Suryaa.co.in

Andhra Pradesh

మైన్, వైన్, ల్యాండ్, శాండ్ పై రానున్న ప్రభుత్వం విచారణ జరిపిస్తే సలహాదారులతో సహా అందరూ జైలుకే

– ఇతరులను ముసలివారు అని సంబోధించే నడుము వంచలేని నవ యువకుడైన ముఖ్యమంత్రి
– న్యాయస్థానాలలో అన్యాయ మూర్తులు ఉండరు. న్యాయమూర్తులే ఉంటారు
– ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని ప్రభుత్వం కొత్తగా నాలుగైదు సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తుంది?
– అప్పుల వ్యవహారం లో కేంద్ర ప్రభుత్వం స్ట్రిక్టుగానే ఉన్నప్పటికీ, దారుణమైన ఉదాసీనత ను ప్రదర్శిస్తోంది
– అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తాం… అడ్డు రావద్దు అంటూ కోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు
– అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న ప్రాంతంలో అడ్రస్ లేని వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి… వర్షంలో తడుస్తూనే తిరుగుతున్న ప్రధాన ప్రతిపక్ష నేత
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

ఉద్యోగులకు జీతాలను ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం, ఈ నెలలో నూతనంగా నిర్దేశించుకున్న నాలుగైదు సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం అంతా ఏమవుతోంది?. జిడిపి వృద్ధి అంతా ఉత్తదేనా? గత ప్రభుత్వ హయాంలో కంటే సంక్షేమ కార్యక్రమాలను ఎక్కువగా చేపట్టింది లేదు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి 1,80,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. చేసిన అప్పు కొండ లాగా పేరుకు పోతోంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లెర్ర చేసి, అప్పుల సంగతి తేల్చకపోతే ఆర్థిక ఎమర్జెన్సీ ఏర్పడుతుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దించాల్సి పరిస్థితి నెలకొంటుందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు.

గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం, కాగ్ లు కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులను అదే కార్పొరేషన్లకు లేఖ రాసి వివరాలను తెప్పించుకోవచ్చు. అప్పుల వివరాలు చెప్పకపోతే తోలు ఊడిపోతుందని హెచ్చరికలు చేయవచ్చు. అలా కాదనుకుంటే, కార్పొరేషన్ల బ్యాలెన్స్ షీట్ ను పరిశీలించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ అప్పుల పట్ల కేంద్ర ప్రభుత్వం స్ట్రిక్టుగానే ఉంటున్నప్పటికీ, దారుణమైన ఉదాసీన వైఖరిని అవలంబిస్తుందన్నారు.

స్టాచ్యూరిటీ పేమెంట్స్ ఇవ్వకుండా, నేను బటన్ నొక్కానని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. గత నాలుగేళ్లలో రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలను బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా ప్రజలకు చెల్లించినట్లు చెబుతున్నారు. అంటే ఏటా 50 వేల కోట్ల రూపాయలను మాత్రమే ప్రజలకు బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా చెల్లించినట్లుగా చెప్పకనే చెబుతున్నారు. ఒకవైపు ఆదాయం పెరిగిందని పేర్కొంటూనే, గతంలో కంటే ఎక్కువ సంక్షేమాన్ని చేయకుండా, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలతో కలుపుకొని ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులను చేశారు. ఈ డబ్బంతా ఏమయిందని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

కార్పొరేషన్లు అప్పుల వివరాలు చెప్పడం లేదంటూ కొత్త బుకాయింపులు
ఢిల్లీకి చేరినాము దేహి…దేహి అంటున్నామని ఆకలి రాజ్యం చిత్రంలో హీరో కమల్ హాసన్ బృందం పాటను ఆలపించినట్టుగానే, ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, సత్యనారాయణలు అప్పు కోసం తిరుగుతున్నారు. అయితే, గతంలో చేసిన అప్పుల ఖర్చుల వివరాలను చెప్పండని వారిని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రశ్నిస్తున్నారు.

