Suryaa.co.in

Andhra Pradesh

4 ఏళ్ల లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులెన్ని?

-శ్వేత పత్రం విడుదల చేయండి
-1,80,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది
-సి ఎఫ్ ఎం ఎస్ ను కాగ్ కు అనుసంధానించండి… అప్పుల లెక్కలన్నీ తేలతాయి
-ఒళ్లంతా చీరేసిన తరువాత గుండెపోటు అంటూ బాధపడిన వారే పాత్రధారులు సూత్రధారులై ఉంటారు
-మార్గదర్శి కేసులో పస లేదు నస మాత్రమే ఉంది
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులెంత?, టిడిపి ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులెన్ని??, రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర అప్పులపై ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేస్తే దాచుకున్నది ఎవరో?, దోచుకున్నది ఎవరో?? తెలిసిపోతుంది. గత నాలుగెళ్ళ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల పేరిట,ఇతరాత్ర ఐదున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులను చేసింది. ఇప్పటికీ పనులు చేసిన వారికి 1,80,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది. తాము చేసిన పనుల బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు రోడెక్కారు. సివిల్ కాంట్రాక్టర్లకే 30 వేల కోట్ల రూపాయల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే ఎంతోమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన బకాయిలు 15 నుంచి 20 వేల కోట్లకు మించి పెండింగులో ఉండేవి కావు. బటన్ నొక్కుడు ద్వారా రెండు లక్షల ఏడు వేల కోట్ల రూపాయల ప్రజలకు ఇచ్చానని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి, గత ప్రభుత్వ హయాంలో చంద్ర బాబు నాయుడు ప్రజలకు ఇచ్చారా? అని ప్రశ్నిస్తున్నారు. బటను నొక్కే కార్యక్రమం ద్వారా ఇచ్చినని చెబుతున్న నిధులకు సరి సమానంగా, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్ లో ఉన్నాయంటే ఎవరు దోచుకున్నారో?, దోచుకొని దాచుకున్నారు అర్థం అవుతుందని ఆయన అన్నారు.

. బుధవారము రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… సి ఎఫ్ ఎం ఎస్ వెబ్ సైట్ ను కాగ్ కు అనుసంధానించాలని, రాష్ట్ర ప్రభుత్వ అప్పులెన్నో తెలిసిపోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని తాను ఎన్నో మార్లు డిమాండ్ చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవ్వరు స్పందించిన దాఖలాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై జీవీ రెడ్డి, తులసి రెడ్డిలు తమ వద్ద ఉన్న వివరాలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులెన్ని అని తాను ఒక ప్రజా ప్రతినిధిగా ప్రశ్నిస్తున్నానని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిలలో ఎవరైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అరెస్టుకు ఎటువంటి ఆంక్షలు లేనప్పుడు ఆ ఇద్దరి అరెస్టుకు ఉన్న అడ్డంకులు ఏమిటి?
అరెస్టుకు ఎటువంటి ఆంక్షలు లేనప్పుడు, ఇప్పటికే న్యాయస్థానానికి అరెస్టు చేస్తామని విన్నవించిన తరువాత , న్యాయస్థానం నుంచి ఎటువంటి ప్రతిబంధకాలు లేకపోయినప్పటికీ, సిబిఐ అధికారులు ఆ ఇద్దరినీ ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారని రఘు రామకృష్ణంరాజు తెలియజేశారు. వారు తప్పు చేయలేదని చెప్పండి… మా తమ్ముడు మంచివాడని కడప ఎంపీ అవినాష్ రెడ్డి గురించి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా చెప్పేయండి. ఎన్నికల్లో లబ్ధి జరగడం కోసం మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి తనని తానే గొడ్డలితో నరుకుని చనిపోయారని చెప్పండి అంటూ ఆయన అపహాస్యం చేశారు. ఈ కేసు నుంచి బయటపడడానికి ఇప్పటికే వైఎస్ వివేకానంద రెడ్డి పై వేసిన నిందలు చాలు. ఇంకా ఆయన్ని అవహేళన చేయకండని అని అన్నారు. తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ కొట్టి వేయడం జరిగింది. తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్ విచారణలో ఉండగానే, ప్రత్యేక హోదా కోసమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో చర్చించడం, ఆయన అరెస్టు ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించిన కృష్ణారెడ్డి లు వేరు వేరు వెర్షన్లతో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం, వారి ఇద్దరి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరుగుతోంది.

