Suryaa.co.in

Andhra Pradesh

చరిత్ర గతిని తిరగరాసే విజయాన్ని సొంతం చేసుకోనున్న కూటమి

-ఇండియా టుడే నిర్వహించిన పరీక్షలో ఫెయిల్ అయిన మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

చరిత్ర గతిని తిరగరాసే విజయాన్ని కూటమి సొంతం చేసుకోనుందని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు . పొత్తు, సీట్ల ఖరారు పై చర్చించేందుకు రేపో, ఎల్లుండో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ కి రానున్నారని ప్రముఖ దినపత్రికలలో వార్తా కథనాలు వెలువడ్డాయి. పవన్ కళ్యాణ్ ప్రకటన కూడా చేసినట్లు సాక్షి దినపత్రికలో ప్రచురించారు. పొత్తుతోపాటు, సీట్లు, అభ్యర్థుల ఖరారు పై నిర్ణయం ఉంటుందని ఆయన వెల్లడించినట్లుగా సాక్షి దినపత్రిక వార్తా కథనంలోను, సామాజిక మాధ్యమాలలో పేర్కొనడాన్ని చూశామని తెలిపారు .

మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈనెల 22వ తేదీన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తో పాటు, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి లు భేటీ అయి పొత్తులపై చర్చించి ఒక కొలిక్కి తీసుకురానున్నారు. అదే రోజు నేను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో తెలిసిపోతుందన్నారు. నరసాపురం స్థానం నుంచి నేను మళ్లీ పోటీ చేయడం ఖాయమన్న ఆయన, నా సీటు నేనే డిసైడ్ చేసుకున్నానని చెప్పారు .

పొత్తు లో భాగంగా నరసాపురం స్థానాన్ని ఏ పార్టీ కోరుకుంటే, ఆ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తానని రెండేళ్ల క్రితమే చెప్పానని గుర్తు చేశారు. అయితే కొన్ని కూలీ నీలి చానల్స్, కొన్ని వెబ్సైట్లో పిల్ల సజ్జల తమకు తోచింది రాసుకుంటున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసేందుకు రేపో, మాపో సమయం అడిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నా సీటును ఆపేందుకు ప్రయత్నించుకోవాలని సవాల్ చేశారు. ఈ ప్రయత్నంలో విజయం నాదో, నీదో తేలిపోతుందన్నారు.

పొత్తు ఖరారవుతుంది… వైకాపా తుడిచిపెట్టుకుపోతుంది
తెదేపా, జనసేన, బిజెపిల మధ్య పొత్తు ఖరారు అవుతుందని, ఈ దెబ్బకు వైకాపా తుడిచిపెట్టుకుపోతుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. బిజెపితో తెదేపా, జనసేన కూటమి కలిసిన తర్వాత గతంలో జరిగిన అభివృద్ధిపై కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ, అన్ని సందేహాలను తీర్చుతూ అద్భుతమైన ప్రణాళికతో రాష్ట్రాన్ని పురోగతి దిశగా నడిపించగలదనే భరోసా ను కూటమి నేతలు ప్రజలకు ఇవ్వనున్నారు.

టిడిపి, బిజెపి, జనసేన నేతల మధ్య ఇంకా సమావేశం జరగకముందే, విశాఖపట్నం జిల్లా జనసేన అభ్యర్థులను సాక్షి దినపత్రిక ఖరారు చేసిందని రఘురామ కృష్ణంరాజు అపహాస్యం చేశారు. ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడానికే సాక్షి దినపత్రిక ఈ తరహా కథనాలను ప్రచురిస్తోందని చెప్పారు. ఇంకొక రెండు రోజులపాటు తమ ఆఖరి ప్రయత్నం గా ఈ తరహా కథనాలను సాక్షి దినపత్రిక రాసుకోవచ్చునని ఎద్దేవా చేశారు. పూర్తిగా పొత్తు పుష్పం వికసించిన తర్వాత వీరికి ప్రజలంతా ఊడ్పుడు కార్యక్రమాన్ని షురూ చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు.

ఆఖరి నుంచి మొదటి స్థానం జగన్మోహన్ రెడ్డికి ఖాయం
దేశంలో ప్రజాదారణ పొందిన ముఖ్యమంత్రిల జాబితా లో ఆఖరి స్థానం నుంచి లెక్కిస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి స్థానంలో ఉంటారనేది నా భావన అని రఘురామ కృష్ణంరాజు అన్నారు . ఇంతకంటే పనికిమాలిన ముఖ్యమంత్రి ఉన్నారేమో నాకైతే తెలియదు. ఇంతటి విధ్వంసాన్ని చేయడం అనేది ఇతర ఏ ముఖ్యమంత్రిలకు సాధ్యం కాదని, అది ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమంటూ విమర్శించారు.

ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దారుణంగా విఫలమయ్యారు. నేను గతంలో చెప్పిన సర్వేల అంచనాలు ఎంతవరకు నిజం అన్నది ఇప్పటికే వారికి అర్థమై ఉంటుంది. కూటమి చేతిలో తుక్కు,తుక్కుగా జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయాన్ని, దారుణ పరాభవాన్ని మూటగట్టుకోవడం ఖాయం. రానున్న ఎన్నికల్లో వైకాపాను ప్రజలు ఇంటికి పంపుతారనడంలో ఎటువంటి సందేహం లేదని రఘురామ కృష్ణంరాజు తేల్చి చెప్పారు.

టాప్ టెన్ లో అడ్రస్ లేని జగన్మోహన్ రెడ్డి
దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల తొలి పది స్థానాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చోటు లభించలేదని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఇండియా టుడే నిర్వహించిన మోస్ట్ పాపులర్ చీఫ్ మినిస్టర్ సర్వేలో వివిధ రాష్ట్రాలలో స్థానిక ముఖ్యమంత్రిల పట్ల వ్యక్తమైన ప్రజాభిప్రాయం ఆధారంగా తొలి పది స్థానాలలో నిలిచిన ముఖ్యమంత్రుల పేర్లను ప్రకటించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 52.7%తో అగ్రస్థానంలో నిలవగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 51.3% ద్వితీయ స్థానంలో నిలిచారన్నారు.

నవీన్ పట్నాయక్ గతంలో 61.3% ఓటింగ్ లభించగా, ఇప్పుడు పర్సంటేజ్ తగ్గినప్పటికీ, ఆయనే అగ్రస్థానంలో నిలిచారన్నారు. రానున్న ఎన్నికల్లో ఇదే శాతం ఓట్లు అధికార పార్టీలకు పోలవుతాయనే దానికి ఇదొక సంకేతమని రఘు రామ కృష్ణంరాజు వెల్లడించారు. యోగి ఆదిత్యనాథ్ కు గతంలో 46.9% ఓటింగ్ లభించగా, ఈసారి 51.3%కి ఎగబాకారన్నారు. ఆయన నిజాయితీకి ఈ ప్రజాభిప్రాయం అద్దం పట్టిందని, దానికి రివర్స్ గా రాష్ట్రంలో అవినీతిమయమైన పరిపాలన అందించిన పాలకులకు ప్రజలు తగిన రీతిలో జవాబు చెప్పారని తెలిపారు. అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిస్వ శర్మ 48.6%, తో పాటు ముఖ్యమంత్రులు భూపేంద్ర బాయి పటేల్ 42.6%, మాణిక్ సహా 41.4%, గోవా ముఖ్యమంత్రి 41.1%, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి 41.1%, అరవింద్ కేజ్రీవాల్ 36.5% తో ఎనిమిదవ స్థానానికి పడిపోయారన్నారు.

గతంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిల జాబితాలో 57% ఓట్లు సంపాదించుకున్న కేజ్రీవాల్, తన స్థానాన్ని కాపాడుకోలేకపోయారన్నారు..అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా 35.8% తో వెనుకబడ్డారని, గతంలో ఆయనకు 48% ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉండేది అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతంలో 32 శాతం ఓట్లను సాధించగా, ఈసారి 32.8% శాతం ఓట్లతో టాప్ టెన్ లో స్థానాన్ని దక్కించుకున్నారని చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10 నుంచి 15 మంది జాబితాలోనైన ఉంటారా?, లేకపోతే 15 నుంచి 20 మంది ముఖ్యమంత్రి జాబితాలోనైనా ఉన్నారా? అన్నది ప్రశ్నార్థకమేనని చెప్పారు. ఇండియా టుడే సంస్థ కేవలం టాప్ టెన్ ముఖ్యమంత్రిల జాబితాను మాత్రమే విడుదల చేశారు. ఆ తరువాత వారి జాబితాను విడుదల చేయడం భావ్యం కాదని భావించి ఉంటారు. మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇండియా టుడే నిర్వహించిన పరీక్షలలో ఫెయిల్ అయ్యారు. ఇండియా టుడే సర్వేకు ప్రామాణికత ఏమిటి అని ఎవరైనా అంటే ప్రజలు ఒప్పుకోరు.

జగన్మోహన్ రెడ్డి తనకు తాను ముఖ్యమంత్రిగా 100కు 99 మార్కులు వేసుకున్నప్పటికీ, ఇండియా టుడే సర్వేలో మాత్రం పాస్ మార్కులను సాధించలేకపోయారు. ఇండియా టుడే ను కూడా ఇన్ డైరెక్ట్ గా మేనేజ్ చేయాలనే ప్రయత్నాలు చేశారు. తిరుపతిలో కాంక్లేవ్ పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. టైమ్స్ నౌ మాదిరిగా కాకుండా ఇండియా టుడే సంస్థ యజమాన్యం ముక్కుసూటిగా వ్యవహరించేలా ఉంది .

