Suryaa.co.in

Family

మాడిన చపాతీలు కాదు…మనుషులను గాయపరచేది కఠినపు మాటలే !

అబ్దుల్ కలాం తల్లి అయిన ఆషియమ్మ , ప్రతిరోజు లాగే ఇంట్లో అందరికీ రొట్టెలు [ చపాతీలు] తయారుచేసి వడ్డించారు. కానీ ఆ రాత్రి కలాం వారి తండ్రి అయిన జైనాలుబ్దీన్ కంచం వైపు ప్రత్యేకంగా చూస్తున్నారు. ఎందుకంటే అందులో వున్న చపాతీలు మాడిపోయివున్నాయి. ఆషియమ్మ ఆయన దగ్గర కూర్చొని ” మీరు నన్ను క్షమించాలి , చపాతీలు మాడిపోయాయి,” అన్నారు. చిన్న పిల్లవాడైన కలాం తండ్రి అపుడు ఏమంటారోనని ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. అపుడు జైనాలుబ్దీన్ ” నాకు మాడిన చపాతీలంటే చాలా ఇష్టం , ” అని అన్నారట.

అరగంట తరువాత తండ్రి దగ్గరికెళ్ళి , ” నాన్న గారూ , మీకు మాడిన చపాతీలంటే నిజంగా ఇష్టమా ? ” అని అడిగారు. అందుకు ఆయన కలాంని ప్రేమగా దగ్గరికి తీసుకొని ” మీ అమ్మ తెల్లవారుఝామున అయిదు గంటల నుండీ రాత్రి పది గంటల వరకూ , పది నిమిషాలు కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తుంటారు. తాను చాలా అలసిపోయి ఉంటుంది. పైగా , మాడిన చపాతీలు ఎవరి మనసునూ గాయపరచవు , కఠినపు మాటలే మనసును గాయపరుస్తాయి. జీవితంలో అన్నిసార్లూ పరిపూర్ణతను ఆశించరాదు. అది ఉండదు. మానవ సంబంధాలు చాలా సంక్లిష్టమైనవి , వాటిని దెబ్బతీయడం చాలా తేలిక , కాపాడుకోవడమే కష్టం. నాలో ఎన్నో లోపాలు వున్నాయి. నాకు పుట్టిన రోజు తేదీలు , పెళ్ళిరోజులు … ఇలా మరెన్నో గుర్తుకే వుండవు. నేను అనేక విషయాల్లో చాలా వెనుకబడినవాడిని. జీవితంలో పరిపూర్ణతలు , అపరిపూర్ణతలు [ perfections and imperfections] కలిసివుంటాయి. ఆస్వాదించాలి అంతే. ”
తన తండ్రి మాటలు , తల్లి తమ కుటుంబం కోసం చేసిన త్యాగాన్ని గుర్తుచేసుకొంటూ తన ఆత్మకథ అయిన The Wings of Fire లో కలాం గారు పుస్తకం మొదట్లోనే My Mother అనే అద్భుతమైన కవితను వ్రాశారు.

– Pn సతీష్ …

LEAVE A RESPONSE