వైఎస్ వివేకానంద రెడ్డిని ఆస్తి కోసం ఆయన అల్లుడు, కూతురే హత్య చేసి ఉంటారని అవినాష్ రెడ్డి ఆరోపించగా, ఇప్పుడు వైఎస్ భాస్కర్ రెడ్డి కొత్త కథను వినిపిస్తున్నారు. మహాభారతంలో ద్రౌపదిని చీరలాగి అవమానించితే, భీముడు ప్రతిన బూనినట్లుగానే సునీల్ యాదవ్ ప్రతిన బూనారని భాస్కర్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. అవినాష్ రెడ్డి చెప్పిన కథనాన్ని చెబితే కేసును సాగదీయడం కష్టమనే, భాస్కర్ రెడ్డి కొత్త కథనాన్ని వినిపిస్తుండగా, కేసు సాగదీతకు న్యాయస్థానాలు కూడా పరోక్షంగా సహకరిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. అయితే, సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తుండగా, వారి వాదనలను వినకుండా కేసు తీర్పు ఇచ్చేస్తే, సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉంటాయని న్యాయమూర్తులుభావించి ఉండవచ్చు. అందుకే, సీనియర్ న్యాయవాదుల వాదనలను మరి కొన్ని రోజులపాటు వినే అవకాశాలు లేకపోలేదు. వాదనలు పూర్తి కావడానికి వారం రోజులైనా పట్టవచ్చు… నెలరోజులైనా పట్టవచ్చు కానీ న్యాయస్థానంలో ఆ ఇద్దరినీ అనుమానితులుగా పేర్కొన్న సిబిఐ అధికారులు అరెస్ట్ చేస్తామని చెప్పి, ఇప్పుడు ఎందుకు అరెస్టు చేయడం లేదన్నదే భేతాళ ప్రశ్న అని రఘు రామ కృష్ణంరాజు అన్నారు.

గూగుల్ టేక్ అవుట్ ఒక నాన్సెన్స్ అని టీ.నిరంజన్ రెడ్డి అనే న్యాయవాది తన వాదనలలో పేర్కొనడం జరిగింది. ఫోను ఎవరైనా దొంగిలించి, అక్కడ పెట్టి ఉంటే గూగుల్ టేక్ అవుట్ లో ఫోను అక్కడే ఉన్నట్లుగా చూపెడుతుందన్న ఆయన, తన వాదనల ద్వారా ఫోను అక్కడే ఉన్నట్లు అంగీకరించారు. నిరంజన్ రెడ్డి వాదనలలో ఎటువంటి శానిటిటీ లేదు. ఇక సిబిఐ కి మరొక ఆప్షన్ లేదని తెలిపారు . ఈ కేసును సాగదీయడానికి మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నాల పప్పులు ఉడకవని తేల్చి చెప్పారు. తన తండ్రి హత్యకు సూత్రధారులు ఎవరో తేల్చాలని డాక్టర్ సునీత చేస్తున్న పోరాటానికి న్యాయం జరగాలని ఒక ప్రజా ప్రతినిధిగా ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

