– 140 కోట్ల భారత జనాభాలో 26 కోట్ల మంది ‘అమెరికా స్థాయి సంపన్నులు’
ఎంపి విజయసాయిరెడ్డి
2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా ఇండియా అవతరిస్తుందని అంచనా. ఈ సందర్భంగా భారతదేశ ఆర్థిక చరిత్రపై అర్థశాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. మౌర్య చక్రవర్తులైన చంద్రగుప్తుడు, అశోకుడి కాలంలో (క్రీ.శ ఒకటో సంవత్సరం) ప్రపంచ స్థూల వస్తు సేవల ఉత్పత్తిలో (జీడీపీ) ఇండియా వాటా 32 శాతం అని ఆర్థిక చరిత్రకారులు అంచనావేశారు. అప్పుడు ప్రపంచ జనాభాలో మూడో వంతు జనం భారతదేశంలో నివసించేవారట.
ఇక ప్రస్తుత భారత ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే అనేక సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి. గత పదేళ్లలో భారతదేశ వినియోగదారుల మార్కెట్ సైజు దాదాపు రెట్టింపు అయి 2.1 లక్షల కోట్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది. అంటే 2012 నుంచి ఒక దశాబ్ద కాలంలో వినియోగదారుల మార్కెట్ రెట్టింపు అయింది. ప్రపంచంలో పదో అతిపెద్ద వినియోగదారుల మార్కెట్ స్థాయి నుంచి నేడు ఇండియా నాలుగో అతిపెద్ద వినియోగదారుల విపణి అయింది.
వచ్చే పాతికేళ్లలో దేశ జనాభా మరో 24 కోట్లు పెరుగుతుందని అంచనా. దీని కారణంగా 2047 నాటికి భారత వినియోగదారుల మార్కెట్ ప్రస్తుతమున్న సైజుకు 9 రెట్లు పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని అంచనావేస్తున్నారు. అప్పుడు భారత వినియోగదారుల మార్కెట్ సైజు 18.5 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుంది. మార్కెట్ విషయంలో ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత ఇండియా మూడో స్థానం ఆక్రమిస్తుంది. దేశ జనసంఖ్య పెరుగుతున్న కారణంగా వస్తుసేవలకు డిమాండు కూడా పెరుగుతూనే ఉంటుంది.
మార్కెట్ సైజుతో పాటు ఉపాధికి కూడా పెరగనున్న డిమాండ్!
పైన చెప్పినవన్నీ భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సానుకూల విషయాలు. భారత జనసంఖ్య పెరుగుదలతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం కూడా డిమాండ్ పెరుగుతుంది. 2047 నాటికి దేశంలో పనిచేసే వయసున్న జనాభా (15–64 మధ్య వయస్కులు) 110 కోట్ల మంది ఉంటారు. ఆర్థికాభివృద్ధి నిలకడగా సాగుతున్నా పనిచేసే వయసు జనులందరికీ ఉద్యోగాలు కల్పించడం కష్టమైన పనే. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వచ్చే పాతికేళ్లలో దేశంలో 23 కోట్ల ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుందని కొందరు అర్థశాస్త్రవేత్తల అంచనా. మరి కొత్త ఉద్యోగాలు భారీ సంఖ్యలో వచ్చేది సేవల రంగంలోనా? లేక తయారీ (మాన్యుఫ్యాక్చరింగ్) రంగంలోనా? అంటే– దీనిపై ఏకాభిప్రాయం లేదు.
ఇండియా ప్రధానంగా సేవలరంగంపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ప్రఖ్యాత బ్రిటిష్ అర్థశాస్త్రవేత్త, బ్రిటిష్ హౌసాఫ్ లార్డ్స్ సభ్యుడు లార్డ్ మేఘనాథ్ దేశాయి పేర్కొన్నారు. ఆయన ఆదివారం బిహార్ రాజధాని పట్నాలో తాను రాసిన ‘హౌ ఇకనామిక్స్ అబాన్డన్డ్ ద పూర్’ (అర్థశాస్త్రం పేదలను ఎలా విస్మరించింది?) అనే గ్రంథంపై జరిగిన చర్చలో పాల్గొంటూ, ‘డిజిటైజేషన్, ఇతర అంశాల కారణంగా ఇండియా సమర్ధ సేవలరంగంతో నడిచే ఆర్థిక వ్యవస్థలా రూపుదిద్దుకుంటోంది. కాని, ఇక్కడ తయరీ రంగంలో పెట్టుబడులు భారీగా వచ్చే అవకాశాలు అంతగా లేవు. సేవల రంగంలోనే ఉపాధి అవకాశాలు ఉన్నాయి,’ అని వివరించారు.
ఆధునిక టెక్నాలజీ ఉపయోగంలోకి వస్తున్న ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా సేవల రంగాలే అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. దేశాయి వెల్లడించిన ఆసక్తికరమైన విషయం ఏమంటే–భారత దేశ జనాభాలో 26 కోట్ల మంది సంపన్నులు అత్యంత సంపన్న అగ్రరాజ్యం అమెరికా జీవనశైలిని అనుసరించే ఆర్థిక సామర్ధ్యం సంపాదించారట. ఈ లెక్కన భారత స్వాతంత్య్ర శత వార్షికోత్సవాలు జరిగే 2047 నాటికి ఇండియాకు అనేకానేక అవకాశాలతోపాటు ఎదురయ్యే సవాళ్లను తట్టుకుని ముందుకు సాగడానికి అవసరమైన సామర్ధ్యం సమకూర్చుకోవాల్సి ఉంటుంది.