Suryaa.co.in

Telangana

సూర్య చంద్రులున్నంత వరకూ మహాత్మా ఫూలే నిలిచి ఉంటారు : మంత్రి గంగుల కమలాకర్

-పూలే ఆశయ సాధకుడు మన సీఎం కేసీఆర్ – మంత్రి గంగుల కమలాకర్
-బడ్జెట్లోనూ, పథకాల్లోనూ, అభివ్రుద్దిలోనూ బీసీలకు ప్రాధాన్యం – గంగుల
-కనీసం జనగణన, మంత్రిత్వశాఖ, రిజర్వేషన్లు కల్పించకుండా బీసీలను వెనుకకు నెట్టేస్తున్న కేంద్ర బీజేపీ – గంగుల
-రవీంద్రభారతిలో ఘనంగా మహాత్మా జ్యోతిభాపూలే 197వ జయంతి వేడుకలు
-హాజరైన మంత్రులు, బీసీ సంఘాలు, ఉన్నతాధికారులు, పెద్ద ఎత్తన ప్రజలు

మహాత్మా జ్యోతిభాపూలే ఆశయాలను ఆచరణాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆ మహనీయుని 197వ జయంతి వేడుకలను హైదరాబాద్ రవీంద్రభారతిలో నేడు ఘనంగా నిర్వహించింది, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన నిర్వహించిన జయంతి వేడుకల కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండాప్రకాష్, బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం క్రుష్ణమోహన్ రావు, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ సంఘాల నేతలు, పూలే అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మహాత్మా జ్యోతిభాపూలేకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహాత్మాజ్యోతిభాపూలేకు ఘనంగా నివాళులర్పించారు మంత్రి గంగుల కమలాకర్, అనంతరం మాట్లాడుతూ సూర్య చంద్రులున్నంత వరకూ మహాత్మ్యా జ్యోతిభాపూలే, సావిత్రీబాయి పూలేల స్పూర్తి వెల్లివిరుస్తుందని, ఆ గొప్పవ్యక్తుల ఆశయ సాధనలో ప్రతీ ఒక్కరు కలిసిరావాలన్నారు.

పత్రికలు, సెల్ ఫోన్లు లేని సమయంలోనే వెనుకబడిన వర్గాలపై సమగ్ర అధ్యయనంచేసి వారి అభ్యున్నతికి విశేషక్రుషి చేసిన మహనీయుడని, ఎందరో మహనీయులు పుట్టిన పవిత్ర దాత్రి భారతవనిలో బాబూ జగ్జీవన్ రాం, మహాత్మా జ్యోతిభాపూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు జన్మించిన ఎప్రిల్ మాసం మరింత పవిత్రమైనదన్నారు. ఆ గోప్ప వ్యక్తుల ఆశయ సాధనలో తెలంగాణ ముఖ్యమంత్రి విశేష క్రుషిచేస్తున్నాడని గుర్తు చేసారు. బాబాసాహెబ్ విగ్రహం మాదిరే మహాత్మా జ్యోతిభాపూలే విగ్రహాన్ని ఏర్పాటుకోసం మంత్రులందరం కలిసి ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకెళ్తామన్నారు. రెక్కాడితే కాని డొక్కాడని సాధారణ పేద బీసీ కుటుంభంలో జన్మించిన పూలే, తన కులవ్రుత్తినే ఇంటిపేరుగా మార్చుకొన్నారు, తన మిత్రుడైన బ్రహ్మణుల పెళ్లిలో ఎదుర్కొన్న వివక్షకు వ్యతిరేకంగా వెనుకబడిన వర్గాలకు సమాజంలో గౌరవం దక్కాలంటే జ్ణానసంపదతోనే సాధ్యమని నమ్మి బాలికా విద్యకు ప్రోత్సాహం అందించడానికి తన భార్యైన సావిత్రీబాయి పూలేకు విద్యనందించి తను నెలకొల్పిన స్కూల్లో ప్రపంచంలోనే మొదటి మహిళ్యా ఉపాద్యాయురాలిని చేసారని కొనియాడారు.