నాన్ ఫిలిం కేటగిరి ఆస్కార్ అవార్డు ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి నటన ద్వారా దేశానికి దక్కి ఉండేది
నాన్ ఫిలిం కేటగిరి లో ఆస్కార్ అవార్డు ఏదైనా ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డి నటన ద్వారా దేశానికి దక్కి ఉండేదని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు . మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని టిడిపి నాయకత్వమే చంపించిందని జగన్మోహన్ రెడ్డి పేర్కొంటే, గుండెపోటుతో ఆయన మరణించారని విజయసాయిరెడ్డి చెప్పారు. విజయసాయిరెడ్డి, జగన్ అంతా నటనను ప్రదర్శించలేకపోయారు. ఆయనకు ఆస్కార్ కాదు కదా… భాస్కర్ అవార్డు కూడా దక్కదు. వైయస్ భారతి రెడ్డి తండ్రి గంగిరెడ్డి ఆసుపత్రిలో అటెండర్ గా పనిచేసే ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి వచ్చి, వైఎస్ వివేక కు కట్లు కట్టిన తర్వాత కట్టు కథ చెప్పారు. వైఎస్ వివేక గుండెపోటుతో కాదు, గొడ్డలి పోటుతో మరణించారని తేలడంతో జగన్మోహన్ రెడ్డి షాట్ బై షాట్ స్క్రీన్ ప్లే ను చెప్పేశారు. ఆ తరువాత నారాసుర రక్త చరిత్ర అని సాక్షి దినపత్రిక ద్వారా చంద్రబాబు నాయుడును అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డిని తొలుత తలదిండుతో అదిమి చంపాలని భావించినప్పటికీ, గొడ్డలిపోటును వేయాల్సి వచ్చిందట. వైఎస్ వివేక హత్య అనంతరం సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి, నూతనంగా ఏర్పడిన తమ ప్రభుత్వ హయాంలో, తామే విచారణ చేపడుతామని చెప్పారు. 9 నెలల పాటు విచారణ ఒక కొలిక్కి రాకపోవడంతో, వివేక కుమార్తె డాక్టర్ సునీత పోలీసు ఉన్నతాధికారులను కలిశారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ కేసుతో ప్రమేయం ఉన్న శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెప్పారు. కానీ అతని శరీరంపై గాయాలు ఉన్నాయి. సీఐ శంకరయ్య 161 స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, 164 స్టేట్మెంట్ ఇచ్చేలోపే అతని సర్వీసును పునరుద్ధరించి పదోన్నతి కల్పించడం జరిగింది. ఈ కేసులో అత్యంత కీలకమైన అంశాన్ని అప్పటి పాలకపక్షం, ఇప్పటి ప్రతిపక్షం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వైఎస్ వివేక హత్య గురించి ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ ఎన్నికల ముందు మాట్లాడకూడదని జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించి గ్యాగ్ ఆర్డర్ తీసుకువచ్చారు.

గ్యాగ్ ఆర్డర్ తీసుకువచ్చారంటే, వైఎస్ వివేకను వారే హత్య చేసి ఉంటారన్న అవగాహనకు పోలీసు శాఖ, అప్పటి ప్రభుత్వం రాలేకపోవడం వారి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. పోలీస్ కానిస్టేబుల్ ను విచారణ అధికారిగా నియమించిన పరిష్కరించే ఈ కేసును, ఎన్నికల హడావిడిలో పడి అప్పటి ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఎందుకంటే తిరిగి తామే అధికారంలోకి వస్తామని భావించి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గ్యాగ్ ఆర్డర్ ను ఎందుకని తీసుకొచ్చారన్న అంశంపై మీడియా కూడా పెద్దగా దృష్టి సారించలేదు. ఇది చాలదన్నట్లుగా, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహకారంతో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవి హత్య చేసి ఉంటారనే ప్రచారాన్ని తమ పార్టీ పెద్దలు పథకం ప్రకారం చేశారు. గతంలో సిబిఐ విచారణ కోరిన జగన్మోహన్ రెడ్డి, తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదని పేర్కొన్నప్పటికీ, డాక్టర్ సునీత హైకోర్టును ఆశ్రయించడంతో సిబిఐ విచారణకు ఆదేశించడం జరిగింది. వైఎస్ వివేక హత్యలో నిందితుడైన దస్తగిరి తోపాటు రంగయ్య లు సిబిఐ అధికారి దీపక్ గౌర్ ముందు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈ హత్య కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న వారి పేర్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు విచారణ అధికారిగా వ్యవహరించిన రామసింగ్ ను అనేక రకాలుగా బెదిరించిన రాష్ట్ర ప్రభుత్వం చివరకు ఉదయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి, ఆరు నెలల పాటు రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్నది. అయినా, తులసమ్మ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఆధారంగా విచారణ ఆలస్యం జరిగిందని నెపం తో ఆయన్ని సుప్రీంకోర్టు కేసు విచారణ అధికారిగా తప్పించిందని తెలిపారు.

