ఆయన..
జీవనాడి కూచిపూడి..
ఆ నృత్యరీతికి
ఆయనే అయ్యాడు నాడి..
జీవితమే సఫలం చేసుకుంటూ
తను నమ్మిన..నేర్చిన
కళకు సాఫల్యం చేకూర్చుతూ..
సాగింది ఆయన జీవిత నావ..
కూచిపూడికి
తాను చూపుతూ త్రోవ..
ఆ కూచిపూడి కాగా..
ఆ మహా కళాకారుని కోవ..!
వెంపటి చిన సత్యం.._
ఆయన మరోపేరే
కూచిపూడి నృత్యం..
పుట్టింది కూచిపూడిలో..
పెరిగింది కూచిపూడిలో..
పెంచింది ఆ కూచిపూడినే..
చెన్నపట్నంలో
ఆయన ఆగమనం వరకు
నృత్యమంటే భరతనాట్యమే..
మద్రాస్ కూచిపూడి
నృత్య అకాడమీ ఆవిర్భావంతో
ఈ రీతీ అయింది
భరతనాట్యానికి సాటి..
కళాజగత్తున తనూ మేటి..!
గజ్జె కట్టింది మొదలు..
కూచిపూడి శ్వాసగా..
అదే తన ధ్యాసగా..
సాగిన ప్రస్థానం…
ఒకనాటికి జగద్వితితమైంది
సత్యం సారథ్యంలో..
పద్మావతి శ్రీనివాస కల్యాణం..
ఆయన అభినయ కౌశలం
చరిత్రగా మారగా…
రూపు దిద్దుకుంది
విప్రనారాయణ చరితం..
ఎంత సాధించినా తీరని ఆర్తి..
పెరుగుతూ వచ్చింది
మాస్టారి కీర్తి..
శాకుంతలమై..
భామాకలాపమై..
కళ్ళకు కట్టిన
రుక్మిణీ కల్యాణమై..
కూచిపూడి ఆయన ద్వారా
జగద్విదితమై..!
కాళిదాసు హరవిలాసం నయన మనోహరమైతే.. ఆనాడు జనకుని కొలువులో రామయ్య గావించిన శివ ధనుర్భంగం మిరుమిట్లు గొలిపే అపురూప భంగిమైతే..
ప్రతి కళాహృదయమూ ఆర్ధ్రమైంది.. చినసత్యం జన్మ అలా చరితార్థమైంది..!
చినసత్యం దేహమే కూచిపూడి భాషణం కాగా.. అదే కూచిపూడి ఆయన్ని చేసింది..
పద్మభూషణం..!
(వెంపటి చినసత్యం మాస్టారి జయంతి..అక్టోబర్ 19..1929 సందర్భంగా… అక్షర ప్రణామాలు..)
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
7995666286