ఎప్పుడు పుట్టిందో..
ఇంకెప్పుడు గళం సవరించిందో
ముఖానికి అదెప్పుడు
రంగు పులిమిందో..
సినిమా పుట్టిన కొన్నాళ్లకే
పుట్టిన సరస్వతి..
ఆరేళ్ళ ప్రాయంలోనే
స్వరంగేట్రం చేసి
బాల సరస్వతి అయింది..
ఇప్పుడు…పుట్టిన ఇన్నాళ్లకు..
తన తోటి కళాకారులను
చేరేందుకు పాటల పల్లకీపై
స్వర్గపురికి పయనమైంది..!.
1943లో చెంచులక్ష్మి
వచ్చినప్పుడు ఉంది..
పొద్దున్న వరకు ఉంది..
96 దాటి బామ్మగా మారినా..
అప్పటికీ.. ఇప్పటికీ
అందాల బొమ్మగానే
మిగిలింది..!
ఈ సరస్వతమ్మ..
గూడవల్లి టేకింగ్ చూసింది..
హెచ్ఎంరెడ్డిని పలకరించింది
వేదాంతం దర్శకత్వాన్ని
సాంతం పరికించింది..
నాగయ్య నటన చూసింది..
నందమూరితో నటించింది..
అక్కినేనినీ అలరించింది..
తరాలు..అంతరాలు..
తారలు..అవతారాలు..
మూకీ..టాకీ..
నలుపు తెలుపు..
గేవా..ఆర్వో.. ఈస్ట్ మన్..
సినిమా స్కోపు వరకు
బైస్కోపులన్నీ చూసింది
కళ్ళారా..
పాటలెన్నో వింది చెవులారా..
పాడింది మనసారా..
వెండి తెరపై మెరిసింది
ఇంపారా..!.
అద్భుతమైన ఆ స్వరాన్ని
హెచ్ ఎం వి
ఆమెకు తెలియకుండానే
రికార్డు చేసి
నచ్చి మెచ్చి..
ఆపై ఒప్పించి పాడిస్తే
పరమ పురుషా పరంధామా..
దొరికె దొరికె నీ దర్శనము
అంటూ ఆలపించి
అదరగొట్టేసింది..
బాలమురళి పదవ ఏట
గొంతు సవరిస్తే..
ఈ బాల సరస్వతి పాటలు
ఆరులోనే ఏరులయ్యాయి..
తర్వాత ఇంకెందరో
గాయనీమణులకు
దారులయ్యాయి..!
నమస్తే నా ప్రాణనాథ
ఆకలి సహింపజాల
పరమ పురుష పరంధామ
సోలో పాటలు ఇలా కిలకిలా..
వయసు ఎనిమిది..
అప్పుడే పుల్లయ్య నచ్చి
సతీఅనసూయలో
గంగ పాత్ర ఇస్తే
ప్రేక్షకులు ఆనంద పారవశ్యంలో
మునగంగ…
ఏది దారి నాకు
ఈ కలుషిత భూతముల పాలైతి అని పాడి
భూతలాన్ని పరశింపచేసింది
సరస్వతి..రెండొందల బహుమతితో..
సినిమాలు మానేసి అయింది
రావు బహద్దూర్ శ్రీమతి..!
సంగీతం..గాత్రం..
అందం..అభినయం..
విధేయత..వినయం..
ప్రతి పాత్రకు న్యాయం..
వందేళ్లకు పైగా
నడుస్తున్న సినిమాలో
తొంభై ఆరేళ్ళు ఉంది
మనిషిగా ధన్యజీవి..
కళాకారిణిగా చిరంజీవి..!
– సురేష్
9948546286
7995666286