పార్టీ అధ్యక్షుడికి నచ్చని కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎందుకు నిర్వహిస్తున్నట్లు?
తమ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి నచ్చని కార్యక్రమాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నిర్వహిస్తున్నారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఒకటి రెండు చోట్ల ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం స్టిక్కర్లను అతికిస్తే ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ శవాలపై చిల్లర వేరుకున్నట్లుగా స్టిక్కర్లు అతికించే కార్యక్రమం ఏమిటి అంటూ ప్రశ్నించారని గుర్తు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియో ఫుటేజ్ ను ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల ముందు రఘురామకృష్ణం రాజు ప్రదర్శించారు. పార్టీ అధ్యక్షుడికి నచ్చని కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేస్తుండడాన్ని ప్రశ్నించడం పార్టీ ఉల్లంఘన ఏమి కాదు. ముఖ్యమంత్రి చేస్తున్నదే పార్టీ ఉల్లంఘన. ప్రతిపక్ష హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చిన్నాన్న హత్య గురించి మాట్లాడిన మాటలు వింటే తాము కూడా కన్నీళ్లు పెట్టుకునే వారమని, కానీ ఇప్పుడు అసలు రంగు బయటపడింది అన్నారు.

కోడి కత్తి కేసులో నిందితుడుగా అభియోగాన్ని ఎదుర్కొంటున్న శ్రీనుకు ప్రాణహాని ఉంది
జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తి తో దాడి ఉన్న శ్రీనుకు ప్రాణహాని ఉన్నదని రఘురామకృష్ణం రాజు అన్నారు.అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పై విశాఖపట్టణం విమానాశ్రయంలో కోడి కత్తితో శ్రీను అనే వ్యక్తి దాడి చేయగా, ఆయన కనీసం ప్రాథమిక చికిత్స చేయించుకోకుండానే హైదరాబాదుకు అనుకున్న సమయానికే విమానంలో బయలుదేరి వెళ్లారు. కోడి కత్తితో దాడి చేసినట్టు గా చెబుతున్న చోట కనీసం కుట్లు కూడా వేయలేదు. డాక్టర్ శ్రీనివాస్ చెబుతున్నట్లుగా బియ్యం మధుసూదన్ రెడ్డి అనే ప్రస్తుత ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తి దాడి జరిగిందని చెబుతున్న చోట టమాటా సాస్ రాశారు.
అసలు దాడి అన్నదే జరగలేదు. రక్తమే బయటకు రాలేదు. కనీసం చొక్కా కూడా చిరగలేదు. కోడి కత్తితో దాడి జరిగి ఉంటే లోతైన గాయం అయి ఉండేది కదా. లోతైన గాయం అయినచోట కుట్లు వేసి ఉండి ఉంటే, ఆ కుట్లను ముఖ్యమంత్రి చూపించాలని డాక్టర్ శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు. కోడి కత్తి కేసు లో నిందితుడుగా అభియోగాలు ఎదుర్కొంటున్న శ్రీనుకు రెండు ఎకరాల భూమిని ఇస్తామని చెప్పి, విశాఖ విమానాశ్రయంలో కలిసిన అతన్ని ఒప్పించి ఈ దాడి కుట్రకు పథకం రచించారు. అనుకున్నది అనుకున్నట్లుగానే అమలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు. అయినా, ఇంకా ఎన్ని రోజులు శ్రీను జైలులోనే మగ్గిపోవాలి. కోర్టుకు రమ్మంటే ముఖ్యమంత్రి ఏవో కుంటి సాకులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఒకవేళ డాక్టర్ శ్రీనివాస్ చెబుతున్నది నిజం కాకపోతే అతన్ని పిలిచి అడగాలి. ఇది రాజకీయ లబ్ధి కోసం ఆడిన నాటకం అని స్పష్టమవుతుంది. ఒకవేళ అదే జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో దోషిగా తేలుతారు. కోడి కత్తి దాడి వల్లనే ఎన్నికల్లో తమ పార్టీ నెగ్గిందన్నది నిష్ఠూరమైన నిజం. ముఖ్యమంత్రి ఇప్పటికీ కోర్టుకు హాజరు కానని చెబుతున్నారంటే సంథింగ్ రాంగ్ అని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.