లిక్కర్ బాండ్ల పేరిట 8వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకుంది. విశాఖపట్నం అభివృద్ధి కోసమ ని చెప్పి, కలెక్టరేట్, మండల రెవెన్యూ కార్యాలయాలతో పాటు, ఇతర ఆస్తులను తాకట్టుపెట్టి పాతికవేల కోట్ల రూపాయల అప్పులను చేసింది. కలెక్టరేట్ కార్యాలయం, రెవిన్యూ అధికారుల కార్యాలయం, ఇతర ఆస్తులు తాకట్టు పెట్టి అభివృద్ధి చేస్తామని చెబితే, మనం నమ్మాలట అంటూ రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. విద్యుత్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, సేవింగ్స్ మొత్తాన్ని అన్ సెక్యూర్డ్ బాండ్లలో తాకట్టు పెట్టి, తీసుకున్న రుణాన్ని మొత్తం బటన్ నొక్కే కార్యక్రమంలో ద్వారా ఖర్చు చేశానని జగన్మోహన్ రెడ్డి పేర్కొంటున్నారు.

కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులు రాష్ట్ర ప్రభుత్వమే తిరిగి చెల్లించాలి కాబట్టి, ప్రభుత్వానికి ఉన్న 12,500 కోట్ల రూపాయల రుణ అర్హత ను తగ్గిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం కొత్త కబుర్లను చెబుతోంది. కార్పొరేషన్నీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు. కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పుల గురించి వివరాలను తెలియజేయమని ఆయా కార్పొరేషన్లకు లేఖ రాయడం జరిగింది. కార్పొరేషన్లు స్పందించలేదు.

మళ్లీ ఉత్తరం రాస్తాము. కార్పొరేషన్లు స్పందించి అప్పుల వివరాలు తెలియజేయగానే, తాము కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని, అప్పటివరకు తమకు అత్యవసరంగా రుణ వెసులుబాటును కల్పించాలని కోరడం జరిగింది. మార్గదర్శి సంస్థ పై దాడులు నిర్వహించి అన్ని బ్రాంచ్ల వివరాలు ఒకే చోట కావాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం, తన ఆధీనంలోని కార్పొరేషన్లు మాత్రం స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలని పేర్కొనడం విడ్డూరంగా ఉంది . కార్పొరేషన్ల అప్పుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవని చెప్పడం సిగ్గుచేటు. కార్పొరేషన్లకు కేంద్ర ప్రభుత్వమే నేరుగా లేఖ రాసి, అప్పుల వివరాలు తెలుసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అడగగానే అప్పుల వివరాలను అందజేస్తే, అందరూ దొరికిపోతారు. రాష్ట్రం లో ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్ కు డబ్బులు బదిలీ చేసి ఖర్చు చేస్తున్నట్లుగా, దారుణమైన సంఘటనలు దేశంలోని మరే రాష్ట్రంలో జరగడం లేదు. మెడికల్ యూనివర్సిటీ, ఇంటర్మీడియట్ బోర్డ్, సర్పంచుల ఖాతాలలో నుంచి డబ్బులను లాగేసిన రాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్టులకు డబ్బులు చెల్లించడం లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలను పెండింగ్ లోనే పెట్టారు.

కాస్తో కూస్తో బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా డబ్బులను చెల్లిస్తున్నప్పటికీ, అవి ఎవరికి చేరుతున్నాయో అర్థం కావడం లేదని రఘురామకృష్ణం రాజు విస్మయం వ్యక్తం చేశారు. 6000 కోట్ల రూపాయల జీతభత్యాలు చెల్లించాల్సి ఉండగా, 1200 కోట్ల రూపాయలను మాత్రమే ఇచ్చారు. విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన పెన్షన్ కు సంబంధించి ఒక్క రూపాయను కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయలేదు. వచ్చే మంగళవారం అయినా అప్పుకు బోణి అవుతుందేమో చూడాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రిని కన్న కొడుకు లాగా చూసుకుంటుంది. కన్న కొడుకు వ్యసనాల పాలై కుటుంబాన్ని రోడ్డున పడేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా?, అలాగే రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయిస్తున్న జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు.

