– ఇంటిపేరు ఒక వ్యక్తి గుర్తింపు కోసం ఉద్దేశించింది
రామాయణ మహాభారతాల్లో ఇంటిపేర్లు లేవు కదా, శ్రీకృష్ణదేవరాయలు, రుద్రమదేవి మొదలైన వారికి, ఆ పురాతన రాజుల యుగంలో కూడా ఇంటిపేర్లు ఉన్నట్టు చదవలేదు. మరి ఇంటిపేర్లు ఏ విధంగా, ఎప్పటి నుంచి వచ్చాయి?
కృష్ణదేవరాయలకు కూడా ఇంటిపేరు ఉందనే చెప్తారు కొందరు చరిత్రకారులు. ఆయనను అల్లసాని పెద్దన “సంపెట నరపాల” అని సంబోధించి ఉండడంతో ఇంటిపేరు సంపెట (లేక సమ్మెట) అయివుంటుందని ఊహిస్తున్నారు. ఇది ఎలా ఉన్నా కృష్ణరాయల బంధువులు, రాజోద్యోగులు, కవులు ఇలా ఎందరో ఇంటిపేర్లు స్పష్టంగానే చెప్పుకున్నారు. పెద్దన ఇంటిపేరు అల్లసాని, తిమ్మరుసు ఇంటిపేరు సాళువ.
కాకతీయ కాలంలో కూడా మనం గోన గన్నారెడ్డి అన్న వీరుడి పేరు, గోన బుద్ధారెడ్డి అన్న కవి పేరూ వినలేదా? మరి గోన ఇంటిపేరు కాదా? కొట్టరువు తిక్కన, పాల్కురికి సోమనాథుడు, నాచన సోమన, తాళ్ళపాక అన్నమయ్య వంటి కవులకు ఇంటిపేర్లు లేవూ?
మరీ అంతగా తెలియని 13వ శతాబ్దపు కవుల పేర్లు ఇంటిపేర్లతో సహా చెప్తున్నాను చూడండి: వెన్నెలకంటి అన్నయ్య, దూబగుంట నారాయణ కవి, పిడుపర్తి సోమన, బైచరాజు వెంకట నాథుడు. ఇక సింహాసనం ద్వాత్రింశిక అనువదించినది కొరవి గోపరాజు. ఇలా ఇబ్బడిముబ్బడిగా ఇంటిపేర్లతో ప్రసిద్ధులు అయ్యారు.
ఇంతవరకూ ఎందుకు నన్నయ కాలం నాడే పావులూరి మల్లన, వేములవాడ భీమకవి అంటూ ఊళ్లపేర్లు ఇళ్ళపేర్లుగా ప్రసిద్ధులు అయినవాళ్ళు ఉన్నారు.
అయితే, కృష్ణదేవరాయలు, రుద్రమదేవి వంటివారి ఇళ్ళపేర్లు ఎందుకు అంతగా తెలియదు అని ప్రశ్న రావచ్చు. ఇంటిపేరు అన్నది ఒక వ్యక్తి గుర్తింపు కోసం ప్రధానంగా ఉద్దేశించింది. యథావాక్కుల అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య అని విడివిడిగా ఇళ్ళపేర్లతో పిలిస్తే ఇద్దరి మధ్య తేడా తెలుస్తుంది కదా.
అయితే, చక్రవర్తులకు గుర్తింపుతో సమస్య ఏమిటి? కృష్ణదేవరాయలు అని అంటే ఏ కృష్ణదేవరాయలు అన్న ఎదురు ప్రశ్న రాదు. ఏ రుద్రమదేవి అయ్యా అని ఎవరూ ప్రశ్నించరు. అందువల్ల అంతటి సుప్రసిద్ధులను ఇంటిపేరుతో వ్యవహరించవలసిన అవసరం లేదు. అందుకే ఇంతటి ప్రబంధ సాహిత్యం వెలువడి, ఎన్నో కృతులు ఆయన పేరిట అంకితం అయితే ఎక్కడో ఒక మూల కవిత్వంలో అందంగా ఉండేలా “సంపెట నరపాల” అని వ్యవహరించాడే తప్ప సంపెట కృష్ణదేవరాయలు అని ఎవరూ మరి ఏ చోట అనలేదు.
కాబట్టి, అత్యంత సుప్రసిద్ధుల పేర్ల ముందు ఇంటిపేర్లు పెట్టి వ్యవహరించనంత మాత్రాన అసలు ఇంటిపేర్లు పూర్వం లేవని కాదు.
– పవన్ సంతోష్ సూరంపూడి
చరిత్ర చెప్పిన విషయం:
రుద్రమదేవి అమ్మగారి ఇంటిపేరు బేతరాజు వీరి ఇలవేల్పు కాకతి అమ్మవారు. ఓరుగల్లు. సూర్యవంశం క్షత్రియులు, గోత్రం కశ్యప. ఈమె భర్తది ధనుంజయ గోత్రం చాళుక్య వీరభద్రరాజు నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా. చంద్రవంశం రాజు.
కృష్ణ దేవరాయలు ఇంటి పేరు సంబెట, తులు రాజ్యములో పుట్టడం వలన సంపెట అయ్యింది. తులు భాషలో ‘బ’ ఉండదు. అక్షరములు తక్కువ. మన తెలుగులో సమ్మెట అని, గోత్రం అత్రేశ, చంద్రవంశము. యదువు, తుర్వశునిల సంతతి. వీరు యయాతి, దేవయానిల సంతానం.
– గూడూరు ఆంజనేయరాజు.