– రాజధాని రైతులకు రోజువారి కౌలు రూ.148
– ఇది కూడా సకాలంలో ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం వేధింపులు
– గ్రామ వాలంటీర్లు, ఉపాధి కూలీల కన్నా తీసికట్టు
– భూములు ఇచ్చారనే కక్ష..అంతా వివక్ష
రాజధాని అమరావతి కోసం భూముల త్యాగం చేసిన రైతులకు ఎకరానికి ప్రభుత్వం ఇచ్చే వార్షిక కౌ లు రోజుకు రూ.148. మాగాణి రైతులకు ఎకరానికి రోజుకు ఇచ్చే వార్షిక కౌలు 247. ఇవి కాకి లెక్కలు కాదు. అక్షరాల నిజం. ఈ చిన్న మొత్తాన్ని కూడా జగన్ ప్రభుత్వం సకాలంలో చెల్లించకుండా శాడిజం చూపుతోంది. ప్రతి ఏటా ఇదే రీతిలో త్యాగధనులైన రైతులను ఇబ్బంది పెడుతోంది. గత ఏడాది ఉగాదికి ఇవ్వాల్సిన కౌలు, ఈ ఏడాది ఉగాది దాటినా చెల్లించక పైచాచిక ఆనందం పొందుతోంది.
వైసీపీ ప్రభుత్వం నియమించుకున్న గ్రామ వాలంటీర్లకు ప్రభుత్వం చెల్లించే రోజువారి వేతనం రూ.167. ఇంతకంటే తక్కువగా రాజధానిలోని మెట్ట ప్రాంతంలో అర ఎకరం నుంచి ఎకరానికి రైతులకు ఇచ్చే వార్షిక కౌలు రోజుకు రూ.148.
రోజువారి ఉపాధి కూలీలకు ప్రభుత్వం ఇచ్చే కూలి రూ.272. ఇంతకంటే తక్కువగా జరీబు ప్రాంత రైతులకు ప్రభుత్వం చెల్లించే రోజువారి వార్షిక కౌలు రూ.247. ఇది వాస్తవం.
దీనికీ సతాయింపు
రాజధానికి భూములు ఇచ్చారనే కక్షతోనే జగన్ ప్రభుత్వం ఈ చిన్న మొత్తం కౌలును కూడా సకాలంలో చెల్లించకుండా రైతులను సతాయిస్తోంది.రాజధాని అమరావతి కోసం 27 వేల మంది రైతుల నుంచి 33 ఎకరాలను ఆనాటి చంద్రబాబునాయుడి ప్రభుత్వం సేకరించింది.
ఒప్పందం ప్రకారం .. మెట్ట ప్రాంతంలో ఎకరంలోపు ఉన్న రైతులకు ఏడాదికి రూ.30వేల చొప్పున, మాగాణి, జరీబు ప్రాంతంలో రూ.50వేల చొప్పున వార్షిక కౌలు చెల్లించాలి. ఈ మొత్తాన్ని ఏటా 10శాతం పెంచి 10ఏళ్ల పాటు చెల్లించేవిధంగా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఇప్పటికే కౌలు చెల్లించే ప్రక్రియ ఎనిమిదేళ్లు పూర్తయింది. మరో రెండేళ్ళ పాటే కౌలు చెల్లించాలి.
ఈ కౌలు ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నా రైతులకు ఇచ్చిన పావు శాతం భూమిలో ప్లాట్లను ప్రభుత్వం నేటివరకు అభివృద్ధి చేయలేదు. కౌలు కూడా సకాలంలో ఇవ్వడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు సకాలంలో కౌలు ఇవ్వగా, 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రైతులకు కౌలు సకాలంలో ఇవ్వకుండా సతాయిస్తోంది. కౌలు కోసం రైతులు పతియేటా విజయవాడలోని ధర్నాచౌక్లో ధర్నాలు చేస్తున్నా, విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయాన్ని రైతులు ముట్టడిస్తున్నా,అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించడం లేదు.
దీంతో రైతులు ప్రతిఏటా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి న్యాయ దేవతను ఆశ్రయించాల్సి వస్తోంది. కోర్టు తీర్పు ప్రకారం గత్యంతరం లేని స్థితిలో ప్రభుత్వం ప్రతి ఏటా రైతులకు కౌలు చెల్లించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రతి ఏటా మే 31వ తేదీ లోపు రైతులకు ప్రభుత్వం కౌలు చెల్లించాల్సి ఉండగా, గత ఏడాదితో పాటు ఈ ఏడాది కూడా అదే ధోరణిలో నేటికే కౌలు చెల్లించనేలేదు.