ఏడాదికి ఎనిమిదిన్నర కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లను ఇస్తున్నందుకు టైమ్స్ నౌ యజమాన్యం తమ సర్వేలలో వైకాపాకు 25 స్థానాలకు గాను 25 స్థానాలు, లేదంటే 24 స్థానాలు ఇచ్చి అధికార పార్టీ నేతల మెప్పు పొందే ప్రయత్నాన్ని చేసింది. ఇటీవల విడుదల చేసిన సర్వేలలో మాత్రం ఎందుకో 25 పార్లమెంట్ స్థానాలకు గాను 19 స్థానాలకు పరిమితం అయినట్లుగా సర్వే అంచనాలను ప్రకటించి, ఆశ్చర్యపరచారన్నారు . అయినా అది కూడా అబద్ధపు సర్వే అంచనా నేనని పేర్కొన్నారు.

చెప్పింది ఏ ఒక్కటి చేయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు ఎందుకు ఓటు వేస్తారని ప్రశ్నించిన రఘురామ కృష్ణంరాజు, ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేర్చలేదన్నారు. చెప్పింది ఏ ఒక్కటి చేయలేదు కాబట్టే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇండియా టుడే సర్వేలో ఈ ర్యాంకు వచ్చిందన్నారు. ఎంతో దారుణంగా ఆయన రేటింగ్ పడిపోయిందనడానికి ఇండియా టుడే సర్వే నే ఒక నిదర్శనం అని పేర్కొన్నారు. ఇంకా ఐప్యాక్ వాడు అలా చెప్పాడు… ఇలా చెప్పాడని దొంగ లీకులు ఇచ్చిన ప్రయోజనం శూన్యం. ఐ ప్యాక్ తో పాటు వైకాపా ను ప్యాక్ చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టమవుతోందన్నారు.

అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదువేల మంది కూడా హాజరు కాలేదు
రాప్తాడు లో నిర్వహించిన సిద్ధం సభకు రాయలసీమ జిల్లాలలోని 52 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గం నుంచి 5000 మంది కూడా హాజరు కాలేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఎక్కువలో ఎక్కువగా రెండు లక్షల మంది కూడా లేని సభ గురించి, సాక్షి దినపత్రికలో గొప్పలు పోతు వార్తా కథనాలు రాయడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో పుచ్చలపల్లి సుందరయ్య నిర్వహించిన బహిరంగ సభ కంటే ఈ సభకే ఎక్కువ ప్రజలు హాజరయ్యారని పేర్కొనడం మరీ విడ్డూరంగా ఉంది.

ఎంతో ఖర్చు పెట్టి ప్రజలను మొబలైజ్ చేసినప్పటికీ, ప్రజలు పెద్దగా సిద్ధం సభకు హాజరు కాలేదు. అయినా, ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని విని మురిసిపోయారని, సభా ప్రాంగణానికి వెళ్లలేక సెల్ ఫోన్ లోనే ప్రసంగాన్ని విని మురిసిపోయారని సాక్షి దినపత్రికలో రాసుకున్నారు. అయితే, సభా ప్రాంగణానికి వెళ్లడం ఇష్టం లేకనే ప్రజలు వైకాపా నేతలు పంపిణీ చేసిన మద్యం సేవించి బస్సులలోనే కూర్చుండిపోయారన్నారు. అంతేకానీ సెల్ ఫోన్ లో జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని వినడానికి వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి, అక్కడకు వెళ్లి సెల్ ఫోన్ లో జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని చూసి తరించాలని ఎవరు అనుకోవడం లేదని ఎద్దేవా చేశారు. మీరు అరేంజ్ చేసుకున్న మీటింగు గురించి మీకు మీరే జబ్బలు చర్చుకుంటూ, ప్రజల సొమ్మును స్వాహా చేస్తూ అమ్ముకుంటున్న మీ సొంత పేపర్లో రాసుకోవాల్సిందే తప్ప… వాస్తవ పరిస్థితి ఏమిటన్నది ప్రజలకు తెలుసునని అన్నారు.

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం రోజున సొంత సామాజిక వర్గానికే జగన్మోహన్ రెడ్డి న్యాయం
ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం రోజున ఉప లోకాయుక్తగా రజినీ రెడ్డి అనే న్యాయవాదిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. సామాజిక న్యాయం లో భాగంగా రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలలో రెండింటిని తన సొంత సామాజిక వర్గ నేతలైన వై.వి సుబ్బారెడ్డి, రఘునాథరెడ్డి లకు కేటాయించి పెద్దపీట వేశారని అపహస్యం చేశారు.

ఉపలోకాయుక్తగా న్యాయమూర్తులను నియమించాలనే నిబంధనలను పక్కనపెట్టి, 25 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిలో కొనసాగిన వ్యక్తులను కూడా నియమించవచ్చునన్న నిబంధనను ఆసరాగా చేసుకుని రజినీ రెడ్డిని నియమించారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే, ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి నియమించుకుంటూ వెళ్తున్నారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

LEAVE A RESPONSE