అవినాష్ రెడ్డి సామాన్యమైన వ్యక్తి కాదు… ఎంతోమందిని ప్రభావితం చేయగలిగే వ్యక్తి
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సామాన్యమైన వ్యక్తి కాదు… ఎంతోమందిని ప్రభావితం చేయగలిగే వ్యక్తి, ఈ సమయంలో అతను బయట ఉండడానికి వీల్లేదు. వి ఆర్ గోయింగ్ అరెస్ట్ అని గత వారం రోజుల క్రితం సీ బీ ఐ,న్యాయస్థానంలో కౌంటర్ దాఖలు చేసిందని రఘు రామకృష్ణంరాజు తెలియజేశారు. న్యాయస్థానం తీర్పు అంటూ ఇస్తే ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశం ఉత్పన్నం కాదు. న్యాయమూర్తి కాకుండా, అన్యాయ మూర్తి ఉన్న ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశం లేదు. న్యాయస్థానాలలో అన్యాయ మూర్తులు ఉండరు. న్యాయమూర్తులే ఉంటారు.

అవినాష్ రెడ్డికి న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశం ఉండదని రచ్చబండ కార్యక్రమంలో తాము చర్చించుకున్నాము. కేసు విచారణ జూన్ కు వాయిదా పడుతుందని అంచనా వేశాము. అలాగే జరిగింది. కేసు విచారణలో భాగంగా వాదనలను వినలేమని న్యాయమూర్తి పేర్కొన్నప్పటికీ, సిబిఐ దాఖలు చేసిన కౌంటర్ చదివే ఉంటారు. అందుకే మీరు ఏమి కావాలంటే అది చేసుకోండని స్పష్టం చేశారు. జూన్ 5వ తేదీ వరకు కేసు పెండింగ్ లో ఉంది. న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని వారు ఎన్ని మాటలు మాట్లాడిన అది శుష్క వాగుడే అవుతుంది. కోర్టు స్పష్టంగా చెప్పాక, దాని వంక పెట్టుకుని సిబిఐ ఆగాల్సిన అవసరం లేదు. ఒకవేళ అదే ఉద్దేశం ఉండి ఉంటే సిబిఐ, న్యాయస్థానంలో ఈ విధంగా కౌంటర్ దాఖలు చేసి ఉండి ఉండేది కాదు. కొంతమంది సిబిఐ ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సిబిఐ అనుమానించాల్సిన పనిలేదని రఘు రామ కృష్ణంరాజు వెల్లడించారు.

తమ కథలను తాము చెప్పుకుంటూనే వెళ్తారు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి వ్యక్తిగత సహాయకుడైన కృష్ణారెడ్డి ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లేఖ ఇవ్వవద్దని అన్నందుకు రాజశేఖర్ రెడ్డి, సునీత దంపతులను శిక్షించాలని కోరడం పరిశీలిస్తే ప్రలోభాలకు లొంగినట్టు స్పష్టం అవుతుంది. గతంలో ఇదే కృష్ణారెడ్డి మరొక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రక్తపు మరకలను ఎవరు తుడిపించారో స్పష్టంగా చెప్పారు. రేటింగ్ లో అగ్రస్థానంలో ఉన్నట్లు గా చెబుతున్న ఛానల్లో తమ కథలను తాము చెబితే ప్రజలు నమ్ముతారని భావించి, ఈ విధంగా చెబుతున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రాజశేఖర్ రెడ్డి, సునీత ప్రమేయం లేదని నిర్ధారణకు వచ్చి , ఆ విషయాన్ని తన కౌంటర్ లో సిబిఐ స్పష్టం చేసింది.

వైయస్ అవినాష్ రెడ్డి ని అరెస్ట్ చేసుకుంటాము. అడ్డు రావద్దని న్యాయస్థానాన్ని కోరుతూ, తీవ్ర హత్య ఆరోపణల కేసులో పూర్తి ఆధారాలు లభించాయి. ఆయన ప్రోద్బలంతోనే హత్య జరిగిందన్న నిర్ధారణకు వచ్చాము. తమ భవిష్యత్తు విచారణకు అడ్డు రావడం కరెక్ట్ కాదని న్యాయస్థానానికి సిబిఐ విన్నవించింది. వైయస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ రేపా, ఎల్లుండా అన్న సందేహాలు ఉన్నాయి.

