Suryaa.co.in

Political News

న్యాయానికి “న్యాయం” సత్వరం జరిగితేనే సమాజానికి మేలు!

న్యాయస్థానాలు వ్యాజ్యాలను అపరిష్కృతంగా దీర్ఘకాలం విచారణ ప్రక్రియలోనే కొనసాగించడం పర్యవసానంగా న్యాయానికి ‘న్యాయం’ జరగని ప్రమాదం వాటిల్లవచ్చు. సమస్య సంక్లిష్టంగా మారడానికి, జటిలం కావడానికి దారితీయవచ్చు! వ్యాజ్యంలోని విషయం స్పష్టంగా ఉన్నప్పుడు సత్వర తీర్పులు న్యాయం ఉనికికి రక్షణ కవచంగా నిలుస్తాయి.

అమరావతి రాజధాని నిర్మాణానికి రైతులు తమ భూములను భూ సేకరణ చట్టం – 2013 ప్రకారం ఇవ్వలేదు. భూ సమీకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం రూపొందించిన “రాజధాని నిర్మాణం – అభివృద్ధి”తో ముడిపడిన “బృహత్తర ప్రణాళిక” ప్రాతిపదికన సీఆర్డీఏతో ఒప్పందం చేసుకొని ఇచ్చారు.

“1) రాష్ట్రం మరియు ఏపిసీఆర్డీఏ షెడ్యూల్ II & III మరియు ల్యాండ్ పూలింగ్ రూల్స్, 2015 క్రింద నిర్దేశించబడిన విధులను నిర్వర్తించాలి.
2) రాజధాని నగర నిర్మాణం లేదా రాజధాని ప్రాంత అభివృద్ధి మినహా, సమీకరణ చేసిన భూమిని అన్యాక్రాంతం చేయడం లేదా తనఖా పెట్టడం లేదా మూడవ పక్షానికి హక్కు కల్పించడం చేయకూడదు.”
పై రెండు విషయాలను 2022 మార్చి 3న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన చారిత్రాత్మక తీర్పులో విస్పష్టంగా పేర్కొన్నది. వీటి అమలుపై సుప్రీం కోర్టు “స్టే” విధించలేదు.

ఈ పూర్వరంగంలో హైకోర్టు తీర్పుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు ఏపిసీఆర్డీఏ కార్యాచరణకు పూనుకొన్నప్పుడు, ఆ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు, ఆ ఉల్లంఘనకు అడ్డుకట్టవేస్తూ హైకోర్టు ఆదేశాలిస్తుందని సర్వత్రా భావించారు. కానీ, “తుది తీర్పుకు లోబడి” అంటూ ఒక షరతు విధిస్తూ మధ్యంతర తీర్పు ఇచ్చారు.

దానిపై సుప్రీం కోర్టుకు వెళితే, “అమరావతి రాజధాని వ్యాజ్యాలపై న్యాయస్థానం ఇచ్చే తుది తీర్పుకు లోబడే పట్టాలు చెల్లుబాటు అవుతాయి” అని పట్టాలపై ముద్రించాలని, “ముందరి కాళ్ళకు బంధం” వేస్తూ ఆదేశించింది. ఈ తరహా ఆదేశాలకంటే “స్టే” విధించి, వ్యాజ్యాల విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేసి, తుది తీర్పు ఇస్తే సముచితంగా ఉండేది కదా!

రాజ్యాంగానికి, చట్టాలకు వక్రభాష్యం చెప్పగలిగిన ప్రబుద్ధులు మన పాలకులు. న్యాయస్థానాల తీర్పులకు వక్రభాష్యాలు చెప్పి, తమ కుటిల రాజనీతితో ప్రజలను మాయ చేయలేరా! అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులుకానీ, ప్రజలుకానీ, తమ హక్కులను, తామే రక్షించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సమాజం ఆలోచించాలి!

టి. లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు

LEAVE A RESPONSE