100వరోజు పాదయత్రలో పాల్గొననున్న భువనేశ్వరి!
నేడు నారా, నందమూరి కుటుంబాల సంఘీభావ యాత్ర
అమ్మలేనిదే జననం లేదు… అమ్మలేనిదే గమనం లేదు… అమ్మలేకపోతే చరాచర సృష్టిలో జీవం లేదు… అమ్మలేకపోతే అసలు సృష్టేలేదు. ఈరోజు మాతృ దినోత్సవం. ఎక్కడ ఉన్నా ప్రతిఏటా మదర్స్ డే రోజున తనకు అత్యంత ఇష్టమైన అమ్మను కలిసి ఆమెతో ఆనందాన్ని పంచుకుంటుంటారు లోకేష్. ఈ ఏడాది జనవరి 27న యువనేత లోకేష్ చారిత్రాత్మక పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
ఈసారి మాతృ దినోత్సవం రోజున అమ్మను కలవడం కుదరకపోవడంతో ఉదయాన్నే సోషల్ మీడియా ద్వారా తన తల్లి భువనేశ్వరికి కృతజ్జతలు చెప్పుకున్నారు. అయితే మదర్స్ డే రోజు లోకేష్ కు తల్లి భువనేశ్వరి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. 99వరోజు పాదయాత్ర ముగించుకొని ఆదివారం సాయంత్రం శ్రీశైలం నియోజకవర్గం బోయరేవుల క్యాంప్ సైట్ కి చేరగానే భువనేశ్వరమ్మ కన్పించింది. తల్లిని చూడగానే లోకేష్ ఆనందానికే అవధుల్లేకుండా పోయాయి.
సోమవారం నాడు 100వరోజు పాదయాత్రలో లోకేష్ తోపాటు ఆయన తల్లి భువనేశ్వరితోపాటు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, లోకేష్ చిన్ననాటి స్నేహితులు యాత్రలో పాల్గొనబోతున్నారు. యువగళం 100వరోజు పాదయాత్రను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు యువగళం టీమ్ కోఆర్డినేటర్ కిలారు రాజేష్ నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు చేశారు.
తన భర్త చంద్రబాబునాయుడు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు రాజకీయ వేదికపైకి రాని భువనేశ్వరి తొలిసారి బిడ్డతో కలిసి సోమవారం అడుగులు వేయనున్నారు. నారా, నందమూరి కుటుంబాలు ప్రత్యేక వాహనంలో ఇప్పటికే కర్నూలుకు చేరుకోవడంతో యువగళం బృందాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.