అరెస్టు సందర్భంగా అదనపు పోలీస్ ఫోర్స్ అవసరం ఉంటుందేమోనని సిబిఐ భావించి ఉండవచ్చు. భాస్కర్ రెడ్డి అరెస్టు సందర్భంగా శాంతియుత నిరసనల పేరిట కొంతమంది పోగయ్యారు. అలాగే జన సమూహం పోగయ్యే అవకాశం ఉంటుందని సిబిఐ భావించి ఉండవచ్చు. మే 10వ తేదీన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో పోలింగ్ జరగనుంది. అవినాష్ రెడ్డి గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అతిగా బాధపడుతున్న నేపథ్యంలో ఆయన శక్తి గురించి సిబిఐ అధికారులు ఎక్కువగా ఊహించుకొని ఉండవచ్చు.

సిన్సియర్ గా పని చేస్తున్న సిబిఐ అధికారుల వ్యవహార శైలిని తప్పుపట్టడం సరికాదని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. హైకోర్టులో 76 పేజీలతో కూడిన కౌంటర్ ను సిబిఐ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు లోనే కౌంటర్ దాఖలు చేయాలని భావించినప్పటికీ, హైకోర్టులో చార్జిషీట్ కు తక్కువగా, కౌంటర్ కు ఎక్కువైన పూర్తి వివరాలను వెల్లడించారు.. వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన 2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి నిందితులుగా అభియోగాలను ఎదుర్కొంటున్న వారికదలికల వివరాలను, ఫోన్ సంభాషణలకు సంబంధించిన డీటెయిల్స్ ను కౌంటర్లో పొందుపరిచారు.

నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న వారు కెమెరాలకు, టెక్నాలజీకి దొరికిపోయారు. ఇప్పుడు ఎన్ని కవరింగులు ఇచ్చుకున్న ప్రయోజనం లేదు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం రక్తపు మరకలను లక్ష్మీ అనే పనిమనిషితో కడిగించిన విధానాన్ని, రక్తంతో తడిసిపోయిన బెడ్ షీట్ , ఒంటి పైనున్న బట్టలను మార్చిన విధానాన్ని పేర్కొన్నారు. గుండెపోటు అని అనడానికి ఒక్క శాతం కూడా అవకాశం లేని పరిస్థితులలో సాక్షాలను తారుమారు చేయడానికి ఎంతలా ప్రయత్నం చేశారన్న దానిపై సిబిఐ కౌంటర్ దాఖలు చేస్తూ, వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని పేర్కొంది.

వైయస్ అవినాష్ రెడ్డి వెనుక ఉండి హత్య చేయించారనడంలో సందేహం లేదు. విచారణలో భాగంగా అన్ని విషయాలను చెబుతున్న ఆయన, హత్యలో తన ప్రమేయం గురించి మాత్రం పేర్కొనడం లేదు. అరెస్టు చేసి కస్టోడియల్ విచారణ జరిపితే నిజ, నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిబిఐ తన కౌంటర్లో పేర్కొనడం జరిగిందని రఘు రామకృష్ణంరాజు వెల్లడించారు. వైయస్ అవినాష్ రెడ్డి ఎంతోమంది సాక్షులను ప్రభావితం చేస్తున్నారు. ఎంతోమంది ఆయన వల్ల ప్రభావితం అవుతున్నారు. వైఎస్ వివేక హత్య కేసులో 161 స్టేట్మెంట్ ఇచ్చిన సీ ఐ శంకరయ్య, 164 స్టేట్మెంట్ ఇవ్వడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. దీనితో ఆయన 164 స్టేట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించారు.