ఉపాధి కోల్పోయి, కౌలు రాక అవస్థలు
రాజధాని ప్రాంతంలో అర ఎకరం, ఎకరం భూమి ఉన్న రైతులు ఆకుకూరలు, కూరగాయలు పండించి వాటిని స్వయంగా విక్రయిస్తూ, ఏడాదికి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఆదాయం పొందేవారు.రాజధాని అమరావతికి భూములు ఇవ్వడంతో స్వయం ఉపాధి కోల్పో యారు. ప్రభుత్వం కూడా సకాలంలో కౌలు చెల్లించనందున పూర్తిగా ఢీలాపడ్డారు.కుటుంబ పోషణ ,పిల్లల చదువులు, వైద్య ఖర్చుల కోసం నానా అగచాట్లు పడుతున్నారు. ఇప్పటివరకు అన్నంపెట్టిన రైతులు చేయి చాచలేక మనోవేదన అనుభవిస్తున్నారు.
అమరావతిని మాస్టర్ ప్లాన్ ను నాశనం చేసే కుట్ర
అమరావతి సమగ్ర ప్రణాళికలో భాగంగా పేదల కోసం చంద్రబాబు R-3 జోన్ లో 1675 ఎకరాలను కేటాయించింది. అయితే అమరావతిని మాస్టర్ ప్లాన్ ని నాశనం చేసి స్లమ్ గా మార్చడానికి పరిశ్రమల కోసం నిర్దేశించిన R-5 జోన్ లో 1402 ఎకరాలను పేదల ఇళ్ల స్థలాల కోసం జగన్ ప్రభుత్వం కేటాయించింది. రాజధానితో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 50 వేల మంది పేదలకు ప్రభుత్వం సెంటు భూములను పంపిణీ చేసింది.తీర్పు కోర్టులో పెండింగ్ లో ఉండగానే, తాడేపల్లి ఇంటి నుంచి 10కిలోమీటర్ల దూరానికి జగన్ హెలికాప్టర్ లో వచ్చి ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి రైతులను అవమానించాడు.
కౌలులో 20 శాతం న్యాయ పోరాటానికే..
చంద్రబాబుపై నమ్మకంతో రైతులు ఎన్ని వేల ఎకరాలు ఇచ్చారనే అక్కసుతోనే జగన్ ప్రభుత్వం రైతులపై కక్ష సాధిస్తోంది. రాష్ట్రానికి మూడు రాజధానులని ప్రకటించింది. విశాఖ నుంచి పాలన చేస్తామని తరచూ ప్రకటిస్తోంది.
భూములు ఇచ్చి సర్వం కోల్పోయామని,అమరావతి రాజధాని కొనసాగించాలని రైతులు తుళ్లూరు, మందడం, దొండపాడు, వెంకటపాలెంఉద్దందరాయునిపాలెం, నెక్కల్లు, అనంతవరం, తాడికొండ తదితర ప్రాంతాల్లో రైతులు చేస్తున్న అమరావతి ధర్మ పోరాట మహా ధర్నాలు 1800 రోజులకు సమీపిస్తున్నాయి. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.
R-5 జోన్ లో చట్ట సవరణ చేయొద్దని, చీకటి జీవో 1/23ని రద్దు చేయాలని, తాము ఇచ్చిన భూములను సద్వినియోగం చేసుకుని అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు న్యాయ పోరాటం చేస్తున్నారు. దీని కోసం రైతులు తమకు వస్తున్న ఎకరం కౌలులో 20% డబ్బును లాయర్ల ఫీజులకే చెల్లించాల్సి వస్తోంది. న్యాయ పోరాటం చేస్తున్న రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం కేసులు వేస్తుండగా, రైతులు తమ కౌలు డబ్బులతోనే ప్రభుత్వం పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది.
రైతులను ప్రభుత్వం గద్దలా రోజూ పొడుచుకు తింటోంది. నెలకో కొత్త జీవో తెస్తూ రైతుల పుండు మీద కారం చల్లుతోంది. కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ అరాచక వైసీపీ ప్రభుత్వంపై రైతులు విజయం సాధించాలని కోరుకుందాం..అమరావతి నిలబడాలని దేవుడిని వే డుకుందాం.
– కలారి నరసింహారావు