ఆర్బిఐ అనుమతి తీసుకోవడం రామోజీరావు కు పెద్ద కష్టమేమీ కాదు
మార్గదర్శి ఫైనాన్షియల్ సంస్థ ను ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చేందుకు ఆర్బిఐ అనుమతి పొందడం రామోజీరావుకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ, ఆయన తన సంస్థలను హిందూ అన్ డివైడెడ్ చట్టం ప్రకారమే నిర్వహించాలని భావించి ఉంటారు. ఇప్పటికీ ఈనాడు దినపత్రికను ప్రచురించే ఉషోదయ పబ్లికేషన్స్ హిందూ అన్ డివైడెడ్ చట్టం ప్రకారమే నిర్వహిస్తూ ఉన్నారు. సాక్షి దినపత్రిక మాదిరిగా ఇతరుల వద్ద నుంచి షేర్ల రూపం లో డబ్బులు వసూలు చేయలేదు. ప్రీమియం పెంచి షేర్లను విక్రయించలేదని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. అడ్డంగా దొరికిన అడ్డదారుల్లోనే అని సాక్షి దినపత్రికలో ప్రచురించిన వార్తా కథనం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో వచ్చిన తిరుగుబాటును చూసి, తమకు జరుగుబాటు లేదని భావించి సాక్షి దినపత్రిక, సిఐడి చీఫ్ సంజయ్ తప్పులను ప్రచారం చేస్తున్నారు. ఆర్బిఐ కొత్త డిపాజిట్లను సేకరించవద్దని ఆదేశించినట్లుగా సాక్షి దినపత్రిక ప్రచురించిన ఆర్బిఐ నోటీసుల వెనుక అసలు మతలబు ఏమిటంటే… గతంలో అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి రాసిన లేఖను అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తమకు పంపించారని పేర్కొన్నారు. అలాగే హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ చట్టం ప్రకారం డిపాజిట్లను సేకరించినట్లుగా అంగీకరించారు. ఈ విధానం 45 ఎస్ కు అనుకూలమా?, వ్యతిరేకమా? దీనిపై మీ సమాధానం ఏమిటి? మీ సమాధానాన్ని పరిశీలించే వరకు కొత్త డిపాజిట్లను సేకరించవద్దు… అలాగే పాత డిపాజిట్లను రెన్యువల్ చేయవద్దు అని మాత్రమే ఆర్డర్ చేయడం జరిగింది.