ప్రొఫెషనల్ కిల్లర్ అయినటువంటి గంగాధర్ రెడ్డిని ఈ హత్య కేసు తనపై వేసుకోవాలని, దానికి ప్రతిఫలంగా 10 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి శివశంకర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ తర్వాత డబ్బులు ఇవ్వకపోవడంతో, గంగాధర్ రెడ్డి 161 స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే 164 స్టేట్మెంట్ ఇవ్వడానికి ముందు కొంత నగదు ఆయన కు ముట్ట చెప్పినట్లు ఉంది. అందుకే 164 స్టేట్మెంట్ ఇవ్వడానికి వెనుకంజ వేశారు. అటువంటి గంగాధర్ రెడ్డి ఎలుక కొరికి చనిపోయాడు. మరక సాక్షి శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య గావించబడ్డాడు.

గాలిలో ప్రయాణం చేస్తుంటే లారీలను ఆపేస్తారా?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాలిలో ప్రయాణిస్తుంటే లారీలను ఆపి వేస్తారా?, నేషనల్ హైవేపై లారీలను నిలిపివేయడంతో నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. విశాఖపట్నం నుంచి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న భోగాపురం కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమానంలో ప్రయాణం చేయగా, పలాస దగ్గర ట్రాఫిక్ ను నిలిపివేయడం విడ్డూరం. ఈవివి సత్యనారాయణ ఎంతో కాలజ్ఞాని. ఇటువంటి ముఖ్యమంత్రిలు భవిష్యత్తులో వస్తారని ఉద్దేశంతో కాబోలు, అటువంటి సీనులను తన సినిమాలో ముందే చూపించారని ఈ సందర్భంగా ఒక సినిమా క్లిప్ ను రఘు రామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు. ఇతరులను ముసలివాడని సంబంధించిన జగన్మోహన్ రెడ్డి నడుమును కూడా వంచలేకపోతున్నారు.

గతంలో కొబ్బరికాయ కొట్టడానికి అర్చకులను చేతిలో రాయి పట్టుకోమని సూచించిన ఆయన తాజాగా, కొబ్బరికాయ కొట్టిన విధానాన్ని ఈ సందర్భంగా వీడియో ప్రదర్శించి చూపించారు. నడుము కూడా వంగలేని నవ యువకుడైన ముఖ్యమంత్రి , కల్వర్టులను కాలువలను అవలీలగా దూకుకుంటూ దాటుతున్న చంద్రబాబు నాయుడుని విమర్శించడం హాస్యాస్పదం. గోదావరి జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడానికి వ్యవసాయ శాఖామంత్రి, ముఖ్యమంత్రి అడ్రస్ లేకపోగా, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వర్షంలోనే తడుస్తూ పంట పొలాలను పరిశీలిస్తున్నారని రఘురామకృష్ణం రాజు తెలియజేశారు.

తమ ప్రభుత్వం ఏదైనా చేస్తే… రాబోయే ప్రభుత్వానికి జాక్ పాట్
గత ప్రభుత్వ హయాంలోని నిర్ణయాలపై తమ ప్రభుత్వం ఏమైనా చేస్తే, రాబోయే ప్రభుత్వానికి అది జాక్ పాట్…అవుతుంది. ప్రస్తుత ప్రభుత్వం తమకు తామే యమపాషాన్ని బిగించుకున్నట్లేనని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై మరొక ప్రభుత్వం విచారణ చేయడానికి వీలు లేదని కోర్టు తీర్పులు ఉన్నాయి.

గత ప్రభుత్వాల నిర్ణయాలను కోర్టు అనుమతి ద్వారా విచారణ చేపట్టవచ్చు. అలా కాదని విచారణ జరిపిస్తామంటే వచ్చే ప్రభుత్వానికి చక్కటి అవకాశం కల్పించినట్లే. రానున్న ప్రభుత్వం మైన్, వైన్, శాండ్, ల్యాండ్ పై విచారణ జరిపిస్తే ప్రభుత్వ సలహాదారుల సహా చాలామంది జైలుకు వెళ్తారని రఘురామకృష్ణంరాజు అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును సరిగ్గా అర్థం చేసుకోలేక అనవసర నిర్ణయాలు తీసుకుంటే ముప్పు తప్పదని ప్రభుత్వ పెద్దలను రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు.

LEAVE A RESPONSE