ఆకాశమంత విస్తరించిన ప్రేమతో…. సంసార సాగరంలో
అనురాగ మేఘాల్ని పుట్టించి
అన్నం ముద్దలు చేసి
ఆకలి కడుపులు నింపి
కష్టజీవిగా
ఇలలో బతికేవాడు నాన్న…..!!
సమస్యలలో నలుగుతున్నా
దుఃఖాన్ని దిగమింగుతూ
కుటుంబానికి
సంతోషాన్ని పంచుతూ…
పిల్లల్ని చేయి పట్టి నడుపుతూ….
బ్రతుకు బాటలో
మెలకువలను నేర్పించి
ధన్యజీవిగా ….
మదిలో మెదిలేవాడు నాన్న….!!
సుతారంగా చెంపలు నిమిరే
చలిగాలిలా తాకే
నాన్న వాత్సల్యంలో
దాగుంది …..
వయసుని లెక్క చేయని ధైర్యం….!!
గడ్డి పై మెరుస్తున్న
మంచు ముత్యాల లాంటి..
నాన్న మాటలలో
కనబడుతోంది …..
చేతకు చెయ్యందించే తత్వం…..!!
పూదోటను మరిపించే
మట్టి పరిమళం లాంటి
“నాన్న చేతి స్పర్శతో”
అడుగులో అడుగు వేసి
పుష్పించాను కొత్తగా ….
జన్మించాను సరికొత్తగా ….!!
-నలిగల రాధికా రత్న