వెనుకబడిన కులాలకు, అతి శూద్రులకు విద్యను అందిస్తేనే ముందుకుపోతారని నమ్మి వారికోసం విద్యాలయాల్ని నెలకొల్పాడని, రాబోయే రోజుల్లో రాజ్యాధికారం దిశగా బీసీలను నడిపించేలా సమాజాన్ని జాగ్రుతం చేసాడన్నారు. నేటి తరం ఆ మహనీయుని జీవితాన్ని తెలుసుకొని స్పూర్తిని పొందాలని సూచించారు. నేను బీసీ బిడ్డను అని గర్వంగా చెప్పుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ బలహీనవర్గాల గొంతుకయ్యాడన్న మంత్రి గంగుల, నాడు కేవలం 19 గురుకులాలతో 7500మందికి మాత్రమే అరకొర వసతులతో అందించిన విద్యను నేడు మహాత్మా జ్యోతిభాపూలే పేరుతోనే 310 గురుకులాలను స్థాపించి 1 లక్షా 85వేల మందికి ప్రపంచస్థాయితో నాణ్యమైన విద్యను బోదిస్తున్న ఎకైక ప్రభుత్వం తెలంగాణది అన్నారు. బలహీనవర్గాల బిడ్డలు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే కూలికి వెల్లొచ్చిన ఆ తల్లిదండ్రుల మొఖంలో విరబూస్తున్న వెలుగులో కేసీఆర్ నిలిచిపోతాడన్నారు.

ఆసరా ఫించన్లు, కులవ్రుత్తులకు చేయూత, కళ్యాణలక్ష్మీ, బీసీ ఆత్మగౌరవ భవనాలు వంటి అనేక పథకాల ద్వారా బీసీలకు కేసీఆర్ సర్కార్ సింహబాగం అభివ్రుద్ది, సంక్షేమాన్ని అందిస్తుంటే మరోవైపు బీసీ ప్రధాని అని చెప్పుకొనే కేంద్ర ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని మంత్రి గంగుల కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏటేటా బీసీ బడ్జెట్ని పెంచుకుంటూ మొన్న 6300 కోట్లు కేటాయిస్తే కేంద్రంలో కనీసం బీసీ మంత్రిత్వ శాఖ సైతం లేకుండా 47లక్షల కోట్ల బడ్జెట్లో నికరంగా 2వేల కోట్లను కూడా బీసీలకు కేటాయించకపోవడం దారుణమైన వివక్ష అన్నారు. మన అకౌంట్లో ఎంతుందో లెక్కలు తీసుకునే ప్రభుత్వం బీసీ లెక్కలను తేల్చకపోవడం అన్యాయం అన్నారు. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కేంద్రం వెనుకకు నెట్టేస్తుందని, రాజ్యాంగబద్ద వాటా సాధనకోసం కులగణనను సైతం చేయకపోవడం అందుకు నిదర్శనమన్నారు. కేంద్ర వివక్షలపై పోరాడాలని బీసీలకు పిలుపునిచ్చారు మంత్రి గంగుల కమలాకర్.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈనాడు బీసీలు ఉన్నత చదువులు చదివి అంతో ఇంతో వివిద హోదాల్లో ఉండడానికి కారణం మహాత్మాజ్యతిభాపూలే అన్నారు. పూలే ఆదర్శాలతోనే బాబాసాహెబ్ అంబేద్కర్, సాహు మహారాజ్లు రిజర్వేషన్లను తీసుకొచ్చారన్నారు. గతంలో పట్టుమని పదిమందికూడా విద్యార్థులు లేని హాస్టళ్లలో నీళ్లచారుతో, ఉడకని అన్నంతో ఇబ్బందులు పడ్డామని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బీసీలకు 310 హాస్టళ్ల ద్వారా ప్రపంచస్థాయి విద్యను అందిస్తున్నారన్నారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్వాయి పాపన్న తదితర బీసీ బిడ్డల వేడుకలను రాష్ట్ర పండుగలుగా నిర్వహించుకొని వారిని ఘనంగా స్మరించుకుంటున్నామన్నారు. నాడు వ్రుత్తుల నుండి కులాలుగా మారామని, ఐక్యంగా లేకపోతే మనల్ని విభజించి పాలించే రాజకీయ పార్టీల కుట్రల్ని గమనించాలన్నారు. ఈ బాధ్యతను బీసీ సంఘాలు నిర్వర్తించాలని, ప్రజలను కదిలిస్తే కదిలిరావడానికి సిద్దంగా ఉన్నారన్నారు. బీసీ గణన లేకుండా, మంత్రిత్వశాఖ ఇవ్వకుండా, రిజర్వేషన్లు అమలు చేయకుండా ఉన్న బీజేపీపై ఉమ్మడిగా పోరాటం చేయాలని, మనకు అన్నివిదాలుగా అండగా ఉంటున్న కేసీఆర్ సర్కార్కి అండగా నిలవాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్ మాట్లాడుతూ దేశంలో కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే మహాత్మాజ్యోతిభాపూలే ఆశయాలతో బీసీల పట్ల ఆచరణాత్మక విధానంతో పనిచేస్తుందన్నారు. ఒకనాడు స్కూళ్లలో మద్యాహ్న బోజనం తింటేనే సంతోష పడ్డ బిడ్డల మొఖాలను చూసి వాళ్లలో ఆ సంతోషాన్ని శాశ్వతం చేయడానికి బీసీ గురుకులాలను నిర్వహిస్తే నాణ్యమైన బోజనంతో చదువును అందించడం కేసీఆర్ కి మాత్రమే సాధ్యమైందన్నారు. పూలే కలగన్న కులరహిత సమాజం దిశగా బీసీలంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. సాక్షాత్ కేంద్ర హోంమంత్రి హోదాలో పార్లమెంట్లో రాజ్ నాథ్ సింగ్ చేసిన కులగణన హామీని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చేసేలా ఒత్తిడి తేవాలన్నారు. బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం క్రుష్ణమోహన్ రావ్ మాట్లాడుతూ చరిత్రలో కొన్ని సంక్లిష్ట సమయాలు కొందరు మహానుభావులను స్రుష్టించాయని, అణగారిన, వెనుకబడిన వర్గాల జీవితాల్లో మార్పుకోసం మహాత్మా జ్యోతిభాపూలే విశేష క్రుషి చేసారని స్మరించుకున్నారు. గౌతమ బుద్దుడు, కబీర్ దాస్, నాందేవ్, అంబేద్కర్, పూలే వంటి మహనీయుల జీవితాలను ప్రతీ ఒక్కరు ఆధర్శంగా తీసుకోవాలన్నారు.
వితంతువులను, వారి పిల్లలను ఆదరించి వారికోసం ఆశ్రమ పాఠశాలల్ని నడిపించడమే కాకుండా సమాజ విషబీజాలను పారద్రోలేలా పక్షవాతంతో ఆరోగ్యం సహకరించకున్నా సత్యదర్మప్రభోదక్, సత్యశోదన వంటి అనేక పుస్తకాలను రచించారని గుర్తు చేసుకున్నారు.

బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్ మాట్లాడుతూ బీసీ హాస్టల్ విద్యార్తిగా నీళ్ల చారుతో అరకొర వసతులతో చదువుకుంటూ గతంలో మహాత్మా జ్యోతిభాపూలే జయంతి వేడుకలకు రవీంద్రభారతిలో వచ్చేవారిమని, నాడు కనీసం ప్రాతినిధ్యం లేని వెనుకబడిన వర్గాలకు నేడు ఇదే వేదిక దొరకడం సీఎం కేసీఆర్ గారి వల్లే సాధ్యమైందన్నారు. బాలిక చదువుకుంటే కుటుంభం బాగుపడుతుందని, సమాజ గతి విద్య ద్వారానే మారుతుందని నమ్మిన పూలే ఆశయాలను అందరూ కొనసాగించాలని కోరారు. బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర మాట్లాడుతూ మహాత్మా పూలే ఆశయ సాధనలో ప్రతీ ఒక్కరూ క్రుషి చేయాలని, నేడు పండుగ వాతావరణంలో జయంతి వేడుకలు నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఒకనాడు పురుగుల అన్నం, నీళ్లచారు తిన్నచోట 310 గురుకులాలతో లక్షలాది విద్యార్థులకు విద్యనందించడం తెలంగాణ ప్రభుత్వం పూలే ఆశయ సాధనకు నిదర్శన మన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, వి.శ్రీనివాస్ గౌడ్తో పాటు, శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావ్, సభ్యులు ఉపేంద్ర, కిషోర్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం, పూలే జయంతి కమిటీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కన్వీనర్లు, కోకన్వినర్లు, బీసీ సంఘాల నేతలు, అభిమానులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A RESPONSE