ఒక అబద్ధాన్ని అదే పనిగా ప్రచారం చేస్తే నిజం అని నమ్ముతారని, మార్గదర్శి ఫైనాన్స్ వ్యవహారం లో ఏదో తప్పు జరిగిందని, అందుకే దాన్ని మూసివేశారని అంటున్నారు. ప్రస్తుత మార్గదర్శి కేసులో పస లేదు… నస మాత్రమే ఉన్నది. అప్పటి మార్గదర్శి ఫైనాన్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఎన్ బి ఎఫ్ సి నిబంధనలు హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ చట్టం కు వర్తిస్తాయా?, లేదా అన్న మీమాంస నడిచింది. దీనిపై గతంలోనే రామోజీరావు వివరణ ఇస్తూ… నిప్పులాంటిది మా నిజాయితీ ఏ తప్పు చేయలేదని పేర్కొన్నారు. హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ చట్టం ప్రకారం డిపాజిట్లు సేకరించవద్దని, ఆర్బిఐ అనుమతి తీసుకున్నా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు మాత్రమే డిపాజిట్లు సేకరించాలని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా చిదంబరం వ్యవహరించినప్పుడు చట్ట సవరణ చేశారు. దీనితో మార్గదర్శి ఫైనాన్స్ పేరిట సేకరించిన డిపాజిట్ ల మొత్తం మూడు నెలల వ్యవధిలో ఖాతాదారులకు వెనక్కి ఇచ్చి, ఆ సంస్థను రామోజీరావు మూసి వేయడం జరిగింది. గతంలో హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ చట్టం ప్రకారం డిపాజిట్లు సేకరించడం తప్పు కాదు.

కానీ చట్ట సవరణ జరిగిన వెంటనే తన సంస్థను మూసివేసి ఖాతాదారులకు డిపాజిట్ల మొత్తాన్ని తిరిగి ఇచ్చిన రామోజీరావును అభినందించాల్సింది పోయి, డిపాజిట్ దార్ల రక్షణ గురించి సాక్షి దినపత్రిక మాట్లాడడం విడ్డూరంగా ఉంది. హైకోర్టులో కొట్టి వేసిన కేసు గురించి సాక్షి దినపత్రిక పదేపదే వార్తా కథనాలను ప్రచురించడం బాధ్యతారాహిత్యం కాదా?. ఏపీ సిఐడి చీఫ్ గా వ్యవహరిస్తున్న 1996 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సంజయ్ తన అపాయింట్మెంట్ కొరితే సమయానుకూలంగా అతనికి అపాయింట్మెంట్ ఇచ్చి, ఆయన లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెబుతాను. అలాగే తాను కూడా కొన్ని ప్రశ్నలు ఆయన్ని అడుగుతాను. డిఓపిటి కార్యదర్శి కి తాను ఒక లేఖ రాసినట్లుగా రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. ఇతర సర్వీసులకు చెందిన అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత పోస్టులలో నియమించిన అనంతరం బాధ్యతారహితంగా మాట్లాడుతూ ప్రజలని గందరగోళపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లుగా వివరించారు. అలాగే ప్రజల ప్రాథమిక హక్కులను హరించే విధంగా మాట్లాడున్నారని డిఓపిటి కార్యదర్శి దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు.

అలాగే గతంలో రామకృష్ణారెడ్డి అనే ఏఎస్ఐ తన ఇంటి వద్ద అనుమానాస్పద స్థితిలో కనిపించిన విషయాన్ని లోక్ సభ సచివాలయం దృష్టికి తీసుకువెళ్లగా, లోక్ సభ సచివాలయం పలుమార్లు లేఖలు రాసిన అనంతరం కొడాలి వెంకటేశ్వరరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రక్షణ కోసమే కొంతమంది పోలీసులను హైదరాబాదులో నియమించినట్లుగా ప్రత్యుత్తరం ఇచ్చారు. అయితే, తమ పోలీసు సిబ్బందిని ప్రజా ప్రతినిధుల రక్షణ నిమిత్తం హైదరాబాదులో విధులు నిర్వహించే విధంగా అనుమతి కోరుతూ, తెలంగాణ పోలీస్ శాఖకు రాసిన లేఖను అందజేయాలని లోక్ సభ సచివాలయం కోరగా, ఇప్పటివరకు సమాధానం లేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

LEAVE A RESPONSE