుకు ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లను చిన్న చిన్న బిల్లులకు కూడా ఇబ్బందులు పెడుతున్నారు.

ముఖ్యమంత్రి చేసిన ప్రకటనల్లో ఎన్ని నెరవేర్చారో చెప్పాలి : ప్రజల్లో ముఖ్యమంత్రికి నిజంగా ఆదరణ ఉంటే 151 స్థానాల్లో గెలిపించారుగా. ఆయన్ని చూసేందుకు, ఏం చెబుతారో వినేందుకు సహజంగానే జనం రావాలి. ఆయన దుమ్ము లేపుకుంటూ హెలికాప్టర్లో వచ్చి భద్రతా కారణాల పేరుతో ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టే విధంగా వచ్చి వెళ్లారు. వాలంటీర్లను పెట్టి జనాన్ని బెదిరించి మరీ తరలించారు. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలను బెదిరించి స్కూళ్లు మూసివేయించి మరీ బస్సులు పెట్టి తీసుకువచ్చారు. చివరికి సీఎం ఏం చెబుతారో వినకుండానే వృద్ధులతో సహా అంతా గోడదూకి వెళ్లిపోయిన పరిస్థితి. ఆయనేమో దమ్ముంటే రండి.. దమ్ముంటే రండి అంటారు. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే సామాన్య ప్రజల దగ్గరికి వచ్చి వారితో మాట్లాడాలి. సమస్యల మీద వినతులు తీసుకోవాలి. ఎందుకు ఎవరికీ కనబడకుండా హడావిడిగా వచ్చి వెళ్లిపోతారు. ముఖ్యమంత్రి పర్యటన ఉంది అంటే ఒక కసరత్తు జరగాలి.

జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు స్థానిక ప్రజా ప్రతినిధులతో మాట్లాడి ముఖ్యమంత్రి స్థానికంగా ఎలాంటి వరాలు ప్రజల మీద చల్లాలి అనేది కార్యక్రమం రూపొందించాలి. ఆ పరిస్థితులు ఎక్కడా కనబడడం లేదు. మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా పార్టీలకు అతీతంగా తెనాలిలో అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలి. స్పీచ్ అయిపోయాక ఏదో కాగితం తీసుకుని ప్రకటనలు చేసి ముఖ్యమంత్రి వెళ్లిపోయారు. గతంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనల్లో ఏ నియోజకవర్గాల్లో ఎన్ని పూర్తి చేశారో చెప్పాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

తెలంగాణలో కూడా వైసీపీ ఆఫీస్ ఉంది కదా : ఓటమి భయంలో సహనం కోల్పోయి ఆలోచనా విధానం మార్చేసుకుని ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే ఈ ముఖ్యమంత్రి ఎందుకు? జనసేన నాయకులు స్థానిక సమస్యల మీద శాంతియుతంగా మెమోరాండం ఇద్దామనుకుంటే ఉదయం ఆరు గంటలకే ఇళ్లకు వచ్చి అరెస్టులు చేశారు. అక్రమంగా నిర్భంధించారు. ముఖ్యమంత్రి ఉపన్యాసం వాస్తవానికి విరుద్దంగా ఉంది. మాట్లాడితే 175కి 175 పోటీ చేసి గెలుస్తామంటారు? 175 కాకపోతే 500 పోటీ చేసుకోండి. తెలంగాణలో మీ పార్టీకి కార్యాలయం ఉందిగా గతంలో అక్కడ ఎమ్మెల్యే, ఎంపీ గెలిచారు. అక్కడి నుంచి పోటీ చేయండి.

ప్రతిపక్షాల అజెండా మీకెందుకు? మా జెండా, అజెండా మాకున్నాయి. అభివృద్ధి చేస్తారని ఇంత భారీ మెజారిటీ ఇస్తే మీరు చేసేది ఇదా? ప్రతి దానికి ఐ ప్యాక్, ఐ ప్యాక్ అని ఓ సంస్థను తీసుకువచ్చి వాళ్లు చెప్పినట్టుగా పని చేయాలన్నట్టు వ్యవస్థల్ని తయారు చేశారు. చివరికి ఎక్కడ రోడ్డు వేయాలో కూడా వాళ్లే నిర్ణయిస్తారంట. ముఖ్యమంత్రి ఏ ప్రాంతంలో పర్యటించాలో కూడా వాళ్లు నిర్ణయిస్తారు. ఇక ప్రజాస్వామ్యానికి విలువ ఏముంది. ముఖ్యమంత్రి కార్యక్రమాల్లో ప్రజల్ని రెచ్చగొడుతూ, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి, కులాల మధ్య తగాదాలు పెట్టేందుకు వినియోగించుకుంటున్నారు. ఇలాంటి చర్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, పార్టీ నేతలు ఇస్మాయిల్ బేగ్, పసుపులేటి మురళీకృష్ణ, తోటకూర వెంకటరమణారావు, మధుబాబు, వెంకయ్య నాయుడు, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE