10 లక్షల మందితో 3న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ

-కార్యకర్తలతోపాటు లబ్దిదారులు, సామన్య ప్రజలు సభకు తరలివచ్చేలా ఏర్పాట్లు
-ఎన్ని అడ్డంకులు స్రుష్టించినా ఎన్ఈసీ సమావేశాలను సక్సెస్ చేస్తాం
-ప్రతి కార్యకర్తను భాగస్వాములను చేసేందుకు నిధి సేకరిస్తున్నాం
-ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు రూపంలో విరాళాలు ఇవ్వొద్దు
-పార్టీ పేరిట డిజిటిల్ పేమెంట్ల రూపంలో మాత్రమే విరాళాలు సేకరిస్తాం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వెల్లడి
-జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ నేతలు

రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డుంకులు స్రుష్టించినా వచ్చే నెల 2, 3 తేదీల్లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ (ఎన్ఈసీ) సమావేశాలను దిగ్విజయవంతం చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. అందులో భాగంగా వచ్చే నెల 3న సాయంత్రం కనీవినీ ఎరగని రీతిలో హైదరాబాద్ లో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఉద్ఘాటించారు. రాష్ట్రంలోని 34 వేల పోలింగ్ బూత్ కార్యకర్తలను, కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన వారితోపాటు సామాన్య ప్రజలు కూడా బహిరంగ సభకు తరలివచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్ఈసీ సమావేశాల నేపథ్యంలో బండి సంజయ్ తోపాటు ఎన్ఈసీ ఏర్పాట్ల స్టీరింగ్ కమిటీ సభ్యులు, రాష్ట్ర నేతలు ఈరోజు నోవాటెల్ ను సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్ఈసీ సమావేశ ఏర్పాట్ల జాతీయ ఇంఛార్జీ అరవింద్ మీనన్ తోపాటు మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బంగారు శ్రుతి, కొల్లి మాధవి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, రాష్ట్ర నాయకులు సింగాయపల్లి గోపి, గడీల శ్రీకాంత్ సహా పలువురు నేతలు బండి సంజయ్ తోపాటు ఉన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు..

కోవిడ్ తరువాత మొదటి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలని జాతీయ నాయకత్వం నిర్ణయించడం సంతోషం. మాకు అవకాశం ఇవ్వాలని కోరిన వెంటనే అంగీకరించిన జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు. ప్రతి కార్యకర్త ఇది ఒక అద్రుష్టంగా, అవకాశంగా భావిస్తున్నారు.
వచ్చేనెల 2, 3 తేదీల్లో హైదరాబాద్ లో ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. జాతీయ పదాధికారులు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, సంఘటనా మంత్రులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులుసహా దాదాపు 300 మందికిపైగా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశ ఏర్పాట్లకు సంబంధించి దాదాపు 34 విభాగాలను ఏర్పాటు చేశాం. గత 15 రోజులుగా ఏర్పాట్లపై సమీక్షిస్తున్నాం.

ఎన్ఈసీ సమావేశాల్లో భాగంగా ఉదయం పార్టీ జాతీయ పదాధికారుల సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం నుండి మరుసటి రోజు సాయంత్రం వరకు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. అనంతరం హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నాం. తెలంగాణలో ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పన్నుల భారం మోపుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను రాచి రంపాన పెడుతోంది. టీఆర్ఎస్ పాలనలో హత్యలు-అత్యాచారాలు-కబ్జాలు ఎక్కువయ్యాయి. ఈ అవినీతి-నియంత- కుటుంబ-నయా నిజాం పాలనకు వ్యతిరేకంగా, హత్యలు, అత్యాచారాలు, కబ్జాలపై బీజేపీ అనేక పోరాటాలు చేస్తోంది. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కేసులు పెట్టినా, లాఠీఛార్జీలు చేసినా బెదరకుండా ధీటుగా పోరాడుతున్నం. ఈ నేపథ్యంలో ప్రజల్లో బీజేపీ పట్ల మరింత బిశ్వాసం పెంపొందించడానికి కార్యవర్గ సమావేశాలు జరగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సహా జాతీయ నాయకత్వమంతా హైదరాబాద్ లో రెండ్రోజులుండటం కార్యకర్తలకు మరింత భరోసా ఏర్పడనుంది. సమావేశాల ముగింపు అనంతరం సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నం. 10 లక్షలకుపైగా జన సమీకరణతో కనీవినీ ఎరగని రీతిలో బహిరంగ సభను సక్సెస్ చేస్తాం. తుక్కుగూడ సభకు మించి సామాన్య ప్రజలతో సభ నిర్వహింబోతున్నం. సభా స్థల వేదిక ఖరారుపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తాం. 34 వేల పోలింగ్ బూత్ కార్యకర్తలతోపాటు సామాన్య ప్రజలు, కేంద్ర పథకాల లబ్దిదారులందరూ సభకు తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం.

దీంతోపాటు ఎన్ఈసీ సమావేశాల్లో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో కార్యకర్తల నుండి విరాళాలు సేకరిస్తున్నాం. దాదాపు 50 వేల మంది నుండి నిధిని సేకరిస్తున్నం. ప్రతి పోలింగ్ బూత్ నుండి వెయ్యి రూపాయలు, మండల, జిల్లా, రాష్ట్ర నేతల వరకు రూ. లక్ష చొప్పున నిధిని సేకరిస్తున్నాం. వ్యాపారస్తులు ఎవరైనా లక్షకు మించకుండా విరాళం ఇవ్వవొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ నగదును స్వీకరించబోం. డిజిటల్ పేమెంట్ ద్వారా మాత్రమే విరాళాలు సేకరిస్తాం. పార్టీ రాష్ట్ర శాఖ పేరు మీద మాత్రమే విరాళాలను పంపాలని కోరుతున్నా.ఎన్ని అడ్డంకులు స్రుష్టించినా బహిరంగ సభను, జాతీయ కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేయబోతున్నాం. ఈటల రాజేందర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు… ‘‘కేసీఆర్ మాదిరిగా, టీఆర్ఎస్ మాదిరిగా మా పార్టీ ఉండదు. మా పార్టీలో ఏ నాయకుడైనా వెళ్లి జాతీయ నాయకత్వాన్ని కలుసుకునే అవకాశం ఉంది’’ అని బదులిచ్చారు.

Leave a Reply