– బిఆర్ఎస్ దుష్ట పాలనలో వేములఘాట్‌లో రైతు ఆత్మార్పణ
– రైతులకు సంకెళ్లు… దళితులను ట్రాక్టర్‌తో తొక్కించిన ఘటనలు మరిచారా?
– లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించం
– రైతుల సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
– రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వాన్ని,పరిపాలనను అస్ధిరత పరచాలన్న కుట్ర జరుగుతోందని , అధికారం కోల్పోయామన్న అక్కసుతో అమాయకులైన రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని బి ఆర్ ఎస్ ప్రయత్నిస్తోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. చిల్లర, అవకాశవాద, కుట్రపూరిత రాజకీయాలతో మనుగడ సాగించలేరనే విషయాన్ని బిఆర్ఎస్ గుర్తించాలని హితవు పలికారు.పార్టీ ఉనికి కోసం అమాయక రైతులను బలిపెట్టవద్దని ఆ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు.
లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించబోమని , చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని వ్యాఖ్యానించారు. లగచర్లలో ప్రజలు, అక్కడి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్‌తో సహా అధికారులు వెళ్లినపుడు, ఎలాంటి చర్చకు ఆస్కారం ఇవ్వకుండానే దాడికి పాల్పడడం నీచం, అత్యంత హేయమైన చర్య.
జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారంటే దానివెనుక భారీ కుట్ర కోణం దాగి ఉందని అర్ధమవుతుంది. రైతులు తమ సమస్యలను చెప్పుకోవడానికి , స్ధానికుల సమస్యలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఈలాంటి కుట్రపూరితచర్యలకు పాల్పడడం దురదృష్టకరం .
రైతులను నష్టపెట్టాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం కాదు, వారి సమస్యలను వినడానికి ,పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ప్రజాస్వామ్య యుతంగా వెళ్తుంది, రైతుల ముసుగులో అధికారులను చంపే ప్రయత్నం చేయడం మంచిపద్దతి కాదు . లగచర్ల సంఘటను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది.
జిల్లాకు మెజిస్ట్రేట్‌గా ఉన్నకలెక్టర్ పైనే హత్యాయత్నం చేయడానికి కుట్ర పన్నారు. అధికారుల మీద దాడి అనేది మనమీద మనం దాడి చేసుకున్నట్లే! రైతుల ముసుగులో కొంతమంది గులాబీ గూండాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. దీనివెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు.
అధికారులను కాపాడుకోలేకపోతే పని చేయడానికి ఏ అధికారి ముందుకు వస్తారు? బి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారం వెలగబెట్టిననాడు ఇదే పద్దతి చేశారా? బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో జరిగినట్లుగా సమస్య చెప్పుకోవడానికి వచ్చిన రైతులకు బేడీలు వేయలేదు. బి ఆర్ ఎస్ పదిసంవత్సరాల నియంతృత్వ పాలనలో ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు బేడీలు వేశారు. ఇసక దందాలకు అడ్డువస్తున్నారని సిరిసిల్ల నియోజకవర్గం నేరెళ్లలో దళితులను ట్రాక్టర్‌తో తొక్కించి పోలీసు స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించారు.
మల్లన్న సాగర్ విషయంలో రైతులకు పెట్టిన బాధలు వర్ణణాతీతం. ఆ నాటి ప్రభుత్వం పెట్టిన బాధలను భరించలేక ఏకంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. ఆనాటి ప్రభుత్వం పెట్టిన హింసను భరించలేక 2021 జూన్ నెలలో వేములఘాట్ గ్రామ రైతు తూటుకూరి మల్లారెడ్డి, కూల్చివేసిన తన ఇంటిలోని కట్టెలను పోగుచేసి దానినే చితిగా మార్చుకొని తనకు తాను ఆ చితిమంటల్లో ఆత్మార్పణ చేసుకున్నాడు.
మల్లన్న సాగర్‌లో రైతులను దేశద్రోహులుగా చిత్రీకరించారు.పిల్లా ,పాపా, ముసలి అనే తేడా లేకుండా రాత్రికి రాత్రి వారిని అరెస్ట్ చేసి సంకెళ్లు వేశారు. మల్లన్న సాగర్ విషయంలో రైతులకు సంబంధించి ఇలాంటి యధార్ధ కథనాలు కోకోల్లలు. ”అధికారం పోయిన ఏడాదిలోనే ఇంత అసహనం, అసాంఘిక శక్తులుగా మారిన బి ఆర్ ఎస్ నిజస్వరూపం ప్రజలకు అర్దమవుతోంది” అని అన్నారు.